అతి వేగం ముగ్గురిని బలిగొంది. గురువారం ఉదయం మండ్య జిల్లా బూదనూరు సమీపంలో ....
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
మరొకరికి గాయాలు
మండ్య : అతి వేగం ముగ్గురిని బలిగొంది. గురువారం ఉదయం మండ్య జిల్లా బూదనూరు సమీపంలో జాతీయ రహదారిపై చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో దంపతులతో పాటు మరో యువకుడు మరణించాడు. వివరాల్లోకి వెళితే... మైసూరు జిల్లా పంచాయతీలో ఆహారశాఖ అధికారిగా పనిచేస్తున్న రఘునందన్(53) అక్కడి రామానుజ రోడ్డులోని పదవ క్రాస్‌లో నివాసముంటున్నారు. గురువారం ఉదయం తన భార్య మైథిలి(45), ఆమె సోదరి సుమిత్రాదేవి(53) కలిసి బెంగళూరులో బంధువుల గృహ ప్రవేశానికి అద్దెకు ఇండికా కారు మాట్లాడుకుని బయలుదేరారు. మండ్య తాలూకాలోని బూదనూరు సమీపంలో జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా ఎదురుగా బెంగళూరు నుంచి వస్తున్న ఫియెట్ లీనా కారు అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొని అదే వేగంతో గాలిలోకి ఎగిరి రోడ్డుకు ఇటువైపు ఉన్న ఇండికాకారును బలంగా ఢీకొంది. ఘటనలో ఇండికా కారు నుజ్జునుజ్జైంది.
అందులో ప్రయాణిస్తున్న రఘునందన్, సుమిత్రాదేవితో పాటు ఇండికా కారు డ్రైవర్ ప్రకాష్(23) అక్కడికక్కడే మరణించారు. రఘునందన్ భార్య మైథిలి తీవ్రంగా గాయపడ్డారు. ఫియెట్ కారులో ఉన్న ముగ్గురు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ భూషన్ జి.భోరసే, డీవైఎస్పీ ఉదేష్, సీఐ శివకుమార్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. గాయపడిన మైథిలి మండ్యలోని విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై మండ్య పోలీసులు దర్యాప్తు చేపట్టారు.