- సీఎల్‌పీ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆగ్రహం
- సమస్యలు పట్టించుకోవడం లేదంటూ అసంతృప్తి
- ఇలాగే ఉంటే లోక్‌సభ ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తప్పవని హెచ్చరిక
- ‘ఆప్’ విధేయ ఐఏఎస్ అధికారిపై మండిపాటు
- ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
సాక్షి, బెంగళూరు : రాష్ట్ర మంత్రులు ఎప్పటి లాగానే తమను నిర్లక్ష్యం చేస్తున్నారని పలువురు ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. విధాన సౌధలో గురువారం జరిగిన సీఎల్‌పీ సమావేశంలో బిజాపుర, గుల్బర్గ, హావేరి జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు ఎంబీ. పాటిల్, ఖమరుల్ ఇస్లాం, ప్రకాశ్ హుక్కేరిల వ్యవహార శైలిపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమ జిల్లాల సమస్యలు చెప్పుకోవడానికి ఎప్పుడు వెళ్లినా సమయం లేదనే సమాధానం ఎదురవుతోందని వాపోయారు. తద్వారా అభివృద్ధి పనుల్లో వెనుకబడి పోతున్నామని వాపోయారు. వీరి వైఖరి వల్ల తాము కార్యకర్తల వద్ద తలెత్తుకోలేక పోతున్నామని ఫిర్యాదు చేశారు.
పరిస్థితి ఇదే మాదిరి కొనసాగితే లోక్‌సభ ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తప్పవని హెచ్చరించారు. కనుక ఆ ముగ్గురినీ ఇన్‌చార్జ్‌లుగా తొలగించాలని డిమాండ్ చేశారు. కొందరు ఎమ్మెల్యేలు నేరుగా తన వ్యవహార శైలినే ప్రశ్నించడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మౌనాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. మంత్రులు టీబీ. జయచంద్ర, కేజే. జార్జ్‌లు వారిని అనునయించడానికి ప్రయత్నించారు. సీఎల్‌పీ సమావేశం 8.30 గంటలకు ప్రారంభమైనా మొదట్లో 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే హాజరయ్యారు. తర్వాత ఒక్కొక్కరుగా 45 మంది వచ్చారు.
ఐఏఎస్ అధికారిపై ఆగ్రహం
సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీవత్స కృష్ణ ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్) అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌ను ఆకాశానికెత్తేస్తూ ఓ ఆంగ్ల పత్రికలో రాసిన వ్యాసంపై సీఎల్‌పీ సమావేశంలో దుమారం చెలరేగింది. ఆ అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో ‘ఆప్’ విజయం సాధించడం ద్వారా భారతీయ రాజకీయాల్లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందంటూ వ్యాసంలో పొగడ్తలతో ముంచెత్తారని తెలిపారు.
యూపీఏ సర్కారు కుంభకోణాలైన బొగ్గు, 2జీ స్కామ్‌లను కూడా ప్రస్తావించారని పేర్కొన్నారు. దీని వల్ల కాంగ్రెస్ పార్టీకి ముఖం చెల్లకుండా పోయే పరిస్థితి తలెత్తిందని, కనుక ఆయనపై చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే ఏకంగా ఆ వ్యాసాన్ని ముఖ్యమంత్రికి చూపించారు. ఫొటోస్టాట్ ప్రతులను సహచర ఎమ్మెల్యేలకు పంచి పెట్టారు. ఆ అధికారిని పిలిపించి వివరణ కోరతానని సీఎం హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యేలు శాంతించినట్లు తెలిసింది.