సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికలు ఖాయమని తేలడంతో ప్రధాన రాజకీయ పార్టీలు చురుగ్గా మారాయి. విధానసభ రద్దు ప్రతిపాదనను కేంద్ర మంత్రిమండలి ఆమోదం లభించిందనే విషయం తెలియగానే తాజా ఎన్నికల్లో గెలుపుకోసం వ్యూహరచన దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలు, నాయకుల ఆరోపణలు, విమర్శలు కురిపిస్తూ గెలుపు తమదేననే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ రాష్ర్ట శాఖ నాయకులు మంగళవారం మధ్యాహ్నం సమావేశమై ఎన్నికల వ్యూహంపై చర్చించారు. ఎంపీలు. ఎమ్మెల్యేలు, పదాధికారులతోపాటు ప్రముఖ నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలు, ఆ పార్టీకి చెందిన ఇతర ప్రముఖ నేతలు కూడా కేజ్రీవాల్ నివాసంలో సమావేశమై చర్చలు సాగించారు.
ఆప్, బీజేపీ మధ్యే పోటీ?
స్థానికంగా మూడు ప్రధాన పార్టీలు ఉన్నప్పటికీ తాజాగా జరగనున్న ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ రేసులోనే లేదని, ఢిల్లీ ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీల్లో ఏదో ఒకదానిని ఎంచుకోవాల్సి ఉంటుందని ఆప్ నేత మనీష్ సిసోడియా వ్యాఖ్యానించారు. అభివృద్ధే ప్రధాన ప్రధాన అంశంగా పోటీ చేస్తామన్నారు. ఎన్నికలలో సీఎం అభ్యర్థిని ప్రకటించబోమని బీజేపీ ఢిల్లీ శాఖ ఇంచార్జి ప్రభాత్‌ఝా స్పష్టం చేశారు. హర్యానా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఆప్ సీఎం అభ్యర్థిగా అరవింద్
అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆప్...ఎన్నికల బరిలోకి దిగనుంది. సీఎం అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించబోమని బీజేపీ అంటున్నప్పటికీ కేజ్రీవాల్, జగ్‌దీశ్ ముఖి మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని ఆప్ పేర్కొంది. బీజేపీ రాష్ట్ర శాఖలో జగదీశ్‌ముఖి మినహా మరో పేరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనకు కనిపించడం లేదని కేజ్రీవాల్ చెప్పారు. సీఎం అభ్యర్థిగా. జగదీశ్ ముఖి పేరును బీజేపీ ప్రకటించలేదని, అందువల్ల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించిందంటూ ఆప్ నేత ఆశుతోష్ ఎద్దేవా చేశారు. కాగా కేజ్రీవాల్ తనను బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పేర్కొనడాన్ని జగదీశ్‌ముఖి ఖండించారు. గత్యంతరం లేకనే తనను ప్రధాన పోటీదారుడిగా కేజ్రీవాల్ పేర్కొంటున్నారన్నారు.
హస్తబలం అంతంతేనా?
ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ కాంగ్రెస్ పార్టీ పేర్కొంటోంది. అయితే లోక్‌సభ, శాసనసభ ఎన్నికలలో ఘోర పరాజయాలతో చిత్తయిన ఆ పార్టీ తదుపరి ఎన్నికల్లోనూ గట్టి పోటీ ఇవ్వకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లోక్‌సభ ఎన్నికల తరువాత రద్దు చేసిన బ్లాకు, జిల్లా స్థాయి కమిటీలను కూడా కాంగ్రెస్ ఇప్పటివరకు పునరుద్ధరించలేదని, సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చాలాకాలంగా చేపట్టకపోవడం వల్ల కార్యకర్తలు సంఖ్య కూడా తగ్గిపోయిందని ఆ పార్టీకి చెందిన ఓ నేత చెప్పారు. ఎన్నికలలో గెలవడం అసాధ్యమే అయినప్పటికీ మరో పదిపదిహేను స్థానాలను అదనంగా గెలుచుకుని జాతీయ రాజధానిలో తన స్థితిని మెరుగుపరచుకోవాలని ఆశిస్తున్నట్టు అదే పార్టీకి చెందిన మరో నేత చె ప్పారు. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది.
మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, ఎల్‌జేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభలోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికారిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఎన్నికలకు అన్ని పార్టీలూ సమాయత్తం
Published Tue, Nov 4 2014 10:29 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement