
దినకరన్ అరెస్టయ్యాడా?
ఎగ్మూర్ కోర్టు ప్రశ్న
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే(అమ్మ) బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ను అన్ని సమస్యలు ఒకే సారిగా చుట్టుముట్టిన విషయం తెలిసిందే. పార్టీ నుంచి బహిష్కరణ వేదన, రెండాకుల చిహ్నం కోసం లంచం వ్యవహారం ఒకవైపు, ఫెరా కేసు ఉచ్చు ఇంకో వైపు ఆయనను చుట్టుముట్టాయి. రెండాకుల కోసం రూ.50 కోట్లు లంచం ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన మూడు రోజులుగా ఢిల్లీలో పోలీసుల విచారణకు హాజరవుతున్నారు. శనివారం ఏడు గంటలు, ఆదివారం పది గంటల పాటు ఆయనను పోలీసులు విచారించారు.
మరోవైపు ఫెరా కేసు విచారణ నిమిత్తం టీటీవీ ప్రతి రోజు ఎగ్మూర్ కోర్టుకు హాజరు కావాల్సివుంది. ఢిల్లీలో ఉన్న ఆయన సోమవారం విచారణకు హాజరుకాలేకపోయారు. ఆయన తరఫున హాజరైన న్యాయవాది.. న్యాయమూర్తి మలర్ మతికి వివరణ ఇచ్చుకున్నారు. ఓ క్రిమినల్ కేసు అభియోగంపై ఢిల్లీకి టీటీవీ వెళ్లారని, అందుకే ఆయన రాలేని పరిస్థితి ఉన్నట్టు తెలిపారు. ఢిల్లీ పోలీసుల సమక్షంలో ఆ విచారణ సాగుతోందని న్యాయవాది పేర్కొగా, న్యాయమూర్తి జోక్యం చేసుకుని దినకరన్‌ను అరెస్టు చేశారా? అని ప్రశ్నించారు. ఇందుకు న్యాయవాది లేదని సమాధానం ఇచ్చారు. ఒకవేళ ఆయనను అరెస్టు చేస్తే సమాచారం కోర్టుకు ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు.
మూడో రోజూ విచారణ
ఆదివారం 10 గంటల పాటుగా జరిగిన విచారణలో దినకరన్ ముందు పలు ఆధారాలను పోలీసులు ఉంచినట్టు సమాచారం. ఫోన్ సంభాషణలు, వాట్సాప్, ఎస్‌ఎంఎస్ సమాచారాలు, మధ్యవర్తి సుకేష్‌చంద్ర శేఖర్‌తో సాగిన వ్యవహారాలను దినకరన్ ముందు ఉంచినట్టు తెలిసింది. శనివారం వరకు సుకేష్ చంద్రశేఖర్ ఎవరో అన్నది తనకు తెలియదని వాదిస్తూ వచ్చిన దినకరన్ తాజాగా ఆయనో న్యాయమూర్తిగా తనకు పరిచయమైనట్టు వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం.
సోమవారం సాయంత్రం నుంచి దినకరన్‌తో పాటుగా ఆయన పీఏ జనార్దన్, సన్నిహితుడు మల్లికార్జున్ లను కూడా ఢిల్లీ పోలీసులు విచారణ సాగించే పనిలో పడ్డారు. ఈ విచారణ మరెన్ని గంటలు సాగనుందో వేచి చూడాల్సిందే. పోలీసులకు కావాల్సిన ఆధారాలు చిక్కినట్టేనని, ఇక దినకరన్ అరెస్టు కావడం తథ్యమన్న ప్రచారం ఊపందుకుంది.