దాదర్, న్యూస్‌లైన్: తెలుగు ప్రజలంతా ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా ఏకమై సమస్యలపై పోరాడినప్పుడే ప్రగతి సాధిస్తారని ‘తెలుగు కళా సమితి’ ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి కొండారెడ్డి అన్నారు. నవీముంబై వాషిలోని కళాసమితి ప్రాంగణంలో శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగిన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో ఆయన స్వాగతోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా కొండారెడ్డి మాట్లాడుతూ.. తెలుగు కళా సమితిలో ప్రాంతీయబేధాలకు తావు లేదన్నారు.
అన్ని ప్రాంతాలకు చెందిన పండుగలను, సాంస్కతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు కళా సమితి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందన్నారు. ముంబైలో తెలుగువారి మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వారు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఒకే విధమైనవని అన్నారు. వాటి పరిష్కారానికి వారంతా సంఘీభావం తెలపాలని పిలుపు నిచ్చారు. అంతకు ముందు కళా సమితి అధ్యక్షుడు బండి నారాయణరెడ్డి, మాదిరెడ్డి కొండారెడ్డి, ఎం.సుబ్రహ్మణ్యం, కె.వరలక్ష్మి, ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి రాధా మోహన్ తదితరులు జ్యోతి ప్రజ్వలన గావించి సంబరాలను ప్రారంభించారు.
కె.వరలక్ష్మి ఆలపించిన ..‘శ్రీ గణనాధం భజరే-సిద్ధ పరా శక్తి యుతం’ ప్రార్థనా గీతంతో సాంస్కతిక కార్యక్రమాలు ప్రారంభించారు. మహిళా సభ్యులు రజని, నీరజలు ‘నీరు జల్లిన ముంగిట్లో... పన్నీరు జల్లిన వాకిట్లో-- దారి పొడుగునా గొబ్బిళ్లో, ముత్యాల ముగ్గులా గొబ్బిళ్లో’ వంటి సంక్రాంతి పాటలను ఆల పించగా చిన్నారులు వాటికి అనుగుణంగా నృత్యం చేశారు. అభినయా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్యాన్స్‌కు చెందిన డెరైక్టర్, ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, గురు రాధామోహన్ బృందం ప్రదర్శించిన త్రిమూర్తులు, పుష్పాం జలి, మహారాష్ర్టకు చెందిన లావణి, ఇమేజస్ ఆఫ్ ఇండియా నృత్యాలు ఆహూతులను అలరించాయి.
కాగా, ప్రముఖ తెలుగు కళాకారుడు కిషన్ జగ్లర్ ప్రదర్శించిన అద్భుత సాహస విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గత విద్యా సంవత్సరంలో ఉన్నత శ్రేణిలో విజయం సాధించిన విద్యార్థులకూ, కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకు ఈ సందర్భంగా బహుమతులు, సర్టిఫికెట్లు అందించి సత్కరించారు. సమితి సభ్యులు సుబ్రహ్మణ్యం, వరలక్ష్మి, వై.వి.నారాయణరెడ్డి, టి. మంజుల, మీర్జాల్లి షేక్, మీనాంబిక తదితరులు సహాయ సహకారాలు అందించారు.
ఐకమత్యంతోనే తెలుగు ప్రజల ప్రగతి
Published Sun, Jan 18 2015 9:48 PM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM
Advertisement