వడమాలపేట (చెన్నై): ఆమె భవిష్యత్తుపై ఎన్నో కలలు కంది.. కాబోయే భర్తతో అమెరికాలో మొదలుపెట్టబోయే జీవితం గురించి ఆశలు.. అయితే విధి రోడ్డు ప్రమాదం రూపంలో కల్లలు చేసింది. ఆమె ఆశల్ని చిదిమేసింది. తన వివాహానికి కల్యాణ మండపం బుక్ చేయడానికి వస్తూ ఆమె తిరిగిరాని లోకాలకు చేరుకుంది. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడులోని కాంచీపురానికి చెందిన సెల్వంకు ఇద్దరు కుమార్తెలు.
పెద్దకుమార్తె ప్రియాంక(30) ఎంఈ పూర్తి చేసింది. గత వారం ఆమెకు పెళ్లి సంబంధం కుదిరింది. తిరుపతి లేదా తిరుమలలో వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. పెళ్లి తరువాత ఆమె భర్తతో అమెరికా వెళ్లాల్సి ఉంది. కల్యాణ మండపం బుక్ చేయడానికి అమ్మ, నాన్న, చిన్నాన్న కొడుకుతో కలిసి సోమవారం బొలెరో వాహనంలో ప్రియాంక తిరుపతికి బయల్దేరారు. నగరి వరకు కారును ఆమె తండ్రి నడుపుతూ వచ్చాడు.
అయితే అతడు అలసిపోవడంతో ప్రియాంక అక్కడ నుంచి డ్రైవింగ్ చేసింది. మార్గమధ్యంలో వడమాలపేట మండలం అంజేరమ్మ ఆలయం వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో ప్రియాంక తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. తల్లిదండ్రులకు ఎలాంటి గాయాలు కాలేదు. తమ్ముడికి మాత్రం స్వల్పగాయాలయ్యాయి. ప్రియాంక బంధువులు కాంచీపురం, చెన్నై, నగరి తదితర ప్రాంతాల నుంచి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రైవేటు అంబులెన్సులో మృతదేహాన్ని కాంచీపురానికి తరలించారు.
చదవండి: (ఆమె కోసం ఎంతకైనా.. ప్రియురాలికి గిఫ్ట్ ఇచ్చేందుకు భార్య..)
Comments
Please login to add a commentAdd a comment