
ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య
వేలూరు: ప్లస్‌టూ ఫలితాల్లో ఫెయిల్ అవడంతో గుడియాత్తం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇద్దరు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్లస్‌టూ పరీక్ష ఫలితాలను గురువారం ఉదయం విడుదల చేశారు. వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని ఉప్పరపల్లికు చెందిన కూలీ కార్మికుడు జయపాల్ కుమారుడు రఘు(18) ప్లస్‌టూలో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని లేఖ రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
అదే విధంగా గుడియాత్తం సమీపంలోని మూంగపట్టు గ్రామానికి చెందిన నాగరాజ్ కుమారుడు గుణశేఖరన్(17)ప్లస్‌టూ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది గుణశేఖరన్ ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన బంధువులు గుణశేఖరన్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే గుణశేఖరన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తన కుమారుడు ప్లస్‌టూ పరీక్షల్లో ఫెయిల్ కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి నాగరాజన్ గుడియాత్తం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీఎస్పీ విజయకుమార్, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు విద్యార్థులు గుడియాత్తం నెల్లూరు పేటలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కావడం గమనార్హం.