ముంబై: మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై శివసేన ప్రశంసలు కురిపించింది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుతో రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని తాము భావిస్తున్నట్లు శివసేన స్పష్టం చేసింది. సామ్నా సంపాదకీయంలో నరేంద్ర మోదీతో పాటు మహారాష్ట్ర సీఎం అభ్యర్థి దేవేంద్ర ఫెడ్నవిస్ లను కొనియాడిన శివసేన.. ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ మద్దతును మాత్రం నిరాకరించింది. తొలిసారి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేసే ఫెడ్నవిస్ ప్రభుత్వానికి మెజారిటీని నిరూపించుకోవడం ఒక ఛాలెంజ్ అని పేర్కొంది.
మహారాష్ట్రను అవినీతి రహిత రాష్ట్రంగా మారుస్తామని ప్రకటించడం ద్వారానే ప్రజలు బీజేపీని అతిపెద్ద పార్టీగా నిలబెట్టారని శివసేన తెలిపింది. కాగా, ఒకవేళ ఎన్సీపీతో పొత్తు పెట్టుకుంటే అవినీతి రహిత రాష్ట్రం అనే అంశంపై అనేక సందేహాలు తలెత్తే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమవుతుండటంతో ఆ పార్టీ మాజీ మిత్రపక్షం శివసేన ఎట్టకేలకు బుధవారం మౌనం వీడిన సంగతి తెలిసిందే. బీజేపీ ప్రభుత్వంలో చేరికపై గురువారం నిర్ణయాన్ని వెల్లడిస్తామని ప్రకటించింది. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే బుధవారం ముంబైలో ఉదయం నుంచి రాత్రి వరకూ పలు దఫాలుగా పార్టీ సీనియర్లతో సమావేశమయ్యారు.