
ప్రేమ పేరుతో వంచన..
- గర్భం దాల్చిన యువతి.. విషయాన్ని దాచిపెట్టిన వైనం
-మరో యువకుడితో పెళ్లి చేసిన తల్లిదండ్రులు
-వరుడు నిలదీయడంతో వెలుగులోకి వచ్చిన వంచన
మండ్య : ప్రేమ, పెళ్లి పేరుతో యువతిని వంచించిన యువకుడు ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. ఆమె గర్భం దాల్చడంతో ముఖం చాటేశాడు. అయితే బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పుకోలేకపోయింది. ఈ విషయం తెలియని తల్లిదండ్రులు ఆ యువతికి ఇటీవల ఓ యువకుడితో వివాహం చేయగా.. వంచన విషయం వెలుగు చూసింది. ఈ ఘటన కర్నాటకలోని మాండ్య జిల్లా నాగమంగళ గ్రామీణ పోలిస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసుల కథనం మేరకు.. నాగమంగళ తాలూకాలోని బిండేనహళ్లి గ్రామానికి చెందిన యువతికి మండ్య తాలూకాలోని దొడ్డగరుడనహళ్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. దీంతో ఇద్దరూ సన్నిహితంగా మెలిగారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చంద్రశేఖర్ ఆ యువతికి హామీ ఇచ్చాడు. దీంతో శారీరకంగా ఒక్కటయ్యారు. ఫలితంగా ఆ యువతి గర్భం దాల్చింది. తనను పెళ్లి చేసుకోవాలని యువతి కోరడంతో ప్రియుడు ముఖం చాటేశాడు. ఈ విషయాన్ని ఆ యువతి బయట పెట్టలేకపోయింది. మరో వైపు తల్లిదండ్రులు ఆ యువతికి తాలూకాలోని కసళగెరె గ్రామానికి చెందిన యువకుడి(30)తో ఈ నెల 8న ఆదిచుంచనçగిరిలో పెళ్లి జరిపించారు. యువతిలో వచ్చిన శారీరక మార్పులపై వరుడు, బంధువులు ఆరా తీయగా ఎనిమిది నెలల గర్భవతిగా తేలింది. చంద్రశేఖర్ అనే వ్యక్తి తనను వంచించాడని యువతి పేర్కొనడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు..చంద్రశేఖర్ కోసం గాలింపు చేపట్టారు.