పావగడలో అర్ధరాత్రి దోపిడీ దొంగల బీభత్సం | Thieves robbery at Pavagadh | Sakshi
Sakshi News home page

పావగడలో అర్ధరాత్రి దోపిడీ దొంగల బీభత్సం

Published Sun, Jan 5 2014 3:03 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM

Thieves robbery at Pavagadh

వైద్య శాఖ ఉద్యోగి ఇంట్లో రూ.3.60 లక్షల విలువైన బంగారు నగల దోపిడీ
 =  అచ్చ తెలుగులో మాట్లాడిన దొంగలు
 = బాధితులు చెప్పిన ఆనవాళ్ల మేరకు దొంగల ఊహా చిత్రాలు  రూపొందించిన పోలీసులు

 
పావగడ, న్యూస్‌లైన్ : పావగడలో పట్టణ పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో అలంకార థియేటర్ ఎదురుగా ఉన్న విద్యానగర్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కాలనీలోని హెల్త్ అసిస్టెంట్ రవిచంద్ర కుమార్ ఇంట్లోకి జొరబడి సుమారు రూ.3.60 లక్షల విలువైన 120 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటనపై శనివారం పోలీసులు, బాధితుల తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం రాత్రి రవిచంద్రకుమార్, భార్య నాగకీర్తి, అతని తల్లి గంగమ్మ, పదేళ్లలోపున్న కుమారులు ప్రణబ్, ప్రణీత్ నిద్రపోయారు.

అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో దుండగులు గేటు తాళాలు పగులగొట్టి కాంపౌండ్ లోపలకు వచ్చి, మెయిన్ డోర్‌కున్న లాక్‌ను బండరాయితో ధ్వంసం చేసి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లోని వారు మేల్కొనే సరికే డ్రాయర్లతో ఉన్న ముగ్గురు  లోపలకు వచ్చేశారు. ‘మీకు ఎలాంటి హాని తలపెట్టం.. బంగారు నగలు, డబ్బు ఇవ్వండి’ అంటూ కత్తితో బెదిరించారు. ప్రాణ భయంతో రవిచంద్ర కుమార్ తన వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి ఇవ్వగా, అతని భార్య తన ఒంటిపై ఉన్న బంగారు నగలను ఇచ్చేసింది.

తర్వాత గంగమ్మ మెడలోని మాంగల్యం సరం, ముత్యాల సరం, చెవిలో కమ్మల్ని దుండగులు కాజేశారు. వారిని ఒక గదిలో బంధించి, డబ్బు కోసం ఇంట్లోని బీరువాలో వెదుకుతుండగా, గంగమ్మ కేకలు వేసింది. దీంతో ఇరుగు పొరుగు వారు వచ్చేసరికి దొంగలు పారిపోయారు. స్థానికుల సమాచారంతో సీఐ భానుప్రసాద్, ఎస్‌ఐ అశోక్‌కుమార్, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. దొంగల ఆచూకీ కోసం చుట్టుపక్కల భారీగా గాలించారు. తుమకూరు నుంచి జాగిలాలను రప్పించగా, అవి ఇంటి నుంచి కొంతదూరం పట్టణం వైపు వెళ్లి తిరిగొచ్చేశాయి. వేలిముద్రల నిపుణులు ఆధారాలు సేకరించారు.

కాగా దోపిడీ దొంగలు 25-30 ఏళ్ల లోపు ఉన్న వారేనని, వారు అచ్చ తెలుగులో మాట్లాడారని, ఇంటి బయట కూడా మరో దొంగ కాపలా ఉన్నాడని బాధితులు పోలీసులకు వివరించారు. ఏఎస్పీ లక్ష్మణ్, మధుగిరి సబ్ డివిజన్ డీఎస్పీ గురుస్వామి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితులు దొంగల రూపురేఖలను చెప్పిన మేరకు వారి ఊహా చిత్రాలను పోలీసులు రూపొందించారు. త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామని ఏఎస్పీ వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భానుప్రసాద్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement