► రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు..దుకాణాల మూత
► ఆత్మాహుతి యత్నాలు – 27 మంది అరెస్ట్
► లాఠీచార్జ్‌పై ఆగ్రహజ్వాల
► పోలీసు అధికారికి మానవహక్కుల కమిషన్ నోటీస్
సాక్షి ప్రతినిధి, చెన్నై: మద్యం అమ్మకాలపై జనం మరోసారి యుద్ధం ప్రకటించారు. కొత్తగా టాస్మాక్ దుకాణాలను తెరిచే ప్రయత్నాలను అడ్డుకుంటూ బుధవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రాస్తారోకోలు, టాస్మాక్ దుకా ణాలపై దాడులు, ఆత్మాహుతి యత్నాలు, నిరాహారదీక్షలతో రాష్ట్రం అట్టుడికిపోయింది. రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం విధించాలని గత ఏడాది ఆరంభంలో ప్రజాందోళనలు సాగాయి. సరిగ్గా అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నిషేధం విధిస్తామని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, దశలవారీ మధ్య నిషేధానికి సిద్ధమని అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత హామీ ఇవ్వడంతోపాటూ తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు. జయ అధికారంలోకి రాగానే 500 టాస్మాక్‌లను మూసివేయించారు. ఎడపాడి సీఎం అయిన తరువాత మరో 500 టాస్మాక్‌ల ఎత్తివేతకు రంగం సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా జాతీయ, రాష్ట్రీయ రహదారుల్లో ఉండే మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో తమిళనాడులోని 3231 టాస్మాక్ దుకాణాలు మూతపడ్డాయి.
అకస్మాత్తుగా మూతవేస్తే తమగతేమిటని టాస్మాక్ ఉద్యోగులు ఉద్యమానికి దిగారు. సుప్రీంకోర్టుషరతులకు లోబడి కొత్త ప్రాంతాలను గుర్తించి మద్యం దుకాణాలు పెట్టుకోవచ్చని టాస్మాక్ యాజమాన్యం వెసులుబాటు కల్పించింది. కొత్త దుకాణాల ప్రయత్నాలను అడ్డుకుంటూ తిరుప్పూరు జిల్లా సామలాపురంలో మంగళవారం ఆందోళనను చేపట్టిన మహిళలుపై పోలీసులు లాఠీచార్జీకి పాల్పడడం, ఒక మహిళపై చేయిచేసుకోవడం అగ్నిలో ఆజ్యం పోసినట్లయింది.
ఉద్యమం ఉగ్రరూపం– అమరణదీక్షలు : పోలీసుల లాఠీచార్జీతో టాస్మాక్ ఉద్యమం బుధవారం ఉగ్రరూపం దాల్చింది. అనేక గ్రామాల్లో ప్రజలు సమావేశమై మద్యం దుకాణాలకు బాడుగకు లేదా లీజుకు ఇవ్వరాదని, కొత్త దుకాణాలను అనుమతించరాదని, పాత దుకాణాలను తరిమివేయాలని తీర్మానాలు చేశారు. నగరాలు, పట్టణాల్లో యువజన సంఘాలు సమావేశమై మంగళవారం రాత్రి నుండి అమరణ నిరాహార దీక్షలు ప్రారంభించారు. రాష్ట్రంలోని మద్యం దుకాణాలన్నీ మూసివేయాలని నినాదాలు చేశారు. తిరుప్పూరు సామలపురం ఈశ్వరన్ ఆలయం సమీపంలోని మైదానంలో ప్రజలు గుమికూడారు.
రాత్రంగా దీక్షల్లో ఉన్నవారిని బుధవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేసి కేసులు పెట్టారు. లాఠీచార్జీలకు నిరసనగా రాష్ట్రంలో అనేక దుకాణాలను మూసివేశారు. నామక్కల్, ధర్మపురి, తిరువారూరు, తిరుచ్చిరాపల్లి, తంజావూరు తదితర జిల్లాల్లో సైతం ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేశారు. మహిళపై దాడి చేసిన ఏడీఎస్పీ పాండియరాజన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. మధురైలో సుమారు పది మంది మహిళలు సెల్‌ఫోన్ టవర్ ఎక్కిపోరాటం చేశారు.
కోవై, దిండుగల్లు జిల్లాల్లో ఆత్మాహుతి యత్నానికి పాల్పడ్డారు. నడిరోడ్డులో వంటకాలు చేసి నిరసన ప్రకటించారు. టాస్మాక్‌లను నిషేధించకుంటే గ్రామాలను ఖాళీ చేసి వెళ్లిపోతామని హెచ్చరించారు.ఈ సందర్బంగా 27 మందిని అరెస్ట్ చేశారు. పోలీసులు జరిపిన లాఠీచార్జీని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, ఎంపీ కనిమొళి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై తీవ్రంగా ఖండించారు.
పోరాటం ఆగదు : బాధిత మహిళ ఈశ్వరి
పోలీసుల లాఠీచార్జీలకు బెదిరేది లేదు, టాస్మాక్‌లపై తన పోరాటం కొనసాగుతుందని బాధిత మహిళ ఈశ్వరి బుధవారం ప్రకటించారు. ఏడీఎస్పీ పాండియరాజన్ మహిళలపై లాఠీ చార్జీ చేసుకుంటూ తన వద్దకు వచ్చి స్వయంగా చెంపపై గట్టిగా కొట్టడంతో దిమ్మదిరిగి కళ్లు బైర్లు కమ్మాయని, చెవులు వినిపించలేదని ఆమె వాపోయారు. శాంతియుతంగా సాగుతున్న ఆందోళనను పోలీసులే రెచ్చగొట్టారని ఆమె ఆరోపించారు.
ప్రభుత్వానికి మానవ హక్కుల కమిషన్ నోటీసు:
టాస్మాక్ ఉద్యమంలో పాల్గొన్న మహిళలపై విచక్షణా రహితంగా విరుచుకుపడి లాఠీచార్జీ చేసిన సంఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజపీ, పోలీస్ అధికారి పాండియరాజన్‌లకు జాతీయ మానవ హక్కుల కమిషన్ బుధవారం నోటీసు పంపింది.
హైకోర్టులో పిటిషన్:
తిరుప్పూరు జిల్లా సామలాపురం లో టాస్మాక్ దుకాణాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలపై లాఠీచార్జీ చేసిన అదనపు ఎస్పీ పాండియరాజన్ తదితర పోలీసులను విధులను శాశ్వతంగా తొలగించి తగిన చర్య తీసుకోవాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది.