సాక్షి, బెంగళూరు : రాష్ర్ట ప్రభుత్వం కొత్తగా రూపొందించిన ఇసుక రవాణా చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇసుక లారీల యజమానులు శనివారం నుంచి బంద్ చేపట్టారు. దీంతో రాష్ర్టంలోని సుమారు పది వేల ఇసుక లారీలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఫలితంగా నిర్మాణ పనులకు అంతరాయం కలుగుతోంది. ముఖ్యంగా నగరంలోని నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులకు ఈ సమస్య మరింత అధికంగా ఉంది. సాధారణంగా నగరంలోని నిర్మాణాలకు ఏ రోజుకారోజు ఇసుక రవాణా అవుతూ ఉంటుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇసుకను సేకరించే లారీల యజమానులు ఆ ఇసుకను నగర శివార్లలోని ప్రాంతాల్లో అమ్ముతుంటారు. ఇలా ఇసుక అమ్మకానికి నగర శివార్లలో కొన్ని ప్రత్యేక స్టాండ్లు కూడా ఉంటాయి.
ఆయా స్టాండ్లలో ఇసుకను కొన్న తర్వాత కొనుగోలుదారులు చెప్పిన చిరునామాకుఇసుకను చేరవేస్తూ ఉంటారు. ప్రస్తుతం లారీల యజమానుల సంఘాలు బంద్‌కు పిలుపునివ్వడంతో నగరంలో ఇసుక సరఫరా చేస్తున్న దాదాపు నాలుగు వేల లారీలు ఆగిపోయాయి. దీంతో లారీల డ్రైవర్లు, క్లీనర్లు, లోడింగ్, అన్‌లోడింగ్ చేసే కార్మికులు దాదాపు లక్ష మంది శనివారం పనులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అంతేకాక ఇసుక సరఫరా లేకపోవడంతో వివిధ కట్టడాల వద్ద పనిచేస్తున్న నిర్మాణ కూలీలకూ శనివారం నుంచి విధుల్లోకి రావాల్సిన అవసరం లేదంటూ యజమానులు చెప్పడంతో.. ఆ కూలీలు పనిలేక ఇబ్బంది పడాల్సి వచ్చింది.
ఇక ప్రభుత్వం కొత్తగా రూపొందించిన ఇసుక రవాణా చట్టంలో మార్పులు చేసే వరకు బంద్‌ను విరమించే ప్రసక్తే లేదని ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక లారీ ఓనర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు చెన్నారెడ్డి వెల్లడించారు. ఇసుక రవాణా చట్టంలో మార్పులు చేయకపోతే తాము ప్రతి రోజూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, లారీల డ్రైవర్లంతా జైలుకెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతుందని తెలిపారు. కాగా ఇసుక లారీల బంద్ మరో రెండు రోజుల పాటు కొనసాగితే నిర్మాణ కార్యక్రమాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవడంతో పాటు.. ఇసుక ధరలూ విపరీతంగా పెరిగే అవకాశముంది.
చర్చలకు రండి : మంత్రి జయచంద్ర
ఇసుక రవాణా చట్టాన్ని వ్యతిరేకిస్తూ బంద్‌కు పూనుకున్న ఇసుక లారీల యజమానులు తక్షణమే బంద్‌ను విరమించి చర్చలకు రావాలని న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్ర లారీల యజమానులకు సూచించారు. శనివారం ఆయనిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. బంద్‌కు పిలుపునివ్వడానికి ముందు చట్టాలు, నియమావళిని లారీల యజమానులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇసుక రవాణాపై కేంద్ర ప్రభుత్వం చాలా కాలం క్రితమే ఈ చట్టాన్ని రూపొందించిందని, సుప్రీం కోర్టు, హైకోర్టు ఆదేశాలకనుగుణంగా రాష్ట్రంలో తాము ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చామని చెప్పారు. ఇసుక అక్రమ రవాణా కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఎదురవుతున్నాయని, అటువంటి సందర్భంలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఇసుక ప్రభుత్వం ఆస్తి అని, అలాంటి ఇసుకను ప్రభుత్వం నుంచి మాత్రమే పొందాల్సి ఉంటుందని తెలిపారు. ఈ చట్టం వల్ల లారీల యజమానులకు ఏవైనా ఇబ్బందులు ఎదురవుతాయనుకుంటే ప్రభుత్వంతో చర్చలు జరపాలే తప్ప.. బంద్‌ను పాటిం చడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండబోదని పేర్కొన్నారు.
ఆగిన పదివేల ఇసుక లారీలు
Published Sun, Dec 22 2013 2:24 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement