సాక్షి, ముంబై: మహారాష్ట్రలో మిత్రపక్షాలైన శివసేన, బీజేపీలు అధికారంలో ఉన్నా పలు అంశాల్లో మాత్రం విభేదాలు కనిపిస్తున్నాయి. గల్లి నుంచి ఢిల్లీ దాకా అనేక అంశాలు వీరి మధ్యదూరాన్ని పెంచుతున్నాయి. 15 ఏళ్ల పొత్తుకు గతేడాది జరిగిన ఎన్నికల్లో మంగళం పాడాయి. విడిపోయి పోటీ చేసినా... తరువాత కలసి అధికారాన్ని చేపట్టాయి. అయితే శివసేన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా.. చాలా విషయాలపై అసంతృప్తి వ్యక్త చేస్తోంది.
ముంబై కార్పొరేషన్‌లో కూడా వీరి కూటమి కొనసాగుతోంది. అక్కడా విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజా బడ్జెట్, పార్లమెంట్ సమావేశాల్లోనూ బీజేపీ వ్యతిరేకంగా పలు అంశాలను శివసేన లేవనెత్తుతోంది.
ప్రజా వ్యతిరేక విధానాలను ఒప్పుకునేది లేదని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం కోసం చట్టసభల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతామని కుండ బద్ధలు కొట్టారు. ముంబైలో చేపట్టాలనుకుంటున్న మెట్రో-3 ప్రాజెక్టు, పార్లమెంటులో ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తోంది. రాష్ట్రంలో మరిన్ని తీవ్ర పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
సేనను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నం....
శివసేన వైఖరిపై బీజేపీలో నిరసన వెల్లువెత్తుతున్నా ప్రస్తుత పరిస్థితిలో ఆ పార్టీని ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించిందని తెలుస్తోంది. ముఖ్యంగా భూ సేకరణ బిల్లు అంశంపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఉద్ధవ్ ఠాక్రేతో ఫోన్‌లో మాట్లాడినిట్లు సమాచారం.
అధికారికంగా వివరాలు తెలియరానప్పటికీ బిల్లుకు మద్దతు పలకాలని ఉద్ధవ్‌ను వెంకయ్య కోరినట్టు తెలిసింది. ఈ విషయంపై ఢిల్లీలో కూడా శివసేన ఎంపీలందరూ మంగళవారం సమావేశం నిర్వహించారు. భూ సేకరణ అంశంపై ఎలా వ్యవహరించాలనే విషయంపై చర్చలు జరిపారు. సరైన సమయంలో భూ సేకరణ బిల్లుపై నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రకటించారు.
కలహాల కాపురం
Published Wed, Mar 11 2015 3:10 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement