
టీఆర్‌ఎస్‌లో ముసలం..
అధికారపార్టీ టీఆర్‌ఎస్‌లో గ్రూపు గొడవలు ముదురుతున్నాయా..?
ఈద సన్మానసభలో బయటపడిన విభేదాలు
♦ ఎమ్మెల్యే, ఆయన వర్గీయుల గైర్హాజరు
♦ అయోమయంలో అధికార పార్టీ కార్యకర్తలు
అధికారపార్టీ టీఆర్‌ఎస్‌లో గ్రూపు గొడవలు ముదురుతున్నాయా..? నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయా..? ఇక నుంచి వర్గాలుగా విడిపోయినట్టేనా..? అంటే అవుననే సంకేతాలను ఇస్తున్నాయి ఇటీవల పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు. ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెద్దపల్లిలో ఏర్పాటుచేసిన సన్మాన సభతో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి.
– సాక్షి, పెద్దపల్లి
రాష్ట్ర నీటిపారుదలశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమితులైన ఈద శంకర్‌రెడ్డి హైదరాబాద్‌లో ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పెద్దపల్లిలో ఆయనకు నగరపంచాయతీ చైర్మన్ ఎలువాక రాజయ్య శనివారం సన్మానసభ ఏర్పాటుచేశారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితోపాటు నూతనంగా నియామకమైన మార్కెట్ చైర్మన్లు, జూలపల్లి మండలం మినహా ఇతర మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు గైర్హాజరవడం చర్చనీయాంశంగా మారింది. టీఆర్‌ఎస్‌లోని నాయకుల మధ్య ఉన్న విభేదాలతో తనకు తెలియకుండా సన్మానసభను ఏర్పాటుచేశారనే కారణాన్ని సాకుగా చూపి గైర్హాజరైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే నగర పంచాయతీ చైర్మన్ రాజయ్య సంబంధీకులు మాత్రం ఎమ్మెల్యేతోపాటు అందరినీ ఆహ్వానించామని చెబుతున్నారు. మొత్తానికి టీఆర్‌ఎస్ పార్టీలోని నాయకుల మధ్య ఉన్న విభేదాలు సన్మానసభతో తెరమీదకు వచ్చాయి.
విభేదాలకు బీజం పడిందిలా..
2014 సాధారణ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ప్రస్తుత కరీంనగర్ అవిభాజ్య జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి పార్టీ టికెట్ ఆశించారు. చివరకు ప్రస్తుత ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికే టికెట్ వరించింది. ఇక్కడే ఇద్దరి మధ్య విభేదాలు పొడచూపాయి. వీరిద్దరిదే పెద్దపల్లి నియోజకవర్గమే. ఇదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ భానుప్రసాదరావు కాంగ్రెస్ పార్టీ తరఫున గత ఎన్నికల్లో, ప్రస్తుత ఎమ్మెల్యేపైనే పోటీకి దిగి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత శాసన మండలిలో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా ఎమ్మెల్సీ భానుప్రసాదరావు పలువురు ఎమ్మెల్సీలతో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఇలా వీరిద్దరి మధ్య బేధాభిప్రాయాలు అప్పటినుంచి కొనసాగుతున్నాయి. ఇలా ఎమ్మెల్యేతో సత్సంబంధాలు లేని వారంతా మరో వర్గంగా జట్టుకడుతున్నారు.
మొదట్లో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, పెద్దపల్లి నగర పంచాయతీ చైర్మన్ ఎలువాక రాజయ్య సత్సంబంధాలు కలిగి ఉండేవారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు పొడచూపాయి. ఏడాది క్రితం చేపల మార్కెట్ ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక ఎంపీ బాల్క సుమన్ సమక్షంలోనే ఎమ్మెల్యే, చైర్మన్ బహిరంగంగా ఆరోపణలు చేసుకున్నారు. ఇలా పలు కారణాలతో చైర్మన్ కూడా ఎమ్మెల్యే వ్యతిరేక వర్గానికి దగ్గరవుతూ వస్తున్నట్టు చెబుతున్నారు. ఈక్రమంలో ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి సన్మానసభను చైర్మనే ఏర్పాటుచేశారు. ఈ కారణంగా ఎమ్మెల్యే వర్గీయులు హాజరుకాలేదనేది టీఆర్‌ఎస్ కార్యకర్తలు చెబుతున్న మాట. మొత్తానికి టీఆర్‌ఎస్ కార్యకర్తలు మాత్రం అయోమయంలో పడ్డారు. ఈ పరిస్థితిలో పార్టీ అధినాయకత్వం జోక్యం చేసుకొని, పెద్దపల్లి జిల్లాకు సమర్థవంతమైన, సమన్వయం చేసుకొనే చతురతగల నాయకుడిని, అధ్యక్షుడిగా ఎంపిక చేసేందుకు చర్యలు చేపట్టింది. బుధవారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో జరిగే సమావేశంలో నాయకుల మధ్య సమన్వయం చేసే అవకాశముంది.
టీఆర్‌ఎస్ అధ్యక్ష రేసులో రఘువీర్‌సింగ్..!
సాక్షి, పెద్దపల్లి : టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్ష పదవి రేసులోకి తెరపైకి మరో పేరు వచ్చింది. జూలపల్లి మండలానికి చెందిన నాయకుడు ఠాకూర్ రఘువీర్‌సింగ్ పేరు బలంగా వినిపిస్తోంది. జిల్లాలోని ముఖ్యనాయకుల అండదండలన్నీ ఈయనకే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు రామగుండం నియోజకవర్గంలోని కొరుకంటి చందర్, మంథని నియోజకవర్గానికి చెందిన గంట వెంకటరమణారెడ్డి పేర్లు తెరమీదకు వచ్చాయి. తాజాగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కాల్వశ్రీరాంపూర్ ఎంపీపీ సారయ్యగౌడ్ పేరును తెరమీదకు తెచ్చినట్టు సమాచారం. నాయకుల మధ్య ఉన్న విభేదాలతో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులతోపాటు రామగుండం, మంథని ఎమ్మెల్యేల మద్దతు రఘువీర్‌సింగ్‌కే ఉన్నట్టు తెలిసింది. అయితే అధిష్టానం ఆశీస్సులు ఎవరికి అనేది బుధవారం కేసీఆర్ సమక్షంలో జరిగే సమావేశంలో తేలనుంది.