మృత్యు తాండవం
సాక్షి, చెన్నై :రాజధాని నగరం చెన్నై రోడ్లపై మృత్యువు తాండవం చేసింది. బుధవారం వేకువ జామున నగర రోడ్లపై జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు విగత జీవులయ్యారు. ఇందులో ముగ్గురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఉన్నారు. చేట్‌పేట్‌లోని ఓ ప్రైవేటు ఐటీ సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది వేకువ జామున విధుల్ని ముగించుకుని తమకు కేటాయించిన క్యాబ్‌లో తమ ప్రాంతాలకు బయలు దేరారు. తాంబరం వైపుగా బయలుదేరిన క్యాబ్‌లో మీనంబాక్కం, పల్లావరం, క్రోంపేట, సేలయూరుల్లో దిగాల్సిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు బయలుదేరారు. ఈ వాహనాన్ని డ్రైవర్ రాజ్‌కుమార్ నడిపాడు. ఇద్దరు ఇంజనీర్లు మీనంబాక్కం వద్ద దిగేశారు. మిగిలిన నలుగురితో వాహనం తాంబరం వైపుగా కదిలింది. అతి వేగం, డ్రైవర్ నిద్ర మత్తు, రోడ్డుపై చిమ్మచీకటి వెరసి ఆ వాహనం పల్లావరం వద్ద అదుపు తప్పింది తొలుత డివైడర్‌ను, వెను వెంటనే రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొంది.
రక్తపు మడుగులో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నాలుగు గంటల సమయంలో అటు వైపుగా వెళ్తోన్న వాహనదారులు హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో డ్రైవర్ రాజ్ కుమార్, బీహార్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రిత్యులాల్ ఉన్నారు. ఈ ఇద్దరు సీట్ బెల్ట్ ధరించి ఉండడంతో గాయాలతో బయటపడ్డారు. ఇక, సేలంకు చెందిన సురేష్, తిరుచ్చికి చెందిన అన్భురాజ్, నాగర్ కోవిల్‌కు చెందిన అర్జునన్‌లు మృతి చెందినట్లు గుర్తించారు. వీరంతా క్రోం పేట, సేలయూరు పరిసరాల్లో గదుల్ని అద్దెకు తీసుకుని నివాసం ఉంటూ, ప్రతి రోజు చేట్‌పేట్‌కు క్యాబ్‌లో రాకపోకలు సాగిస్తున్నారు. వీరిని మృత్యువు కబళించడంతో ఆ కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగాయి.
మరో ఘటనలో..: క్రోంపేట లక్ష్మీపురానికి చెందిన షణ్ముగం తిరునీర్ మలై వైపు తన మోటార్ సైకిల్‌పై వస్తూ ప్రమాదానికి గురయ్యాడు. ఎదురుగా వస్తున్న మరో మోటార్ సైకిల్ ఢీ కొనడంతో సంఘటనా స్థలంలోనే షణ్ముగం మరణించాడు. తాంబరం తదుపరి ముడిచ్చూర్ వద్ద ఉదయాన్నే ప్రైవేటు సంస్థకు చెందిన బస్సు ఢీ కొనడంతో అదే ప్రాంతానికి చెందిన మోటారు సైకిలిస్టు నాగరాజ్ విగత జీవి అయ్యాడు. తాంబరం మార్గంలో వరుస ప్రమాదాలు పోలీసుల్నే కాదు, వాహన చోదకుల్ని కలవరంలో పడేశాయి.విధులకు వెళ్తూ: తాంబరం మార్గంలో ఐదుగురిని వేర్వేరు ప్రమాదాలు మింగేస్తే, రాధాకృష్ణన్ రోడ్డులో మరో ఇంజనీరు ప్రమాదంలో బలయ్యాడు. మరొకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పట్టుకోట్టైకు చెందిన వీరమణి బీఈ పట్టభద్రుడు. మైలాపూర్‌లోని ఓ ప్రైవేటు సూపర్ మార్కెట్‌లో పనిచేస్తున్నాడు.
టీ నగర్‌లో బస చేస్తున్న వీరమణి తన మిత్రుడు రాజ్‌కుమార్‌తో కలిసి ఉదయాన్నే మైలాపూర్‌కు బయలు దేరారు. మోటార్ సైకిల్‌పై అతి వేగంగా వీరు దూసుకొచ్చారు. రాధాకృష్ణన్ సాలైలోని కెథడ్రల్ రోడ్డు వద్ద వీరి వాహనం అదుపు తప్పింది. గాల్లోకి ఎగిరిన మోటార్ వాహనం కూత వేటు దూరంలో పడింది. సమీపంలోని విద్యుత్ స్తంభం మీద పడ్డ వీరమణి తల ఛిద్రమైంది. సంఘటనా స్థలంలోని వీరమణి మరణించాడు. తీవ్ర గాయాలతో కొట్టు మిట్టాడుతున్న రాజ్‌కుమార్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనల సమాచారం ఉదయాన్నే టీవీల్లో ప్రత్యక్షం కావడం నగర వాసుల్ని తీవ్ర విషాదంలో పడేసింది. నగరంలో ఒకే రోజు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు బలి కావడం చర్చనీయాంశంగా మారింది. అతి వేగం ఈ ప్రమాదాలకు కారణం కావడంతో ఇక తనిఖీల్లో మునగాల్సిన వంతు పోలీసులకు ఏర్పడటం కొసమెరుపు.