
‘హంద్రీ–నీవా కాలువ వెడల్పు చేయాలి’
అనంతపురం : హంద్రీ–నీవా ద్వారా రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరివ్వాలంటే 7 వేల క్యూసెక్కులకు విస్తరింప చేయాలని , వైఎస్సార్ సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు హంద్రీ నీవాను వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమలో ఆరు లక్షల ఎకరాలు సాగులోకి తేవాలనే ఉద్ధేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2005లో హంద్రీ–నీవా పథకం మొదలుపెట్టారన్నారు. ఈ పథకం మొదటి దశ పనులు దాదాపు 80 శాతం ఆయన ఉన్నట్లుగానే పూర్తయ్యాయన్నారు.
తర్వాత కాంగ్రెస్ హయాంలో తక్కిన పనులు పూర్తయి 2012 నుంచి జీడిపల్లి రిజర్వాయర్‌కు నీళ్లు వస్తున్నాయన్నారు. 2014 వరకు 75 శాతం పూర్తయిన రెండో దశలో తక్కిన 25 శాతం పనులు పూర్తి చేసేందుకు రెండున్నరేళ్లుగా సాగుతున్నా నేటికీ కొలిక్కి వచ్చిన పరిస్థితులు కనిపించలేదన్నారు. అయినా అక్టోబర్‌లో కనీసం ఐదారు చెరువులకు నీళ్లివ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పీఏబీఆర్ ఎగువనున్న ఆరు చెరువులకు నీళ్లిచ్చారని, దిగువనున్న 49 చెరువులకూ నీరు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మంత్రికి ఇంకా రెండున్నరేళ్లు సమయం ఉందని హంద్రీ–నీవాను రైతులకు ఉపయోగపడేలా చేయాలంటే చంద్రబాబునాయుడు మాదిరి కాకుండా వైఎస్ రాజశేఖరరెడ్డిలా ఆయకట్టు చివరిదాకా నీళ్లు అందించేలా ఆలోచిస్తే ఉపయోగముంటుం దన్నారు. ఇందుకు అవసరమైతే పార్టీలకతీతంగా సమావేశం ఏ ర్పాటు చేసి సూచనలు, సలహాలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 3.5 లక్షల ఆయకట్టుకు నీళ్లిచ్చే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. లేకపోతే కుప్పంకు నీళ్లను పంపకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్రా సురేష్‌గౌడ్, అనంతపురం రూరల్, రాప్తాడు మండలాల కన్వీనర్లు తాటిచెర్ల నాగేశ్వరరెడ్డి, బోయ రామాంజనేయులు, ఎం పీటీసీలు ఆలుమూరు సుబ్బారెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎం. నరేంద్రరెడ్డి పాల్గొన్నారు.