పీఠంపై కన్ను
Published Wed, Oct 26 2016 3:16 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM
నామినేట్ చేయాల్సిన పదవులివే..
భద్రాద్రి ఆలయ ధర్మకర్తల మండలి
అన్నపురెడ్డిపల్లి, పెద్దమ్మతల్లి ఆలయాల పాలకవర్గం
భద్రాచలం, చర్ల, దమ్మపేట మార్కెట్ కమిటీలు
సాక్షి, కొత్తగూడెం : సుదీర్ఘ కాలంగా ఊరిస్తున్న నామినేటెడ్ పదవుల పందేరంపై జిల్లాలోని టీఆర్‌ఎస్ నేతల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతనంగా ఆవిర్భవించడంతో పార్టీని బలోపేతం చేయడంతోపాటు ఈ ప్రాంతంలో కార్యకలాపాలను విస్తృతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం జిల్లాలో ఉన్న పలు నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో ఆయా ప్రాంతాల నేతలు నామినేటెడ్ పదవులు ఈసారి తమనే వరిస్తాయన్న ఆశతో ఉన్నారు. పలువురు జిల్లా, నియోజకవర్గస్థాయి నేతలు.. పలు ప్రధాన పదవులను సాధించే దిశగా ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. పార్టీకి తాము అందించిన సేవలతోపాటు కష్టకాలంలో, ఉద్యమ సమయంలో చేసిన కృషిని వారికి వివరిస్తున్నారు. ఆయా పదవుల నియామకం విషయంలో తమ పేరు పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాకు టీఆర్‌ఎస్ పార్టీతో ఉద్యమకాలం నుంచే విడదీయరాని అనుబంధం ఉంది. అప్పుడు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించిన ఈ ప్రాంత నాయకులు.. ఈసారి తమకు గుర్తింపు లభిస్తుందన్న ధీమాతో ఉన్నారు. జిల్లాలోని మూడు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాలను ప్రభుత్వం ఇప్పటికే నియమించగా, మరో మూడు పాలకవర్గాలను నియమించాల్సి ఉంది.
కొత్తగూడెం, ఇల్లందు, బూర్గంపాడు మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను ఏర్పాటు చేశారు. భద్రాచలం, చర్ల, దమ్మపేట వ్యవసాయ మార్కెట్ కమిటీల పదవులను సైతం త్వరలో భర్తీ చేస్తారని పార్టీ నేతలు భరోసాతో ఉన్నారు. ఇవి కాకుండా దక్షిణ అయోధ్యగా పేరొంది, జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ ధర్మకర్తల మండలిని సైతం త్వరలో నియమిస్తారన్న సమాచారంతో జిల్లాకు చెందిన పలువురు నేతలు మండలి చైర్మన్ పదవి కోసం, ధర్మకర్తలుగా నియమితులు కావడానికి మరి కొందరు ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో చైర్మన్ తో పాటు 9 మందిని సభ్యులుగా నియమించగా, ఈసారి ఆ సంఖ్యను 15కు పెంచే అవకాశం ఉండడంతో అనేకమంది వీటిపై ఆశలు పెట్టుకున్నారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంతోపాటు భద్రాచలం నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు ఈ పదవులను పొందేందుకు రాష్ట్రస్థాయిలో ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వీటితోపాటు అన్నపురెడ్డిపల్లి దేవస్థానం, పాల్వంచలోని శ్రీపెద్దమ్మతల్లి దేవాలయానికి సైతం పాలకవర్గాలను నియమించాల్సి ఉండడంతో పాల్వంచ, కొత్తగూడెం, భద్రాచలానికి చెందిన పలువురు టీఆర్‌ఎస్ నేతలు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారని తెలిసింది. జిల్లా ఆవిర్భావం అనంతరం రాష్ట్రస్థాయి ప్రభుత్వ పదవుల్లో ఈ జిల్లాకు ప్రాధాన్యం ఇస్తారన్న ఆశతో ఉన్న పలువురు టీఆర్‌ఎస్ సీనియర్లు రాష్ట్రస్థాయి కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా తమ పేర్లు పరిశీలించాల్సిందిగా తమకు సాన్నిహిత్యం ఉన్న రాష్ట్రస్థాయి నేతలను కలిసి విన్నవించుకున్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన విద్యార్థినేత పిడమర్తి రవిని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్ నేతలెవరినీ కీలక పదవులు వరించలేదు. ఇక జిల్లాలోని నేతలకు రాష్ట్ర , జిల్లా స్థాయి పదవులేవీ ఇప్పటివరకు రాకపోవడంతో ఈ దఫా పదవుల పందేరంలో జిల్లాకు అగ్రస్థానం లభిస్తుందన్న ఆశతో ఈ ప్రాంత పార్టీ నేతలు ఉన్నారు. అలాగే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా రవాణా శాఖ (ఆర్‌టీఏ), పౌరసరఫరాల శాఖ ఆహార సలహా కమిటీ వంటివి కొత్తగా నియమించాల్సి ఉండటంతో వీటిపై సైతం పలువురు టీఆర్‌ఎస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. టీఆర్‌ఎస్ ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు(అధికారంలోరి రాకముందు) కీలకంగా వ్యవహరించిన వారితో పాటు, అధికారంలోకి వచ్చాక వివిధ పార్టీల్లో కీలక నేతలుగా ఉండి, గులాబీ తీర్థం పుచ్చుకున్న పలువురు ప్రముఖులు సైతం ప్రయత్నాలు ముమ్మరం చేశారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Advertisement
Advertisement