సన్యాసిగా మారనున్న బ్రేక్సా, శ్వేత
తమిళనాడు, తిరువణ్ణామలై: తిరువణ్ణామలైలో ఇద్దరు యువతులు సన్యాసిగా మారేందుకు నిర్ణయించుకున్నారు. వివరాలు.. తిరువణ్ణామలైకి చెందిన పారిశ్రామికవేత్తలు గౌతమ్‌కుమార్, అరవింద్‌కుమార్ అన్నదమ్ములు. గౌతమ్‌కుమార్ రెండో కుమార్తె బ్రేక్సా (26), అరవింద్‌కుమార్ రెండో కుమార్తె శ్వేత (25) వీరద్దరూ కలిసి జైన్ మత సన్యాసినులుగా జీవించేందుకు నిర్ణయించుకున్నారు. దీనిపై గౌతమ్‌కుమార్, అరవింద్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. బ్రేక్సా ఎంబీఏ పూర్తి చేసిందని, శ్వేత సీఏ పూర్తి చేసిందన్నారు. వీరిద్దరూ 22ఏళ్ల వయసులోనే సన్యాసినులుగా మారేందుకు నిర్ణయించుకున్నారన్నారు. తమ కన్నీటి గాథ వారిని మార్చలేక పోయిందని ప్రేమతోనే గాక, బెదిరించి కూడా చూశామని వారి నిర్ణయం మార్చుకోలేదన్నారు.
సన్యాసిగా మారాలంటే ఎంఏ జైనాలజీ చదవాలని ఇందుకోసం రాజస్థాన్‌లోని మత కళాశాలలో చేర్చామని దాదాపు నాలుగేళ్ల పాటు పూర్తిగా సన్యాసులుగా మారేందుకు అవసరమైన సర్టిఫికెట్‌ను కూడా పొందారన్నారు. జైన్ మతంలో సన్యాసులుగా మారేందుకు కఠినమైన నిబంధనలు పాటించాలని భిక్షాటన చేసి ఆహారం భుజించాలని, ఎక్కడికి వెళ్లినా నడిచే వెళ్లాలని, సాయంత్రం 6 గంటల తరువాత ఆహారం తీసుకోరాదు, మూడు జతల దుస్తులు మాత్రమే వెంట ఉంచుకోవాలన్నారు. కుటుంబ సభ్యులతో ప్రేమ పెంచుకోరాదని, మూడు నెలలకోసారి తల వెంట్రుకలను తీసి వేయాలని ఇలాంటి నిబంధనలు పాటించాలన్నారు. ఈనెల 26వ తేదీన తిరువణ్ణామలై మీనాక్షి కళ్యాణ మండపంలో తమ కుమార్తెలను సన్యాసినిలుగా మార్చే కార్యక్రమం జరగనుందని జిల్లా న్యాయమూర్తి, కలెక్టర్, ఎస్పీ, రాజకీయ నేతలు పాల్గొననున్నట్టు తెలిపారు. తిరువణ్ణామలై జిల్లాలోనే మొట్టమొదట సారిగా జైన్ మతానికి చెందిన ఇద్దరు యువతులు సన్యాసినులుగా మారనుండడంతో పట్టణంలో అక్కడక్కడ బ్యానర్‌లు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment