అయ్యో మంత్రులు!
అన్నీ కష్టాలే
సాక్షి, చెన్నై: అమ్మ కరుణతో మళ్లీ సీట్లు దక్కించుకున్న మంత్రులకు గ్రామాల్లో కష్టాలు తప్పడం లేదు. గత ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవి దక్కడంతో చెన్నైలో తిష్ట వేసిన పలువురికి అనేక గ్రామాల్లో వ్యతిరేకత తప్పడం లేదట. ఇందులో సీఎం తదుపరి స్థానంలో ఉన్న మంత్రులు కూడా ఉండడం గమనార్హం.
గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకాతో సీఎం జయలలిత కేబినేట్‌లో చేరిన పలువురు మంత్రులు చివరి వరకు కొనసాగారు. వారిలో పన్నీరు సెల్వం, వైద్యలింగం, పళనియప్పన్, ఎడపాడి పళని స్వామి, వైద్యలింగం, నత్తం విశ్వనాథన్, సెల్లూరు కే రాజు, కేటి రాజేంద్ర బాలాజీ ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో వీరందరికీ మళ్లీ సీట్లు దక్కాయి. అయితే, గత ఐదేళ్లు నియోజకవర్గంలోని గ్రామాల ముఖాల్ని చూడని ఈ మంత్రులకు ఇప్పుడు కష్టాలు తప్పడం లేదు.
శివకాశి నుంచి కేటి రాజేంద్ర బాలాజి, మదురై పశ్చిమం సెల్లూరు కే రాజు, ఆత్తూరులో నత్తం విశ్వనాథన్, తిరుమంగళంలో మంత్రి ఉదయకుమార్‌కు కష్టాలు తప్పడం లేదటా..!.ఎక్కడెకెళ్లినా...! సారోచ్చారంటూ ఆహ్వానించే వాళ్లే గతంలో. తమకు ఏమి చేశారంటూ ప్రశ్నించే వాళ్లే ఎక్కువటా..!. దీంతో ఆయా గ్రామాల్లోని నాయకుల ద్వారా ప్రశ్నించే వాళ్ల నోళ్లను మూయించేందుకు తీవ్రంగా శ్రమించక తప్పడం లేదన్నది సమాచారం.
ఇక, గుడియాత్తంలో అయితే, ఏకంగా మంత్రి కేసీ వీరమణి సమక్షంలోనే అక్కడి అభ్యర్థి జయంతి పద్మనాభన్ తమ గ్రామం నుంచి వెళ్లాల్సిందేనని ప్రజలు హెచ్చరించడం బట్టి చూస్తే, అయ్యో మంత్రుల అని పించకమానదు. ఇన్నాళ్లు ఏసీ కార్లలో, ఏసీ రూముల్లో ఉన్న మంత్రులు, ఇప్పుడు భానుడి ప్రతాపాన్ని ఎదుర్కొంటూ ఊరూరు..తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ, చీవాట్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతుండడం గమనించదగ్గ విషయమే.