► అప్రమత్తంగా పళని
► చివరి ప్రయత్నంలో పన్నీరు
► వ్యతిరేకంగా డీఎంకే ఓటు
► కాంగ్రెస్ నాన్చుడు
► గతం పునరావృతం అయ్యేనా?
► సర్వత్రా ఉత్కంఠ
‘గవర్నర్ ఛాన్స్ ఇచ్చారు. సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఇక, బల నిరూపణ లక్ష్యం’ ఇందులో కే పళనిస్వామి సత్తా చాటేనా, పన్నీరు ప్రయత్నాలకు బలి అయ్యేనా..! అన్న హైటెన్షన్ తమిళనాట నెలకొంది. మరికొన్ని గంటల్లో తేలనున్న బలనిరూపణ మీద తమిళ ప్రజానీకం దృష్టి పడింది. ఈ పరీక్షలో పళని నెగ్గేనా..? గతం పునరావృతం అయ్యేనా..! అన్న ఎదురు చూపులు పెరిగాయి.
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే అధికార సమరం క్లైమాక్స్‌కు చేరింది. చిన్నమ్మ శిబిరమా..? పన్నీరు శిబిరమా..?అని ఆసక్తికరంగా సాగిన ఎపిసోడ్‌లో శనివారం క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో అన్న ఉత్కంఠలో తమిళనాడే కాదు, ప్రపంచ దేశాల్లోని తమిళుడు ఎదురు చూపుల్లో పడ్డారు. కీలక మలుపు తిరిగేనా.. అన్న ఉత్కంఠ సర్వత్రా బయలు దేరింది. చిన్నమ్మ శశికళ విధేయుడు కే పళని స్వామి సీఎం పగ్గాలు చేపట్టిన మూడో రోజు జరగనున్న అసెంబ్లీ వేదికగా జరగనున్న బల పరీక్షలో తీర్పు అనుకులమా...? ప్రతి కూలమా..? అన్న చర్చ శుక్రవారం రాష్ట్రంలో జోరందుకుంది. ఎక్కడ చూసినా అవిశ్వాస చర్చే. బల నిరూపణ లక్ష్యంగా పళని స్వామి తీవ్రంగానే కుస్తీలు పట్టారు. ఎమ్మెల్యేలు చేజారి పోకుండా అప్రమత్తంగానే వ్యవహరించారు.
కూవత్తూరు క్యాంప్‌నకు చేరుకుని ఎమ్మెల్యేలతో మాట్లాడారు. చిన్నమ్మ శశికళ సైతం పరప్పన అగ్రహారం చెర నుంచి ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో తమకు ఇచ్చిన హామీల్ని పళని విస్మరించినట్టు పలువురు ఎమ్మెల్యేలు ఆరోపించడం ఆ శిబిరంలో కలవరాన్ని రేపింది. బలపరీక్షలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు ఎగుర వేయకుండా, విప్‌ను సైతం పళని జారీ చేయించడం గమనార్హం. ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నా, శాసన సభలో తిరగబడ్డ పక్షంలో పరిస్థితి ఏమిటో అన్న ఆందోళన పళనిని వీడడం లేదు.
చివరి ప్రయత్నంలో పన్నీరు
బల నిరూపణలో పళని పతనం లక్ష్యంగా చివరి ప్రయత్నాల్లో పన్నీరు శిబిరం నిమగ్నమైంది. బహిరంగ ఓటింగ్ కాకుండా రహస్య ఓటింగ్ సాగే విధంగా చర్యలకు స్పీకర్ ధనపాల్‌కు విజ్ఞప్తి చేశారు. స్పీకర్ తమకు ప్రతికూలంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయన్న ఆరోపణల్ని సైతం ఆ శిబిరం గుప్పించడం గమనార్హం. శిబిరంలోని ముఖ్య నాయకులతో పన్నీరు సెల్వం సమాలోచనలతో రాజకీయ పావుల్ని కదపడంలో తీవ్రంగానే నిమగ్నం అయ్యారు. కూవత్తూరు క్యాంప్‌లో ఉన్న ఎమ్మెల్యేల మద్దతు దారులతో సంప్రదింపులు సాగించినట్టు, సభలో పళనికి వ్యతిరేకంగా వ్యవహరించే విధంగా విజ్ఞప్తి చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇక, అన్నాడీఎంకే తమదేనని చాటుకునేందుకు ప్రయత్నాలు వేగవంతం చేశారు.
తాత్కాలిక ప్రధానకార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్, సీఎం పళని స్వామిలతో పాటుగా పలువురికి ఉద్వాసన పలుకుతూ నిర్ణయం తీసుకోవడం చర్చకు దారి తీసింది. అదే సమయంలో పన్నీరు శిబిరం చేసిన ఫిర్యాదును ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకోవడం, వివరణ కోరుతూ శశికళ శిబిరానికి ఆదేశాలు ఇవ్వడం పన్నీరు శిబిరంలో కాస్త ఆనందాన్ని నింపింది. అయితే, క్యాంప్‌లో ఉన్న ఎమ్మెల్యేలు సభలో ఎలా వ్యవహరిస్తారోనన్న కలవరం పన్నీరు శిబిరాన్ని వెంటాడుతున్నది. ఇక , మైలాపూర్ ఎమ్మెల్యే నటరాజ్ తమ శిబిరంలో అడుగు పెట్టడంతో, మిగిలిన ఎమ్మెల్యేలు తప్పకుండా పన్నీరును ఆదరిస్తారన్న ఆశాభావం పెరిగి ఉన్నది.
వ్యతిరేకంగా డిఎంకే : సభలో పళని స్వామికి వ్యతిరేకంగా ఓటు వేయాలని డిఎంకేతో పాటుగా, మిత్ర పక్షం ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌నిర్ణయం ఢిల్లీకి చేరడంతో ఎలా వ్యవహరిస్తారోనన్న ఉత్కంఠ తప్పడం లేదు.
గతం పునరావృతం అయ్యేనా : ముఫ్‌పై సంవత్సరాల తదుపరి తమిళ అసెంబ్లీలో శనివారం బల పరీక్ష జరగనున్నది. తన బలాన్ని నిరూపించుకునేందుకు సీఎం పళని స్వామి సిద్ధం అయ్యారు. సరిగ్గా పద కొండు గంటలకు సభ ప్రారంభం కానున్నది. బల నిరూపణలో రహస్య ఓటింగ్ సాగేనా, లేదా బహిరంగంగానే ఓటింగ్‌తో ఏదేని వివాదాలు సభలో రాజుకునేనా అన్న ఆందోళన బయలు దేరి ఉన్నది. ఇప్పటి వరకు బల పరీక్షల్లో సీఎంలుగా ఉన్న రాజాజీ, కరుణానిధి నెగ్గారు. ఎంజీఆర్ మరణానంతరం అన్నాడిఎంకేలో అధికారం కోసం తీవ్ర సమరమే సాగింది. ఆయన సతీమని జానకీ రామచంద్రన్, జయలలిత మధ్య సాగిన ఈ సమరంలో జానకీ రామంద్రన్ కు అనుకూలంగా ఫలితం వచ్చింది. అయితే, సభలో కుమ్ములాట, ఉద్రిక్తత పరిస్థితులు రాష్ట్రపతి పాలన వైపుగా అడుగులు పడేలా చేశాయి. ఇదే పరిస్థితి తాజాగా పునరావృతం అయ్యేనా...? లేదా, రాజాజీ, కరుణానిధిలు నెగ్గినట్టుగా పళని స్వామికి మద్దతుగా ఎమ్మెల్యేలు నిలిచేనా అన్నది మరి కొన్ని గంటల్లో తేలనుంది.