అతివేగం మింగేసింది
♦ మూడు కార్లు ఢీ
♦ ఏడుగురు మృతి
♦ మరో ఏడుగురి పరిస్థితి విషమం
♦ జాతీయ రహదారిపై ఘోరం
అతి వేగం జాతీయ రహదారిని రక్తసిక్తం చేసింది. మోటారు సైకిలిస్టును తప్పించే క్రమంలో ఏడుగురి ప్రాణాలు గాల్లో కలిశాయి. మరో ఏడుగురు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. వేలూరు సమీపంలోని రత్నగిరి వద్ద ఆదివారం మూడు గంటల సమయంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో మూడు లగ్జరీ కార్లు ధ్వంసం అయ్యాయి.కార్లలో ఉన్న ఆరుగురు, మోటారు సైక్లిస్టు మరణించారు. మృతుల్లో బెంగళూరుకు చెందిన గోవిందరాజ్, కాంచీపురానికి చెందిన జ్ఞానరాజ్, రత్నగిరికి చెందిన మోటార్ సైక్లిస్టు రవికుమార్‌ను గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ వారిలో ఏడుగురు బెంగళూరు వాసులే.
సాక్షి, చెన్నై: అతివేగంగా దూసుకొచ్చిన వాహనాలు ఒకదానికొకటి ఢీకొని ఏడుగురు మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చెన్నై, బెంగళూరు జాతీయ రహదారి రత్నగిరి వద్ద చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు చెన్నై–బెంగళూరు జాతీయరహదారి రత్నగిరి వద్ద ముందు వెళుతున్న బైక్‌ను తప్పించేందుకు వెనుక నుంచి అతి వేగంగా దూసుకొచ్చిన కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు.
దీంతో ఆ కారు వెనుక మరింత వేగంగా దూసుకొచ్చిన లగ్జరీ వాహనాలు ఒక దాని తర్వాత మరొకటి అన్నట్టుగా ఢీకొన్నాయి. ముందుగా రెండు లగ్జరీ కార్లు, తదుపరి ఓ చిన్న కారు, చివర్లో లారీ ఢీకొట్టుకోవడంతో అప్పటికే జరగాల్సింత నష్టం జరిగిపోయింది. మోటారు సైకిలిస్టు గాల్లో ఎగిరిపడ్డాడు. లగ్జరీ కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. అందులో ఉన్న వాళ్లు రక్త గాయాలతో కొట్టుమిట్టాడుతుండడంతో రత్నగిరి వాసులు పరుగులు తీశారు. సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యారు.
సంఘటన స్థలంలోనే లగ్జరీ కార్లలో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మోటారు సైక్లిస్టు మరణించాడు. లగ్జరీ కార్లలో ఉన్న మరో ఇద్దరు కూడా ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందారు. అడుకం పట్టి ఆస్పత్రిలో నలుగురు, వేలూరు సీఎంసీలో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. లగ్జరీ కార్లలో ఉన్న వాళ్లులో ఎక్కువమంది బెంగళూరుకు చెందిన వారుగా గుర్తించారు. రెండు లగ్జరీ కార్లు కర్ణాటక రిజిస్ట్రేషన్లతో ఉండడంతో వాహన నంబర్లు, ఫోన్ నెంబర్ల ఆధారంగా పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు.
ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిలో రెండు గంటల పాటుగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మోటారు సైకిలిస్టు రత్నగిరికి చెందిన రవిగా గుర్తించారు. అలాగే, మృతుల్లో ఒకరు బెంగళూరుకు చెందిన గోవిందరాజన్, కాంచీపురానికి చెందిన జ్ఞానరాజ్ ఉన్నారు. గాయపడ్డ వారిలో గీతన్, ఇషాంత్, శరవణ కుమార్, ప్రమీద్, రూపాశ్రీ, గాయత్రి, మోహన్ ఉన్నారు. వీరంతా బెంగళూరుకు చెందిన వారే. మిగతా మృతుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో ఉన్న ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు.