మింగేసిన బోరుబావి
Published Sun, Apr 6 2014 11:57 PM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM
సాక్షి, చెన్నై: బోరు బావుల రూపంలో చిన్నారులు విగత జీవులు అవుతున్నారు. శనివారం ఉదయాన్నే విల్లుపురం జిల్లా కళ్లకురిచ్చి సమీపంలోని త్యాగరాయ దురం పల్ల చేరి గ్రామానికి చెందిన రామచంద్రన్ కుమార్తె మధుమిత (3) తమ పొలంలోని బోరు బావిలో పడ్డ విషయం తెలిసిందే. ఈ పసిబిడ్డను ప్రాణాలతో రక్షించేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆ బోరు బావికి పీవీసీ పైప్‌లను అమర్చని దృష్ట్యా, చిన్నారి క్రమంగా జారుకుంటూ లోపలికి వెళ్తుండడం అధికారులను కలవరంలో పడేసింది. రోబోటిక్ యంత్రాన్ని ఉపయోగించినా ఫలితం శూన్యం.
రాత్రంతా శ్రమించినా: చీకటి పడడంతో ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు. ఎలాగైనా ప్రాణాలతో చిన్నారిని రక్షించి తీరుతామన్న ఆశతో అధికారులు రాత్రంతా శ్రమించారు. 30 అడుగుల లోతుకు నాలుగు వైపులా సమాం తరంగా గోతిని తీశారు. చిన్నారి మరింత కిందకు జారకుండా అందుకు తగ్గ చర్యలు తీసుకున్నారు. ఆదివారం వేకువ జామున నాలుగు గంటల సమయంలో అతి కష్టం మీద మధుమితను బయటకు తీశారు. అక్కడే వేచి ఉన్న వైద్యాధికారులు ఆ చిన్నారిని పరీక్షించి, శ్వాస పీల్చుకునే రీతిలో ఏర్పాట్లు చేశారు. ఆ చిన్నారి కొంత మేరకు స్పందించడంతో ప్రాణాలతో ఉన్నట్టు తేలి ఆనందంలో మునిగారు. అయినా, మెరుగైన వైద్యం నిమిత్తం హుటాహుటిన అంబులెన్స్‌ల ద్వారా కళ్లకురిచ్చి ఆస్పత్రికి తరలించారు.
మృత్యు ఒడిలోకి : ఆ చిన్నారి ప్రాణాలతో ఉందన్న సమాచారంతో ఆనందంలో మునిగిన వారందరూ గంట వ్యవధిలో విషాద సమాచారాన్ని అందుకోవాల్సి వచ్చింది. సంఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది తాము ఆ బిడ్డను రక్షించామని ఆనందంలో ఉండగా, ఆస్పత్రిలో చికిత్స ఫలించక చిన్నారి మృత్యుఒడిలోకి వెళ్లిన సమాచారం అక్కడున్న వారందరినీ కన్నీటి పర్యంతంలో ముంచేసింది. ఆస్పత్రిలో చేర్చిన ఐదు నిమిషాల్లో ఆ చిన్నారి తుదిశ్వాస విడవడం ఆ కుటుంబాన్ని కన్నీటి మడుగులో ముంచింది. విల్లుపురం జిల్లా పరిసర గ్రామాల ప్రజలందరూ ఆ బిడ్డ ప్రాణాలతో బయటపడాలని రాత్రంతా ప్రార్థనలు చేసినా ఫలితం దక్కలేదు. 20 గంటల పాటు తీవ్ర ఉత్కంఠతో అధికారుల సమష్టి శ్రమ వృథా అయింది. ఆ చిన్నారి అనంత లోకాలకు చేరడంతో విల్లుపురం జిల్లాలో విషాదచాయలు అలుముకున్నాయి.
Advertisement
Advertisement