మీరు 40 మంది కదా..‘సర్కార్’కు సిద్ధమేనా! | Dissolve Delhi assembly, demands Manish Sisodia | Sakshi
Sakshi News home page

మీరు 40 మంది కదా..‘సర్కార్’కు సిద్ధమేనా!

Published Sat, Feb 15 2014 11:31 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

Dissolve Delhi assembly, demands Manish Sisodia

సాక్షి, న్యూఢిల్లీ:  ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్‌ను గద్దెదింపిన కాంగ్రెస్, బీజేపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని మనీష్ సిసోడియా సూచించారు. తాము 40 మందిమి అని అసెంబ్లీలో ప్రకటించుకున్న కాంగ్రెస్, బీజేపీ సభ్యులకు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే ప్రజలూ హర్షిస్తారని సిసోడియా ఎద్దేవా చేశారు. 20 ఏళ్లుగా కలిసే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కదా అంటూ దెప్పిపొడిచారు. కేజ్రీవాల్ నివాసంలో శనివారం రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం అనంతరం  మనీష్ సిసోడియా. సంజయ్ సింగ్, యోగేంద్ర యాదవ్, గోపాల్‌రాయ్ విలేకరుల సమావేశం నిర్వహిం చారు, ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వం ముఖేష్ అంబానీపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినందువల్లనే బీజేపీ, కాంగ్రెస్ తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుమ్మక్కయ్యాయని సంజయ్‌సింగ్ ఆరోపించారు. 40 మంది అంబానీ సోదరులు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆయన వ్యాఖ్యానించారు.
 
 తమ ప్రభుత్వం వీరప్ప మొయిలీ, ముఖేష్ అంబానీ తదితరులపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిందని,  కామన్వెల్త్ క్రీడల కుంభకోణంపై రెండు, డీజేపీ అక్రమాలపై ఐదు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేసిందని, వీటి దర్యాప్తు మున్ముందు కూడా సజావుగా జరిగేలా చూడాలని ఆయన కోరారు. కామన్వెల్త్ క్రీడల ఫైళ్లను తాను స్వయంగా చూశానని, రూ. ఐదు వేల విలువైన ఖరీదుచేసే లైట్లను షీలాదీక్షిత్ హయాంలోని ఢిల్లీ ప్రభుత్వం రూ. 27 వేలకు ఖరీదు చే స్తే, దానినే బీజేపీ నేతృత్వంలోని ఎమ్సీడీ రూ. 31 వేలకు   కొనుగోలు చేసినట్లు బయటపడిందని సిసోడియా చెప్పారు.
 
 ఆప్ సిఫారసు చెల్లదు..
 అసెంబ్లీని  రద్దు చేసి  మళ్లీ ఎన్నికలు జరిపించాలని  కేజ్రీవాల్  కేబినెట్  లెఫ్టినెంట్ గవర్నర్‌కు సిఫారసుచేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీని రద్దు చేయాలని సిఫారసు చేసే అధికారం కేబినెట్‌కు లేదని దానికి ఎల్జీ కట్టుబడి ఉండనవసరం లేదని కొందరు అంటున్నారు. సంఖ్యాబలం లేకపోవడం వల్ల ప్రభుత్వం ఏర్పాటుచేయబోమని బీజేపీ స్పష్టం చేయడంతో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశాలు లేకుండాపోయాయి .70 మంది సభ్యుల శాసనసభలో బీజేపీకి 32 మంది సభ్యులున్నారు.  8 మంది సభ్యులున్న కాంగ్రెస్‌కు ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశమే లేదు.  అయితే బీజేపీ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని మనీష్ సిసోడియా సూచించడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్, బీజేపీలు  శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రతిసారీ ‘మేం నలభైమందిమి..  మాదే మెజారిటీ..’ అని చాటుకున్నాయని, అందువల్ల 32 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేయాలని యోగేంద్ర యాదవ్ డిమాండ్ చేసి మనీష్ సిసోడియా వ్యాఖ్యను బలపరిచారు.  
 
 ఆప్‌కు మేం మద్దతు ఉపసంహరించుకోలేదు: కాంగ్రెస్
 ఆప్ సర్కార్‌కు తాము మద్దతు ఉపసంహరించుకోలేదని, కేజ్రీవాల్ తనంతట తానుగా రాజీనామా చేశారని కాంగ్రెస్ తెలిపింది. లోక్‌సభ ఎన్నిలకు పార్టీ ఎలాగూ సిద్ధమవుతోందని, విధానసభ ఎన్నికలు కూడా జరిపితే తాము సిద్ధమని  తూర్పు ఢిల్లీ ఎంపీ సందీప్ దీక్షిత్ చెప్పారు. లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు.
 
 మాకు సంఖ్యాబలం లేదు: బీజేపీ
 ఎన్నికలకు సిద్ధమని అప్పుడూ చెప్పామని, ఇప్పుడూ చెబుతున్నామని బీజేపీ నేత హర్షవర్ధన్ పేర్కొన్నారు.  అసెంబ్లీ ఎన్నికలను  రేపు పెట్టినా, లోక్‌సభ ఎన్నికలతో పాటు జరిపినా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. కేజ్రీవాల్  రాజీనామా అనంతరం  రాజకీయ వ్యూహాన్ని చర్చించడం కోసం ఢిల్లీ బీజేపీ శాసనసభ్యులు శనివారం సమావేశమయ్యారు. ఎన్నికల కోసం సిద్ధంగా ఉండాలని ఈ సమావేశంలో పార్టీ నేతలు ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ సమావేశం తర్వాత విజయ్ గోయల్, హర్షవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగబద్ధ పద్ధతిలో జన్‌లోక్‌పాల్ బిల్లు తేవడానికి వీలు, సమయం ఉన్నప్పటికీ కేజ్రీవాల్ సర్కార్ అటువంటి ప్రయత్నం ఏమీ చేయలేదని హర్షవర్ధన్ ఆరోపించారు.
 
 ఆప్ సర్కార్ బాధ్యతల నుంచి పారిపోయిందని, ప్రజలను తప్పుదారిపట్టిస్తోందని ఆయన విమర్శించారు. జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ డ్రామా ఆడిందని ఆయన  ఆరోపించారు. రాజీనామాతో కేజ్రీవాల్, ఆప్ నైజం బయటపడిందన్నారు. ఫిబ్రవరి 18న జంతర్ మంతర్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ ధర్నా నిర్వహిస్తుందని విజయ్ గోయల్ ప్రకటించారు. ఎన్నికల హామీల విషయంలో ఆప్ సర్కార్ వైఫల్యాన్ని, ఆ పార్టీ గుట్టును తాము బయపటపెడ్తామని గోయల్ తెలిపారు. సంఖ్యాబలం లేందువల్ల సర్కారు ఏర్పాటుచేయబోమని  బీజేపీ నేత నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. కాగా, ఎన్నికలకు సిద్ధమని పార్టీ ప్రకటిస్తున్నప్పటికీ ఆరు నెలల్లోనే మరోమారు ఎన్నికల్లో పోటీ చేయడానికి పలువురు ఎమ్మెల్యేలు భయపడ్తున్నారు.
 
  బిన్నీ,షౌకీన్‌ల ‘రాజకీయం’..
 ఢిల్లీలో నెలకొన్న రాజకీయ సంక్షోభంలో తమ రాజకీయ భవితవ్యాన్ని పదిలం చేసుకోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బహిష్కృతుడైన  వినోద్‌కుమార్ బిన్నీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రామ్ బీర్ షౌకీన్ ప్రయత్నించారు. ఢిల్లీ వాసులపై అప్పుడే ఎన్నికల భారం  మోపడం తగదని, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే తాను మద్దతిస్తానని బిన్నీ ప్రకటించారు.కేజ్రీవాల్‌కు ప్రభుత్వాన్ని నడపడం రాదని, తాను ఆయన కన్నా మెరుగ్గా ప్రభుత్వాన్ని నడపగలనని, దీనిపై  బీజేపీ, కాంగ్రెస్‌లను సంప్రదిస్తానని రామ్ బీర్ షౌకీన్ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికలపై కన్నేసిన కేజ్రీవాల్ ముందస్తు ప్రణాళికలో భాగంగానే సీఎం పదవికి రాజీనామా చేశారని బిన్నీ ఆరోపించారు.
 
 రాజ్యాంగాన్ని గౌరవించనందువల్లే..
 ‘ఆప్’ రాజీనామాపై మాజీ సీఎం షీలా
 న్యూఢిల్లీ: రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిం చినందువల్లే ఆప్ సర్కార్ రాజీనామా చేయాల్సి వచ్చిందని శనివారం మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ సమస్యలను పరిష్కరించడంలో విఫలమవ్వడానికి కారణం వారు(ఆప్) రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించారు.. మేం మా మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను నెరవేర్చేందుకే ఆప్‌కు బయటనుంచి మద్దతు ఇచ్చాం.. అయితే అది నిలబెట్టుకోవడం వారికి చేతకాలేదు..’ అని విమర్శించారు. ఎన్నికలు తొందరగా జరగాలని కాంగ్రెస్ కోరుకుంటోందా అని అడగ్గా అది లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయంపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు.  
 
 ఆప్‌ది అనాలోచిత చర్య: సీపీఎం
 న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి తీసుకోకుండా అసెంబ్లీలో జన్‌లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టడం ఆప్ సర్కార్ అనాలోచిత చర్యగా సీపీఐ(ఎం) విశ్లేషించింది. ఈ మేరకు ఆ పార్టీ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ముందస్తు అనుమతి లేకుండా బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా కేజ్రీవాల్ సర్కార్ కాంగ్రెస్, బీజేపీలకు అవకాశమిచ్చినట్లయ్యిందని అందులో సీపీఎం నాయకులు పేర్కొన్నారు. దాంతో వారు రాజకీయం చేసి కేజ్రీవాల్ రాజీనామా చేసేలా రాజకీయం చేశాయని ఆరోపించారు. ముఖేష్ అంబానీపై కేసు పెట్టినందుకే బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం చేసి కేజ్రీవాల్ గద్దె దిగేటట్లు డ్రామాలాడాయని, ప్రజలు దీన్ని గమనిస్తున్నారని హెచ్చరించారు.
 
 నమ్మకాన్ని వమ్ము చేసింది: గోయల్
 న్యూఢిల్లీ: నగరవాసుల నమ్మకాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ వమ్ము చేసిందని, బాధ్యతల నుంచి తప్పించుకుంటోందని బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్ ఆరోపించారు. మావోయిస్టు భావజాలంతో ఆప్ నగరంలో ఆరాచకం సృష్టించిం దని గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువల కు తిలోదకాలిచ్చి, రాజ్యాంగ నిబంధనలను కాలరాసిందన్నా రు. ఆ ప్రభుత్వ తీరు ముమ్మాటికీ అరాచకమే. ఆప్ మంత్రు ల్లో కొందరిపై అవినీతి ఆరోపణలున్నా వారిని తప్పించకుం డా జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం పట్టుబట్టడడమేంటని ఆయన ప్రశ్నించారు. ఆప్ ప్రస్థానం ముగియడంతో నగరంలో మావోయిస్టు పాలన అంతమైందన్నారు. ఇకపై ఆప్ వైఫల్యాలపై నగరంలో ఇంటింటా ప్రచారం చేస్తామన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement