దినకరన్‌కు ఎదురుదెబ్బ!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అసమ్మతి నేత టీటీవీ దినకరన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన ఫెరా కేసులో మూడు నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దినకరన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించలేమంటూ సుప్రీంకోర్టు సోమవారం దినకరన్ అప్పీల్‌ను కొట్టివేసింది.
2001లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదుచేసిన ఫెరా కేసులో దినకరన్‌పై ఇప్పటికే ఎగ్మూరు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు అభియోగాలు ఖరారు చేసింది. విదేశీ మారక ద్రవ నియంత్రణ చట్టం (ఫెరా)లోని పలు నిబంధనలు ఉల్లంఘించారని, ఆర్బీఐ అనుమతి లేకుండా కోటి 4 లక్షల 93వేల 313 డాలర్ల అక్రమ లావాదేవీలను దినకరన్ నిర్వహించి.. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్‌లోని డిప్పర్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్‌లోకి తరలించినట్టు ఈడీ అభియోగాలు మోపింది. 36 లక్షల 36వేల డాలర్లు, లక్ష పౌండ్ల అక్రమ లావాదేవీలు విదేశాల్లో నిర్వహించినట్టు ఈడీ మరో కేసు కూడా దినకరన్‌పై పెట్టింది. ఈ రెండు కేసులకు సంబంధించి ఊరట కోసం దినకరన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఎదురుదెబ్బ తగిలింది.
మరోవైపు పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దినకరన్ తన వర్గం ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలు నడుపుతున్న సంగతి తెలిసిందే.