ఆమ్ ఆద్మీ పార్టీ చీమ చిటుక్కుమన్నా ఆందోళనకు లోనవుతుందేమోననే వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇందుకు కారణం ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు గోవాకు వెళుతున్నట్టు సమాచారం అందగానే తక్షణమే వెనక్కి రావాలంటూ ఆదేశించడమే. అయితే వారంతా సాయంత్రానికే తిరిగి నగరానికి రావడంతో ఉత్కంఠకు తెరపడింది.
న్యూఢిల్లీ: తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆకస్మికంగా గోవాకు వెళ్లడం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) లో కలకలం రేపింది. వీరంతా బీజేపీలో చేరతారేమోననే వదంతులు వచ్చినప్పటికీ అదేమీ లేదంటూ ఆప్ నాయకులు కొట్టిపారేశారు. ఈ విషయమై ఆ పార్టీ నాయకుడు మనీష్ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ తామంతా ఏకతాటిపైనే ఉన్నాన్నమన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోరన్నారు. కాగా ఆప్ ఎమ్మెల్యేలు అశోక్ కుమార్ చౌహాన్, ధర్మేందర్‌సింగ్ కోలి, ప్రకాశ్ జర్వాల్‌లు ఆదివారం మధ్యాహ్నం గోవాకు వెళ్లిపోయారు. విమానాశ్రయానికి చేరుకున్నట్టు సమాచారం అందగానే పార్టీ నాయకులు వారితో మాట్లాడారు. వెంటనే వెనుదిరిగి రావాలని కోరారు. అయితే వారు మాత్రం గోవా వెళ్లిపోయారు. కాగా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు గోవాలోని ఓ బీజేపీ నాయకుడితో భేటీ అయ్యేందుకు వెళ్లినట్టు తెలియవచ్చింది. గోవాకు చేరుకున్న అనంతరం వారిలో ఒకరితో పార్టీ నాయకులు సంప్రదింపులు జరిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వెనుదిరిగి రావాలని ఆదేశించారు.
అదేమీ లేదు: సిసోడియా
తమ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకే గోవాకు వెళ్లిపోయారంటూ వచ్చిన వార్తలను ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా కొట్టిపారేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు నగరాన్ని వీడి ఎందుకు పోకూడదంటూ ఎదురుప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా తరచూ నగరాన్ని వీడి ఇతర ప్రాంతాలకు వెళుతుంటారు కదా అని అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను చీల్చేందుకు కుట్ర పన్నుతోందని, అయితే ఆ యత్నాలేవీ సఫలం కావడం లేదన్నారు. ఇదిలాఉండగా సాయంత్రానికల్లా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు నగరానికి చేరుకోవడంతో ఉత్కంఠకు తెరపడింది. తాము ఏ పార్టీలో చేరడం లేదని, ఆప్‌లోనే కొనసాగుతామని ప్రకటించారు.
ప్రభుత్వ ఏర్పాటుకు మరిన్ని యత్నాలు బీజేపీపై కేజ్రీవాల్ ఆరోపణస్త్రాలు
న్యూఢిల్లీ: శాసనసభ రద్దుకు ముందే ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ మరిన్ని ప్రయత్నాలు చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఇప్పటికే తమ పార్టీకి చెందిన అనేకమంది ఎమ్మెల్మేలతో సంప్రదింపులు జరిపిందన్నారు. అయితే ఆ పార్టీలో చేరేందుకు తమ శాసనసభ్యులెవరూ సన్నద్ధంగా లేరన్నారు. పితృపక్షం కారణంగా బీజేపీ ప్రస్తుతం ఈ విషయంలో మౌనంగా ఉంటోందన్నారు. ఈ నెల 25వ తేదీన ప్రభుత్వ ఏర్పాటుకు యత్నించొచ్చని జోస్యం చెప్పారు. మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల తర్వాత ఈ యత్నాలను ముమ్మరం చేస్తుందని ఆయన ఆరోపించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను రూ. 4 లేదా ఐదుకోట్ల మేర ఆశచూపి తనవైపునకు తిప్పుకునేందుకు యత్నిస్తుందన్నారు.
గోవాకు ముగ్గురు ఎమ్మెల్యేలు ‘ఆప్’లో కలకలం!
Published Mon, Sep 22 2014 11:11 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement