అదృశ్యమైన డాక్టర్‌ శవమై తేలాడు | The disappeared doctor is dead | Sakshi
Sakshi News home page

అదృశ్యమైన డాక్టర్‌ శవమై తేలాడు

Published Sun, Jul 2 2017 2:59 AM | Last Updated on Tue, Sep 5 2017 2:57 PM

అదృశ్యమైన డాక్టర్‌ శవమై తేలాడు

అదృశ్యమైన డాక్టర్‌ శవమై తేలాడు

అన్నానగర్‌: కొద్ది రోజుల క్రితం మాయమైన డాక్టర్‌ మృతదేహంగా తాగునీటి తొట్టిలో లభించిన సంఘటన కొళత్తూరులో చోటు చేసుకుంది. వివరాలు.. చెన్నై సమీపం కొళత్తూరు పూంపుహార్‌నగర్‌ 2వ మెయిన్‌రోడ్డులో నివసిస్తున్న నాగరాజన్‌ భార్య శాంతి. వీరి కుమారుడు రాజేష్‌కుమార్‌(26). కుమార్తె శ్రీలేఖ. వీరి సొంత ఊరు శివగంగై జిల్లా తిరుప్పత్తూరు. డాక్టర్‌ అయిన రాజేష్‌కుమార్‌ మొగప్పేర్‌లో క్లినిక్, మందుల దుకాణం నడుపుతున్నాడు.

మందుల దుకాణాన్ని ఇతని తండ్రి నాగరాజన్‌ చూసుకుంటాడు. డాక్టర్‌ రాజేష్‌కుమార్‌కి, కారైకుడికి చెందిన ఓ మహిళకు 3వ తేదిన కారైకుడిలో వివాహం చేయడానికి పెద్దలు నిశ్చయించారు. నాగరాజన్, శాంతి తమ బంధువులకు పెళ్లి కార్డు ఇవ్వడానికి సొంతూరు తిరుపత్తూరుకి వెళ్లారు. ఇంట్లో రాజేష్‌కుమార్, అతని చెల్లి శ్రీలేఖ మాత్రమే ఉన్నారు. గత 28వ తేదీన ఇంటి నుంచి బయటికెళ్లిన రాజేష్‌కుమార్‌ మాయమయ్యాడు. దిగ్భ్రాంతి చెందిన శ్రీలేఖ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. వెంటనే వారు చెన్నైకి వచ్చి స్నేహితులు, బంధువుల ఇంట్లో వెతికినా అతని ఆచూకి లభ్యం కాలేదు.నాగరాజన్‌ ఫిర్యాదు మేరకు కొళత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి రాజేష్‌కుమార్‌ కోసం వెతుకుతున్నారు.

ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం కొళత్తూరు పూంపుహార్‌ నగర్‌లోని చెన్నై తాగునీటి కార్యాలయంలో ఉన్న తాగునీటి తొట్టి నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.దీంతో అన్నానగర్‌ జాయింట్‌ కమిషనర్‌ సుధాకర్, విల్లివాక్కం జాయింట్‌ కమిషనర్‌ జయసింగ్, కొళత్తూరు ఇన్‌స్పెక్టర్‌ మునిశేఖర్, రాజమంగళం గోపీనాథ్‌ సంఘటన స్థలానికి చేరుకుని తాగునీటి తొట్టి మూతను కొర్‌లాన్‌యంత్రంతో తెరచి చూశారు. అందులో డాక్టర్‌ మృతదేహం కుళ్లిన స్థితిలో పడిఉంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి డాక్టర్‌ రాజేష్‌కుమార్‌ని ఎవరైనా హత్య చేసి మృతదేహాన్ని తాగునీటి తొట్టిలో విసిరేసి వెళ్లారా? లేదా అతనే ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. 3వ తేదీ వివాహం జరగాల్సిన స్థితిలో డాక్టర్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement