FERA case
-
నేతల వెంట ‘ఈడీ’.. కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
కొచ్చి: లోక్‌సభ ఎన్నికల వేళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు కేరళ హైకోర్టు కీలక సూచన చేసింది. ప్రచారానికి కొద్ది సమయం మాత్రమే ఉన్నందున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని దర్యాప్తు పేరుతో ఇబ్బంది పెట్టడం సరికాదని వ్యాఖ్యానించింది. మసాలా బాండ్లకు సంబంధించి ఫెరా చట్టం ఉల్లంఘన ఆరోపణలపై ఈడీ తనకు పదే పదే సమన్లు ఇవ్వడంపై కేరళ మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు పిటిషనర్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, ఆయనకు ప్రచారానికి కేవలం నెల రోజుల కంటే తక్కువ సమయం మాత్రమే ఉందని గుర్తు చేసింది. ఈ సమయంలో ఎంపీ అభ్యర్థిని ఇబ్బంది పెట్టడం సరికాదని ఈడీకి సూచించింది. పిటిషన్ విచారణను మే 22కువాయిదా వేసింది. మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐసాక్ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కేరళలోని పతనంతిట్ట నియోజకవర్గం నుంచి సీపీఎం నుంచి బరిలో ఉన్నారు. రెండవ దశ పోలింగ్‌లో భాగంగా ఏప్రిల్ 26న కేరళలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల వేళ ఇటీవల ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా దేశవ్యాప్తంగా పలు పార్టీలకు చెందిన నేతలను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. నేతలు, సినీ ప్రముఖులపై ఐటీ, ఈడీ దాడులు -
ఈడీ సోదాలు.. వాషింగ్ మెషిన్లో రూ. 2.5 కోట్ల నగదు
న్యూఢిల్లీ: విదేశీ మారక ద్రవ్య(ఫెరా) నిబంధనల ఉల్లంఘన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జరిపిన సోదాల్లో భారీగా డబ్బు పట్టుబడింది. అయితే ఈసారి దొరికిన డబ్బు బీరువాల్లోనో, లాకర్లోనో కాదు వాషింగ్‌మెషిన్‌లో ప్రత్యక్షమైంది. ఢిల్లీలోని క్యాప్రికార్నియన్ షిప్పింగ్ కంపెనీకి చెందిన ఆఫీసుల్లో ఈడీ మంగళవారం ఏకకాలంలో సోదాలు జరిపింది. ఈ సోదాల్లో వాషింగ్‌మెషిన్‌లో దాచి ఉంచిన రెండున్నర కోట్ల రూపాయలను ఈడీ పట్టుకుంది. ఇవి కాకుండా పలు డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులను ఈడీ స్వాధీనం చేసుకుంది. రూ.1800 కోట్ల మేర సింగపూర్ కంపెనీలకు అక్రమ చెల్లింపులు చేసినట్లు క్యాప్రికార్నియన్ షిప్పింగ్ కంపెనీపై ఆరోపణలున్నాయి. ఇదీ చదవండి.. తీహార్ జైలుకు కల్వకుంట్ల కవిత -
విజయ్ మాల్యాకు షాక్
సాక్షి, న్యూఢిల్లీ : వేలకోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగనామం పెట్టి పారిపోయిన ప్యుజిటివ్ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు మరో షాక్ తగిలింది. ఫెరా నిబంధనల ఉల్లంఘనల కేసులో మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని బెంగళూరు కోర్టు ఢిల్లీ హైకోర్టు శనివారం ఆదేశించింది. తదుపరి విచారణకు జూలై 10 వ తేదీనికి వాయిదా వేసింది. జూలై 10వ తేదీ నాటికి ఆస్తులను అటాచ్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దీపక్ షెరావత్ బెంగళూరు పోలీసులు ఆదేశించారు.ఇప్పటికే బెంగళూరు పోలీసులు దాదాపు 159 ఆస్తులను గుర్తించినట్లు న్యాయస్థానానికి ఇప్పటికే అధికారులు తెలియజేశారు. గత ఏడాది మేలో ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు ఆదేశించిన కోర్టు దీనిపై సమగ్ర నివేదికను అందించాలని కోరింది. ఈ కేసులో మాల్యాపై నాన్‌బెయిలబుల్ వారెంట్ పెండింగ్‌లో ఉన్న సంగతి విదితమే. కాగా రూ.9 వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసం చేయడంతో పాటు, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని విజయ్ మాల్యాపై ఆరోపణలు ఉన్నాయి. రుణ బకాయిలను వసూలు చేసుకునేందుకు ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం న్యాయపరమైన చర్యలు ప్రారంభించడంతో 2016లో విజయ్ మాల్యా లండన్‌కు పారిపోయాడు. అయితే ఈ కేసులో మాల్యాను తిరిగి భారత్‌కు రప్పించేందుకు సీబీఐ, ఈడీ తీవ్ర ప్రయత్నిస్తున్నాయి -
విజయ్ మాల్యాకు గట్టి హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకు రుణాల ఎగవేతదారుడు, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ఢిల్లీ న్యాయస్థానం హెచ్చరికలు జారీ చేసింది. ఫెరా కేసులో డిసెంబర్ 18లోపు తమ ఎదుట హాజరుకావాలంటూ పటియాలా హౌజ్ కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. మాల్యాకు ఇదే చివరి అవకాశమని న్యాయమూర్తి పేర్కొనటం విశేషం. ఫెరా ఉల్లంఘనలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టోరేట్ నమోదు చేసిన ఓ కేసులో ఆయన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. గడువు తేదీలోగా హాజరుకాని పక్షంలో మాల్యాను ఆర్థిక నేరంలో దోషిగా భావించాల్సి ఉంటుందని బెంచ్ వ్యాఖ్యానించింది. కాగా, ఆర్థిక నేరస్తుడిగా మాల్యాను ప్రకటించాలని ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టోరేట్ విభాగం నిన్న కోర్టు కోర్టును ఆశ్రయించింది. ఇక ఈ ఏప్రిల్‌లోనే ఢిల్లీ కోర్టు మాల్యా పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీచేసిన విషయం తెలిసిందే. తాజాగా పాటియాలా కోర్టు జారీ చేసిన దాంతో కలిపి ఇప్పటిదాకా మొత్తం ఆరు వారెంట్లు లిక్కర్ కింగ్‌పై జారీ అయ్యాయి. అదే సమయంలో కోర్టు రెండు నెలల్లోగా ఈ కేసు పురోగతికి సంబంధించిన సాక్షి పూర్తి వివరాలు అందజేయాలని ఈడీని ఆదేశించింది. ఆరోపణలు ఏంటంటే... మాల్యా 1996,97,98 సంవత్సరాలకు గానూ ఫార్ములా వన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ రేసుల్లో కింగ్ ఫిషర్ లోగోను ప్రదర్శించారు. అందుకుగానూ సుమారు 2 లక్షల అమెరికన్ డాలర్లను మాల్యా.. ఓ బ్రిటిష్ కంపెనీ, యూరోపియన్ సంస్థలకు చెల్లించారు. అయితే ఆర్బీఐ అనుమతి లేకుండా ఫెరా నిబంధనలను ఉల్లంఘిస్తూ మాల్యా డబ్బు చెల్లించారిన ఈడీ ఆరోపిస్తూ కేసు నమోదు చేసింది. -
దినకరన్‌కు ఎదురుదెబ్బ!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అసమ్మతి నేత టీటీవీ దినకరన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన ఫెరా కేసులో మూడు నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దినకరన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించలేమంటూ సుప్రీంకోర్టు సోమవారం దినకరన్ అప్పీల్‌ను కొట్టివేసింది. 2001లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదుచేసిన ఫెరా కేసులో దినకరన్‌పై ఇప్పటికే ఎగ్మూరు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు అభియోగాలు ఖరారు చేసింది. విదేశీ మారక ద్రవ నియంత్రణ చట్టం (ఫెరా)లోని పలు నిబంధనలు ఉల్లంఘించారని, ఆర్బీఐ అనుమతి లేకుండా కోటి 4 లక్షల 93వేల 313 డాలర్ల అక్రమ లావాదేవీలను దినకరన్ నిర్వహించి.. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్‌లోని డిప్పర్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్‌లోకి తరలించినట్టు ఈడీ అభియోగాలు మోపింది. 36 లక్షల 36వేల డాలర్లు, లక్ష పౌండ్ల అక్రమ లావాదేవీలు విదేశాల్లో నిర్వహించినట్టు ఈడీ మరో కేసు కూడా దినకరన్‌పై పెట్టింది. ఈ రెండు కేసులకు సంబంధించి ఊరట కోసం దినకరన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దినకరన్ తన వర్గం ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలు నడుపుతున్న సంగతి తెలిసిందే. -
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శశికళ విచారణ
చెన్నై: విదేశీ మారక ద్రవ్యం నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించిన కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ కోర్టు విచారణలో పాల్గొన్నారు. బెంగళూరులోని అగ్రహారం జైలులో ఉన్న ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెన్నైలోని ఎగ్మూర్ ఆర్థిక నేరాల విచారణ కోర్టు విచారించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జకీర్ హుస్సేన్ అడిన ప్రశ్నలకు శశికళ.. ‘గుర్తు లేదు’, ‘తెలియదు’ అంటూ సమాధానాలు దాటవేశారు. శశికళ జైలు దుస్తుల్లోనే విచారణలో పాల్గొన్నారు. తదుపరి విచారణ 13వ తేదీకి వాయిదా పడింది. ఆ రోజున ఈడీ తరపున ఆమెను క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అవకాశం కల్పిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. జయ టీవీ(జేజే టీవీ)కి సంబంధించి ఎలక్ట్రానిక్స్ వస్తువుల కొనుగోళ్లకు డాలర్ల రూపంలో సాగిన నగదు బట్వాడాను ఈడీ గుర్తించింది. ఈ మేరకు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ఆమె సన్నిహితురాలు శశికళలపై నాలుగు కేసులు నమోదయ్యాయి. జైలులో ఉన్నందున విడియో కాన్ఫరెన్స్ విచారణకు అనుమతించాలన్న శశికళ అభ్యర్థనకు ఎగ్మూర్ కోర్టు అంగీకారం తెలిపింది. -
దినకరన్‌కు మరో షాక్!
ఫెరా కేసులో అభియోగాలు ఖరారు చెన్నై: అన్నాడీఎంకే అధికారిక గుర్తు కోసం ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపినట్టు ఇప్పటికే కేసు ఎదుర్కొంటున్న ఆ పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు మరో షాక్ తగిలింది. 2001లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదుచేసిన కేసులో ఆయనపై ఎగ్మూరు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు అభియోగాలు ఖరారు చేసింది. విదేశీ మారక ద్రవ నియంత్రణ చట్టం (ఫెరా)లోని పలు నిబంధనలు ఉల్లంఘించినట్టు ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణకు గురువారం వ్యక్తిగతంగా హాజరైన దినకరన్ న్యాయమూర్తి అభియోగాలు చదివి వినిపించగా.. వాటిని తిరస్కరించారు. ఆర్బీఐ అనుమతి లేకుండా కోటి నాలుగు లక్షల 93వేల 313 డాలర్ల అక్రమ లావాదేవీలను దినకరన్ నిర్వహించి.. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్‌లోని డిప్పర్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్‌లోకి తరలించినట్టు ఈడీ కేసు నమోదుచేసింది. 36 లక్షల 36వేల డాలర్లు, లక్ష పౌండ్ల అక్రమ లావాదేవీలు విదేశాల్లో నిర్వహించినట్టు ఈడీ మరో కేసు కూడా దినకరన్‌పై పెట్టింది. ఈ రెండు కేసులలోనూ విచారణను న్యాయస్థానం జూన్ 22కు వాయిదా వేసింది. -
దినకరన్ అరెస్టయ్యాడా?
-
దినకరన్ అరెస్టయ్యాడా?
ఎగ్మూర్ కోర్టు ప్రశ్న సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే(అమ్మ) బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ను అన్ని సమస్యలు ఒకే సారిగా చుట్టుముట్టిన విషయం తెలిసిందే. పార్టీ నుంచి బహిష్కరణ వేదన, రెండాకుల చిహ్నం కోసం లంచం వ్యవహారం ఒకవైపు, ఫెరా కేసు ఉచ్చు ఇంకో వైపు ఆయనను చుట్టుముట్టాయి. రెండాకుల కోసం రూ.50 కోట్లు లంచం ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన మూడు రోజులుగా ఢిల్లీలో పోలీసుల విచారణకు హాజరవుతున్నారు. శనివారం ఏడు గంటలు, ఆదివారం పది గంటల పాటు ఆయనను పోలీసులు విచారించారు. మరోవైపు ఫెరా కేసు విచారణ నిమిత్తం టీటీవీ ప్రతి రోజు ఎగ్మూర్ కోర్టుకు హాజరు కావాల్సివుంది. ఢిల్లీలో ఉన్న ఆయన సోమవారం విచారణకు హాజరుకాలేకపోయారు. ఆయన తరఫున హాజరైన న్యాయవాది.. న్యాయమూర్తి మలర్ మతికి వివరణ ఇచ్చుకున్నారు. ఓ క్రిమినల్ కేసు అభియోగంపై ఢిల్లీకి టీటీవీ వెళ్లారని, అందుకే ఆయన రాలేని పరిస్థితి ఉన్నట్టు తెలిపారు. ఢిల్లీ పోలీసుల సమక్షంలో ఆ విచారణ సాగుతోందని న్యాయవాది పేర్కొగా, న్యాయమూర్తి జోక్యం చేసుకుని దినకరన్‌ను అరెస్టు చేశారా? అని ప్రశ్నించారు. ఇందుకు న్యాయవాది లేదని సమాధానం ఇచ్చారు. ఒకవేళ ఆయనను అరెస్టు చేస్తే సమాచారం కోర్టుకు ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. మూడో రోజూ విచారణ ఆదివారం 10 గంటల పాటుగా జరిగిన విచారణలో దినకరన్ ముందు పలు ఆధారాలను పోలీసులు ఉంచినట్టు సమాచారం. ఫోన్ సంభాషణలు, వాట్సాప్, ఎస్ఎంఎస్ సమాచారాలు, మధ్యవర్తి సుకేష్చంద్ర శేఖర్‌తో సాగిన వ్యవహారాలను దినకరన్ ముందు ఉంచినట్టు తెలిసింది. శనివారం వరకు సుకేష్ చంద్రశేఖర్ ఎవరో అన్నది తనకు తెలియదని వాదిస్తూ వచ్చిన దినకరన్ తాజాగా ఆయనో న్యాయమూర్తిగా తనకు పరిచయమైనట్టు వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. సోమవారం సాయంత్రం నుంచి దినకరన్‌తో పాటుగా ఆయన పీఏ జనార్దన్, సన్నిహితుడు మల్లికార్జున్ లను కూడా ఢిల్లీ పోలీసులు విచారణ సాగించే పనిలో పడ్డారు. ఈ విచారణ మరెన్ని గంటలు సాగనుందో వేచి చూడాల్సిందే. పోలీసులకు కావాల్సిన ఆధారాలు చిక్కినట్టేనని, ఇక దినకరన్ అరెస్టు కావడం తథ్యమన్న ప్రచారం ఊపందుకుంది.