
రాష్ర్టంలోనూ ఆప్
= 18 జిల్లాల్లో శాఖలు
= ఢిల్లీ విజయంతో నూతనోత్సాహం
= రాష్ర్టంలో పార్టీ విస్తరణపై దృష్టి
= గౌరవనీయులకు ఆహ్వానం
= రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ
= హిరేమఠ్, బాలసుబ్రమణియన్, అశోక్ కుమార్‌లను బరిలో దింపే యత్నం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలను సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది. అరవింద్ కేజ్రీవాల్ స్థాపించిన ఈ పార్టీకి రాష్ర్టంలోని 18 జిల్లాల్లో శాఖలున్నప్పటికీ ఇప్పటి వరకు నిద్రాణమై ఉండేది. ఢిల్లీ ఫలితాలు వెలువడినప్పటి నుంచీ జూలు విదుల్చుకుని రాష్ట్రంలో పార్టీ విస్తరణపై దృష్టిని కేంద్రీకరిస్తోంది.
సమాజంలో గౌరవనీయులైన వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు భావ సారూప్యత కలిగిన పార్టీలను విలీనం చేసుకునే దిశగా ఆ పార్టీ నాయకులు ప్రయత్నాలను ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో సామాజికవేత్త ఎస్‌ఆర్. హిరేమఠ్, మాజీ బ్యూరోక్రాట్ డాక్టర్ వీ. బాలసుబ్రమణియన్, మాజీ పోలీసు అధికారి అశోక్ కుమార్‌లను పోటీ చేయించాలని యోచిస్తోంది. అయితే తాను ఆప్‌కు సూచనలు, సలహాలు ఇస్తానే తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనబోనని హిరేమఠ్ ఇదివరకే స్పష్టం చేశారు. విభిన్న పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న ఆప్ గురించి అనేక మంది వాకబు చేస్తున్నారని ఆ పార్టీ సభ్యుడు పృథ్వీరెడ్డి తెలిపారు.
ఆది నుంచే...
లోక్‌పాల్ బిల్లు కోసం సామాజికవేత్త అన్నా హజారే ఆందోళన ప్రారంభించినప్పటి నుంచే నగర వాసులు అవినీతిపై పోరాటానికి ఆసక్తి చూపారు. ఓ సారి ఆయన నగర పర్యటనకు కూడా వచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ ఆప్‌ను ప్రారంభించినప్పుడు కూడా నగరంలో మంచి స్పందన వ్యక్తమైంది. ఢిల్లీ ఎన్నికలప్పుడు నగర వాసుల్లో కొందరు అక్కడికి వెళ్లి ప్రచారం కూడా నిర్వహించారు. దేశ ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరులో ఆప్‌కు చక్కటి ఆదరణ లభిస్తుందనే అంచనాలున్నాయి.
రాష్ట్రంలో 18 జిల్లా శాఖలున్నప్పటికీ, బెంగళూరు, మైసూరు, మంగళూరు, ఉడిపి, హుబ్లీ-ధార్వాడ నగరాల్లో మాత్రమే పార్టీ చురుకుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ సభ్యులుగా 12 వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. కాగా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఒక సీట్లు కూడా గెలుచుకునే అవకాశం లేకపోయినప్పటికీ, మున్ముందు రాష్ట్రంలో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కార్యకర్తలు, శ్రేయోభిలాషులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.