ఇద్దరు ఎమ్మెల్యేలకు గాయాలు
సచివాలయం ముందు రాస్తారోకో యత్నం
బ్యారికేడ్లతో అడ్డుకున్న పోలీసులు
చెన్నై, సాక్షి ప్రతినిధి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ విపక్ష ఎమ్మెల్యేలు విజృంభించారు. సాధారణ కార్యకర్తల వలే రాస్తారోకో యత్నం చేశారు. ఎమ్మెల్యేలు, పోలీసుల తోపులాటతో సచివాలయ ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. ఈ సంఘటనల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు తీవ్రంగా గాయపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం తాగునీటి వసతులపై మంత్రి వేలుమణి ప్రసంగించి కూర్చున్నారు. వెంటనే వామపక్షాల ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముద్రించిన కరపత్రాలను వెదజల్లారు. అన్నదాతలకు అందజేస్తున్న సబ్సిడీలపై కేంద్రం కోత విధిస్తోందనే ఆరోపణలతో కూడిన కరపత్రాలు చిందరవందరగా పడటంతో గందరగోళం నెలకొంది. మాట్లేందుకు అవకాశం ఇవ్వడంలేదని స్పీకర్‌పై విపక్షాలు విరుచుకుపడ్డాయి.
సుమారు అరగంటపాటు అసెంబ్లీ సమావేశ హాలు కేకలు, అరుపులతో దద్దరిల్లింది. వామపక్షాలకు వాదనకు కాంగ్రెస్, మనిదనేయ మక్కల్ కట్చి, పుదయ తమిళగం, పీఎంకే తదితర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు సమావేశం నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చాయి. ఆ తరువాత అకస్మాత్తుగా సచివాలయం వెలుపలకు పరుగెత్తుతూ రాస్తారోకో చేసేందుకు పూనుకున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాల బందోబస్తులో ఉన్న పోలీసులు ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. ట్రాఫిక్ కోసం వినియోగించే బ్యారికేడ్లు, తాళ్లు, కమ్ములతో కూడిన వైర్లను ప్రయోగించి ఎమ్మెల్యేలకు ఎదురునిలిచారు.
అయినా పోలీసులను తోసుకుని రోడ్డుపైకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తీవ్రస్తాయిలో తోపులాట చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలమని కూడా చూడకుండా పోలీసులు వ్యవహరించారంటే సచివాలయం ప్రధాన గేటు ముందు బైఠాయించారు. ఒక దశలో ఎమ్మెల్యేలు, పోలీసులకు మద్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. బ్యారికేడ్లేను దాటి రోడ్డుపై వెళుతున్న ఎమ్మెల్యేలను బంధించేలా ఘనమైన ఇనుప వైరును మరోవైపు పోలీసులు విసిరివేశారు. ఈ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయధరణి, సీపీఐ ఎమ్మెల్యే అన్నాదురై తలపై వైరు పడటంతో తీవ్రగాయలైనాయి. దీంతో విపక్ష ఎమ్మెల్యేలు మరింతగా రెచ్చిపోయి ఘర్షణకు దిగారు. బుధవారం నాటి అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు విపక్షాల ఆందోళన సాగుతూనే ఉంది. గాయాలపై ఇద్దరు ఎమ్మెల్యేలు ఆసుపత్రిలో చేరారు.