
గీత రచయిత తామరై ఫిర్యాదు
గీత రచయిత తామరై మంగళవారం ఉదయం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఒక ఫిర్యాదు చేశారు.
తమిళసినిమా: గీత రచయిత తామరై మంగళవారం ఉదయం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఒక ఫిర్యాదు చేశారు. ఇటీవల ఈమె తన భర్త త్యాగు తనను, తన కొడుకును వదిలేసి వెళ్లిపోయాడంటూ బహిరంగ పోరాటం చేశారు. తన ఇంటి వద్ద భర్త ఇంటి ముందు స్థానిక నుంగంబాక్కంలో గల వళ్లువర్‌కోట్టం వద్ద ధర్నా చేసి సంచలనం కలిగించారు. చివరికి కొందరు తమిళ రచయితలు కల్పించుకుని తామరైతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించారు.
భర్త త్యాగు తామరైతో కలిసి జీవించడానికి సమ్మతించారు. ఇలాంటి పరిస్థితిలో తామరై సోమవారం పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం గమనార్హం. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల తనకు బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయన్నారు. ఫేస్‌బుక్‌లోను అసభ్య పద జాలాలతో బెదిరిస్తున్నారని తెలిపారు. అదే విధంగా కొందరు ఆగంతుకులు తన ఇంటి వద్ద తచ్చాడుతున్నారని వారెవరో ఎందుకు తన ఇంటి చుట్టూ తిరుగుతున్నారో తనకు బెదిరింపు కాల్స్ చేసేవారెవరో విచారించి తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు.