బీజేపీ చూపు ఎటువైపు? | Maharashtra assembly elections 2014: BJP single-largest party in state, NCP offers unexpected ‘outside support’ | Sakshi
Sakshi News home page

బీజేపీ చూపు ఎటువైపు?

Published Sun, Oct 19 2014 11:27 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

బీజేపీ చూపు ఎటువైపు? - Sakshi

బీజేపీ చూపు ఎటువైపు?

సాక్షి, ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఆదివారం వెలువడిన ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా బీజీపీ అవతరించినా సర్కారు ఏర్పాటుకు సరిపడా సీట్లు రాకపోవడంతో ఆ పార్టీ ఇతర పార్టీల మద్దతుతీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు చకచకా మారిపోతున్నాయి. నిన్నటివరకు బద్ధశత్రువులుగా వ్యవహరించిన పార్టీలు ఒక్కసారిగా తమ గొంతును సవరించుకుంటున్నాయి. మహారాష్ర్ట అభివృద్ధి కోసం బీజేపీకి బేషరతుగా మద్దతు ఇస్తామని ఎన్సీపీ స్వచ్ఛందంగా ప్రకటించినా.. ఆ పార్టీ మద్దతు తీసుకునే విషయంలో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. అలాగే శివసేన మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుచేయాలని బీజేపీపై మరోవైపునుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఆర్‌ఎస్‌ఎస్ సైతం రంగంలోకి దిగడంతో ఇప్పుడు రాజకీయం మంచి రసకందాయంలో పడింది.

శివసేనతోనే కాపురం...?
రాష్ట్రంలో మళ్లీ బీజేపీ, శివసేనలు ఒక్కటవుతాయని అంచనాలు మొదలయ్యాయి. ప్రజలు కూడా అదే విధంగా తీర్పునిచ్చారని, దాన్ని గౌరవించి రెండు పార్టీలు ఒక్కటవ్వాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. కాగా, ఎన్నికల ఫలితాల అనంతరం కొంత మేర ఇరు పార్టీల నాయకుల వైఖరిలో మార్పు కన్పిస్తోంది. ఎన్నికల వరకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న రెండు పార్టీల నాయకులూ ఇప్పుడు పరిస్థితులకనుగుణంగా ఆచితూచి వ్యాఖ్యలు చేస్తున్నారు. శివసేన సీనియర్ నాయకులైన మనోహర్ జోషీ, దేశాయ్ తదితరులు మాట్లాడుతూ మద్దతు విషయమై బీజేపీ నుంచి ప్రస్తావన వచ్చిన అనంతరం ఆలోచిస్తామని, అయితే తుది నిర్ణయం మాత్రం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తీసుకుంటారని చెబుతున్నారు. ఇలా ఒకరకంగా బీజేపీతో జతకట్టేందుకు తాము సిద్దంగా ఉన్నట్టు సంకేతాలిచ్చారు.

మరోవైపు బీజేపీ కూడా అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెబుతూనే పాతికేళ్లమిత్రులైన శివసేనతోనే జతకట్టేందుకు ప్రయత్నిస్తామని చెబుతున్నారు. అయితే ఈ విషయంపై మాత్రం పార్టీ పార్లమెంటరి బోర్డు నిర్ణయం తీసుకుంటుందని చెప్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మరోవైపు ఎన్సీపీ మద్దతు ప్రకటించడం విశేషం. అయితే ఎన్నికల సమయంలో ఎన్సీపీ నాయకులతోపాటు పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ మద్దతు తీసుకునే విషయంపై ఆర్‌ఎస్‌ఎస్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీకి సూచించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, బీజేపీ అగ్రనాయకులైన నరేంద్ర మోదీ,అమిత్ షాలకు ఉద్ధవ్ ఠాక్రే ఫోన్ చేసి అభినందనలు తెలియజేయడంతో ఈ రెండుపార్టీల మధ్య మైత్రి తిరిగి బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.
 
ఎన్సీపీ కోటలో బీజేపీ హవా
పుణే సిటీ, న్యూస్‌లైన్ : పుణేలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఎప్పుడు లేని విధంగా మోది ప్రభావంతో అభ్యర్థులు అవలీలగా విజయం సాధించారు. నగరంలోని 8 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉండగా అన్నిచోట్ల బీజేపీ విజయం సాధించడం గమనార్హం. మాజీ (సహాయక) గృహ మంత్రి రమేష్ భాగ్వే, వినాయక విమ్హాన్, బాపు పఠారే వంటి ఎన్సీపీ నాయకులు ఓడిపోయారు. ఎన్సీపీ పురుడు పోసుకున్న పుణే జిల్లాలో ఇంత ఘోరంగా ఓడిపోవడం పార్టీ కార్యకర్తలు, నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. జిల్లా మొత్తంలో 21 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా మూడు చోట్ల మాత్రమే ఎన్సీపీ తన ఉనికిని చాటుకుంది. శివ్‌సేన మూడుచోట్ల, కాంగ్రెస్ ఒక్క చోట, ఎమ్మెన్నెస్ జున్నార్‌లో ఖాతా తెరవగా, దౌన్‌లో రాష్ట్రీయ సమాజ్ పక్ష విజయం సాధించింది.

అదేవిధంగా బోసిరిలో స్వతంత్య్ర అభ్యర్థి మహేష్ లాండ్గే విజయం సాధించగా, భారతీయ జనతాపార్టీ 11 చోట్ల విజయం సాధించి తన బలాన్ని నిరూపించుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ కంచుకోటగా ఉండే పుణే కంటోన్మెంట్ ఈ దఫా బీటలు వారింది. పుణే కంటోన్మెంట్ పరిసర ప్రాంతంలో ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగరీత్యా, వ్యాపారాల రీత్యా వచ్చి స్థిరపడినవారే ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో మైనార్టీ ఓట్లు కూడా ఎక్కువగా ఉండడంతో 1962 నుంచి ఏడు పర్యాయాలు కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే కాంగ్రెస్ కంచుకోటగా ఉండే ఈ ప్రాంతం బీజేపీ ఖాతాలో చేరింది.  ఇక్కడ బీజేపీ అభ్యర్థి దిలీప్ కాంబ్లే కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ భాగ్వేపై 14,955 ఓట్ల ఆధిక్యతతో గెలిపొందారు. అదేవిధంగా హడాప్సర్ స్థానం శివసేన వశ మవుతుందని అందరూ భావించినా చివరకు యోగేష్ తిలేకర్, శివసేన అభ్యర్థి మహాదేవ్ బాబర్‌పై 30248 ఓట్ల తేడాతో గెలుపొందారు.
 
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన దిగ్గజాలు
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వివిధ రాజకీయ పార్టీల దిగ్గజాలు చతకిలపడ్డారు. ఆదివారం వెలువడిన శాసన సభ ఎన్నికల్లో ఓటర్లు పేరుపొందిన నాయకులను మట్టికరిపించారు. తమకు తిరుగే లేదని చెప్పుకునే నాయకుల అంచనాలన్నీ తరుమారు చేస్తూ ఊహించని విధంగా తీర్పునిచ్చారు. వర్లీ శాసనసభ నియోజక వర్గంలో తనకు తిరుగులేదని భావించిన ఎన్సీపీ అభ్యర్థి సచిన్ అహిర్, ఎమ్మెన్నెస్‌కు చెందిన బాలా నాంద్‌గావ్కర్, నితిన్ సర్‌దేశాయి. ప్రవీణ్ దరేకర్ లాంటి దిగ్గజాలు పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇలా అనేక మంది బడా నాయకుల అంచనాలన్నీ ఈ ఎన్నికల్లో తలకిందులయ్యాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement