చెన్నపట్నం ఛిన్నాభిన్నం
- కుండపోత వర్షాలతో చెన్నైని ముంచెత్తిన వరద.. మేడలు, మిద్దెలు సైతం మునక
- చెంబరామ్‌బాక్కమ్‌లో 49 సెం.మీ అత్యధిక వర్షపాతం నమోదు
- ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూత.. విద్యాసంస్థలకు సెలవు
- 6వ తేదీ వరకు ఎయిర్‌పోర్టు మూసివేత.. విమాన సర్వీసులు రద్దు
- విద్యుత్ సరఫరా బంద్.. నిలిచిపోయిన మొబైల్, ఇంటర్నెట్ సేవలు
- రంగంలోకి సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్ దళాలు.. బాధితుల తరలింపు
- పరిస్థితిని సమీక్షించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత
సంద్రమొచ్చి మీద పడింది! చెన్నపట్నం గుండె చెదిరింది! మన్నూ మిన్నూ ఏకమైంది. నీరు కన్నీరు ఒక్కటైంది. ఎటు చూసినా నీళ్లే.. ఎవరిని కదిపినా కన్నీళ్లే! జల విలయంతో చెన్నై మహానగరం కకావికలమైంది. పక్కనే ఉన్న సముద్రంతో ఏకమైందా అన్నట్టుగా ఆ మహానగరాన్ని వరద చుట్టుముట్టింది. గత వందేళ్లలో ఎన్నడూ లేనంత వర్షం కురవడంతో ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. మంగళవారం చాంబరమ్‌బాక్కంలో 49 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అడయార్ నది ఉగ్రరూపం దాల్చింది. పలు ప్రాంతాల్లో గుడిసెలు, ఇళ్లు పూర్తిగా మునిగిపోయాయి. అపార్టుమెంట్లలో మొదటి అంతస్తు వరకు నీరు చేరింది. బయటకుపోయే దారిలేక అపార్టుమెంట్లలో చిక్కుకున్న వాళ్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. లోతట్టు ప్రాంతాల వారు ఎటుపోవాలో తెలియక నరకయాతన అనుభవిస్తున్నారు. వర్షం ధాటికి ఇప్పటివరకు 197 మంది మృత్యువాత పడ్డారు. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడం చెన్నై వాసులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. సహాయం చేయడానికి సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మరో 3 రోజులు భారీ వర్షం కురుస్తుందనే వాతావరణ విభాగం హెచ్చరిక తమిళనాడు ప్రభుత్వానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.
సాక్షి, హైదరాబాద్: తమిళనాడులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ముఖ్యంగా చెన్నై నగరంలో రైల్వే ట్రాక్‌పై నీళ్లు నిలిచిపోవటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌మీదుగా అక్కడికి రాకపోకలు సాగించే అన్ని రైళ్లూ రద్దయ్యాయి. మరో రెండు రోజుల పాటు వ ర్షాలు కురిసే అవకాశముండడంతో గురు, శుక్రవారాల్లో కూడా రైళ్ల రాకపోకలు స్తంభించే అవకాశం ఉంది. అత్యవసర పనులపై వెళ్లేవారు ఇటు రైళ్లు, అటు బస్సులు/కార్లలో వెళ్లే అవకాశం లేక.., తుదకు విమాన సర్వీసులు కూడా నిలిచిపోవటంతో చెన్నైకు అన్ని దారులు మూసుకుపోయినట్టయింది.
రద్దయిన రైళ్లు ఇవే...
చెన్నై ఎగ్మోర్-కాకినాడ పోర్టు సర్కార్ ఎక్స్‌ప్రెస్, కాకినాడ- చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్- చెన్నై సెంట్రల్ చార్మినార్ ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్, హైదరాబాద్ చార్మినార్ ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్, న్యూఢిల్లీ తమిళనాడు ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్,న్యూఢిల్లీ గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్,హైరా కోరమండల్ ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్-అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్-న్యూ జల్‌పాయ్‌గురి ఎక్స్‌ప్రెస్, పాండిచ్చేరి-న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్-హౌరా మెయిల్ ఎక్స్‌ప్రెస్, చెన్నై ఎగ్మోర్-కాచిగూడ ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్, చెన్నై ఎగ్మోర్-దాదర్ ఎక్స్‌ప్రెస్, సాయినగర్ షిర్డీ-చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్, బిట్రగుంట-చెన్నై సెంట్రల్ ప్యాసింజర్, చెన్నై సెంట్రల్-గూడూరు ప్యాసింజర్.విజయవాడ-చెన్నై సెంట్ర ల్ పినాకిని ఎక్స్‌ప్రెస్‌గూడూరు వరకే నడిపారు. గూడూరు-చెన్నై మధ్య సర్వీసును రద్దు చేశారు.
దారి మళ్లించిన రైళ్లు...
బెంగళూరు-పాట్నా సంగమిత్ర, ధన్‌బాద్, ఎర్నాకులం రప్తిసాగర్, నిజాముద్దీన్-మధురై తమిళనాడు సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లను దారిమళ్లించి నడుపుతున్నారు. బుధవారంనాటి పాండిచ్చేరి-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్‌ను గురువారానికి మార్చారు.
రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్లివే...
సికింద్రాబాద్: 040-27786170, 040-27700868, 040-27786539, విజయవాడ: 0866-2575038, గుంటూరు: 0863-2222014, గూడూరు: 7842307029
చెన్నైకి ఎందుకీ చిక్కులు..?
సాక్షి, చెన్నై: భారీ వర్షాల బీభత్సానికి చెన్నై చిగురుటాకులా వణికిపోతోంది. సుమారు కోటి మందికిపైగా ప్రజలు వరద విలయానికి ఇక్కట్లు పడుతున్నారు. తిండి.. నీరు లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. రైల్వే, వైమానిక, రోడ్డు రవాణ వ్యవస్థ అతలాకుతలమైపోయింది. ప్రజలు గూడు లేక రోడ్లపై తిరగాల్సి వస్తోంది. అసలు ఇంత విలయానికి చెన్నై ఎందుకు నిలయమైంది. చెన్నైకి ఇన్ని చిక్కులు ఎందుకొచ్చాయి. దీనికి కొందరు పర్యావరణ వేత్తలు పట్టణీకరణ, ప్రణాళిక లేని అభివృద్ధి, ఆక్రమణలే ప్రధాన కారణమని చెపుతున్నారు. తీరప్రాంతంలో ఉన్న చెన్నై తరచు భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. నాయకులు, అధికారులు దీని గురించి పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇప్పుడీ పరిస్థితి ఏర్పడిందంటున్నారు.
జనాభా విపరీతంగా పెరుగుతున్నా.. అందుకు తగినట్టుగా మౌలిక వసతులు మెరుగుపడలేదు. పైగా.. నగరంలో ప్రవహిస్తున్న మూడు ప్రధాన నదులు కొసస్తతలయర్, కువుం, అడయార్ నదుల పరీవాహక ప్రాంతాలు ఆక్రమణలతో కుచించుకుపోయాయి. బ్రిటీష్ హయాంలో నిర్మించిన బకింగ్‌హమ్ కెనాల్ నగరం నుంచి వచ్చే వాన నీటిని తీసుకునేది. దీని నిర్వహణను పాలకులు పట్టించుకోలేదు. ఇక నగర అభివృద్ధి ఒక ప్రణాళిక ప్రకారం క్రమపద్ధతిలో జరగలేదు. గత ప్రభుత్వ హయాంలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం నిధులతో వరద నీరు వెళ్లేందుకు కాల్వల పటిష్టతకు చర్యలు ప్రారంభించారు. అయితే ఈ కాల్వల నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. గతంలో నగరంలో 600లకుపైగా చెరువులు ఉండగా.. ఇప్పుడు ఇవి పదుల సంఖ్యకే పరిమితమయ్యాయి. ఇలా సవాలక్ష కారణాలు చెన్నైకి వాన చిక్కులు తీసుకొచ్చాయి.
137 ఏళ్లలో తొలిసారి ‘హిందూ’ పేపర్ రాలేదు
సాక్షి, చెన్నై: తమిళనాడులో భారీ వర్షాల ప్రభావంతో ‘ద హిందూ’ పత్రిక ప్రింటింగ్ నిలిపేసింది. పత్రిక స్థాపించిన 137 ఏళ్లలో ప్రింటింగ్ నిలిపేయడం ఇదే తొలిసారి. దీంతో బుధవారం తమిళనాడులో పత్రిక వెలువడలేదు. తమ ప్రింటింగ్ ప్రెస్ చెన్నై నగరానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలోని మరైమలై నగర్‌లో ఉందని, వర్షాల కారణంగా కార్మికులు అక్కడకు చేరుకునే పరిస్థితి లేదని, ప్రింట్ చేసినా బయటకు తీసుకెళ్లే మార్గాలు లేకపోవడంతో ప్రచురణ నిలిపేసినట్లు పబ్లిషర్ ఎన్. మురళి తెలిపారు. మరోవైపు మిగతా పత్రికలు యథావిధిగా వెలువడ్డాయి.
ముంపు కూడా మూడుముళ్లకు తలొగ్గింది
చెన్నై: వర్షాలు, వరదలతో తమిళనాడు పూర్తిగా మునిగినా కొందరు చెన్నైవాసులు మాత్రం ఈ విపత్కర పరిస్థితుల్లోనే దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. ఎటు చూసినా నీళ్లతో బయటకు అడుగుపెట్టలేని పరిస్థితులు ఉన్నా బెరుకులేకుండా కొన్ని జంటలు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యాయి. బుధవారం శుభప్రదమైన రోజు కావడంతో తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో అనేక పెళ్లిళ్లు జరిగాయి. ‘బుధవారం పెళ్లిళ్లకు మంచి రోజు కావడంతో వివాహ వేడుకలకు నిర్వహించాం. నాకు తెలిసి ఏ మండపాల్లోనూ వర్షాల వల్ల ఈ రోజు వివాహ వేడుకలు వాయిదా పడలేదు.’ అని ఏవీఎం రాజేశ్వరి కల్యాణ మండపం మేనేజర్ కేఎం.కన్నన్ ఓ వార్తా సంస్థకు వెల్లడించారు. బుధవారం పెళ్లి చేసుకున్నవారు తమ బాల్యంలో ముడి బియ్యం తిని ఉంటారని చమత్కరించారు.
రూ.5 కోట్ల సాయం ప్రకటించిన కర్నాటక
సాక్షి, బెంగళూరు: భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న తమిళనాడుకు కర్నాటక ప్రభుత్వం రూ.5 కోట్ల సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం ఓ ప్రకటన చేశారు. అలాగే అవసరమైన ఔషధాలు, నిత్యావసర వస్తువులను వెంటనే తమిళనాడుకు పంపించాలని ప్రధాన కార్యదర్శి కౌషిక్‌ముఖర్జీకి సూచించారు. తమిళనాడు అధికారులతో చర్చించి సహాయక చర్యల్లో పాల్గొనాలని సీఎం ఆదేశించారు.