- అనంతమూర్తికి బెదిరింపులపై సాహితీవేత్తల ఆందోళన
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నరేంద్ర మోడీ ప్రధాని అయితే దేశాన్ని విడిచి వెళ్లిపోతానని ఎన్నికలకు ముందు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ యూఆర్. అనంతమూర్తి ప్రకటన చేసినందుకు, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆయనకు వస్తున్న బెదిరింపులపై సాహితీవేత్తలు తీవ్రంగా స్పందించారు. గురువారం ఇక్కడి డాలర్స్ కాలనీలో ఆయనకు సంఘీభావం ప్రకటించి, ఆయన ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు.
నటి జయమాల, సాహితీవేత్తలు ప్రొఫెసర్ గోవిందరావు, డాక్టర్ కే. మరుల సిద్ధప్ప, డాక్టర్ విజయా బొళువారు, మహమ్మద్ కుంజ్ఞ తదితరులు సంఘీభావాన్ని ప్రకటించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతమూర్తిని మత తత్వ శక్తులు మానసికంగా హింసించడం అనుకోని పరిణామం కాదని అన్నారు. దీని వెనుక సంఘ్ పరివార్ శక్తులున్నాయని ఆరోపించారు. ఇలాంటి దాడులు దేశంలో కొత్తేమీ కాదన్నారు.
ఇలాంటి శక్తులే గతంలో కళాకారుడు ఎఫ్‌ఎం. హుసేన్‌పై కూడా దాడి చేశాయని గుర్తు చేశారు. ఈ విధమైన దాడులను అడ్డుకోవడానికి లౌకిక శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా, లేఖలు, ఫోన్ల ద్వారా అనంతమూర్తిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. గోవిందరావు మాట్లాడుతూ తమలో తాము స్థైర్యాన్ని నింపుకోవడానికి ఈ పోరాటం చేస్తున్నామని తెలిపారు. మనసు లేని వారికి అనంతమూర్తి మాటలు అర్థం కావని దెప్పి పొడిచారు.
జయమాల మాట్లాడుతూ గతంలో అనంతమూర్తి వ్యక్తం చేసిన ఆందోళన ఇప్పుడు నిజమవుతోందన్నారు. భావ వ్యక్తీకరణ రాజ్యాంగం ప్రసాదించిన హక్కని, దానిని వ్యతిరేకించడం తగదని హితవు పలికారు. సంస్కృతి గురించి మాట్లాడే వారు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
మరో సాహితీవేత్త లక్ష్మీ నారాయణ నాగవార మాట్లాడుతూ అనంతమూర్తిని హిందూ ధర్మ వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, మహిళలను తక్కువగా చూసే ధర్మం...ధర్మమే కాదని విమర్శించారు. అనంతమూర్తిపై పరోక్ష దాడి వెనుక ఆర్‌ఎస్‌ఎస్ హస్తం ఉందని ఆరోపించారు. ఆయన రక్షణకు తామంతా కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు.