ఇక బెట్టింగ్‌ల పర్వం | The spate of Betty | Sakshi
Sakshi News home page

ఇక బెట్టింగ్‌ల పర్వం

Published Sat, Apr 19 2014 3:35 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

The spate of Betty

  • అభ్యర్థుల గెలుపోటములపై భారీగా పందాలు
  • డబ్బు కోసం కార్లు, ఇళ్లు, స్థలాలు సైతం కుదవ పెడుతున్న వైనం
  •  బెంగళూరు, శివమొగ్గ,న్యూస్‌లైన్ : రాష్ర్టంలోని 28 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు ముగియడంతో అభ్యర్థుల  గెలుపోటములపై  పందెం రాయుళ్లు రూ. లక్షల వరకు బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా  మాజీ ప్రధాని, ఐదు మంది మాజీ ముఖ్యమంత్రులు ఎన్నికల బరిలో దిగడంతో వారికి లభించే మెజార్టీ తదితర అంశాలపై పందాలు జోరందుకున్నాయి. బైక్‌లు, కార్లు, ఖాళీ ఇంటి స్థలాలు సైతం బెట్టింగ్‌లో పెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

    కేంద్రంలో మోడీ నాయకత్వంలోని బీజేపీ అధికారంలోకి వస్తుందని కొందరు, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు లభిస్తాయని మరి కొందరు బెట్టింగ్ కడుతున్నారు.  కాంగ్రెస్ పార్టీ తక్కువ స్థానాలు లభిస్తే ముఖ్యమంత్రి సిద్దరామయ్య సీటుకు ఎసరు వస్తుందని మరికొందరు బెట్టింగ్ కడుతున్నారు. హాసన్ నుంచి బరిలోకి దిగిన మాజీ ప్రధాని హెచ్ .డీ. దేవేగౌడ అత్యధిక  మెజార్టీ సాధిస్తారని కొందరు, ప్రత్యర్థి పార్టీ వారే గెలుస్తారని పందాలు సాగుతున్నాయి.  

    చిక్కబళ్లాపురం నుంచి  పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రులు వీరప్ప  మొయిలీ (కాంగ్రెస్), హెచ్.డీ. కుమారస్వామి (జేడీఎస్), బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి బచ్చేగౌడ బరిలో ఉండగా ఇక్కడ బీజేపీ, జేడీఎస్‌లపై పెద్ద సంఖ్యలో బెట్టింగ్‌లకు దిగారు.

    బెంగళూరు ఉత్తర లోక్‌సభ నియోజక వర్గం, బెంగళూరు దక్షిణ నియోజక వర్గం, మండ్య, ఉడిపి- చిక్కమంగళూరు, ధార్వాడ, బెంగళూరు గ్రామీణ జిల్లాల నుంచి బరిలోకి దిగిన హేమాహేమీల గెలుపోటములపై పందాలు సాగుతున్నాయి.  శివమొగ్గలో బీజేపీ నుంచి మాజీముఖ్యమంత్రి యడ్యూరప్ప, జేడీఎస్ నుంచి గీతశివరాజ్‌కుమార్, కాంగ్రెస్ నుంచి మంజునాథ్ ఎన్నికల బరిలో నిలిచారు. ప్రధానంగా బీజేపీ, జేడీఎస్ మధ్యనే పోటీ ఉండటంతో ఆయా పార్టీల అభ్యర్థులపై పందాలు జోరందుకున్నాయి.
     
    గతంలో ఐపీఎల్ టీ 20 క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌కు తెరలేపిన వారే ప్రస్తుతం రాజకీయ పార్టీల గెలుపోటములపై పందాలు స్వీకరిస్తున్నట్లు తెలిసింది.  రూ.1000 నుంచి రూ. లక్ష ,అంతకన్నా ఎక్కువ మొత్తంలో బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.  గత లోక్‌సభ ఎన్నికల కంటే ఈ లోక్‌సభ ఎన్నికలలలో 10 శాతం ఓటింగ్ ఎక్కువ జరగడంతో బెట్టింగ్ దందా జోరందుకునిందని పలు పార్టీల నాయకులు అంటున్నారు.  
     
    విశ్రాంతి తీసుకుంటున్న నేతలు
     
    ఎన్నికల క్రతువు ప్రారంభమైనప్పటినుంచి నామినేషన్లు, ప్రచారం, పోలింగ్ వరకు రోజూ నిద్ర లేకుండా పనిచేసిన నేతలు ప్రస్తుతం సేదతీరుతున్నారు. పోలింగ్ వరకు నేతలు ఓటర్లుకు అందుబాటులో ఉండేవారు. కేవలం మిస్‌కాల్ ఇచ్చినా క్షణాల్లో ఫోన్ చేసి చేసి మాట్లాడేవారు. పోలింగ్ ముగియడంతో చాలా మంది నేతలు సెల్‌ఫోన్లు పనిచేయడం లేదు. ఎవరికి ఫోన్ చేసినా  నాట్‌రీచబుల్, స్విచ్‌ఆఫ్ వస్తున్నాయి. మరికొందరి నేతల ఫోన్లు రింగవుతున్నా స్పందించడం లేదు. తిండి తిప్పలు లేకుండా మండే ఎండల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నేతలు అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నారు. మరికొందరు ఏ సెగ్మెంట్‌లో ఎంతమెజారిటీ వస్తుంది, ఏయే బూత్‌లలో ఎన్ని ఓట్లు పడ్డాయనే దానిపై  మద్దతుదారుల ద్వారా సమాచారాన్ని సేకరించే పనిలో తలమునకలై ఉన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement