రాజీవ్‌గాంధీ హంతకులకు పరామర్శ
వేలూరు: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్, శాంతన్, పేరరివాలన్‌లను తమిలగ వాయువు ఉరిమై పార్టీ అధ్యక్షులు వేల్‌మురుగన్ మంగళవారం మధ్యాహ్నం పరామర్శించారు. మద్యాహ్నం 11.35 గంటలకు సెంట్రల్ జైల్లోకి వెళ్లిన ఆయన 12 గంటల వరకు ఉరిశిక్ష ఖైదీలను పరామర్శించి వారితో పలువిషయాల గురించి చర్చించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ జైలులోని మురుగన్, శాంతన్, పేరరివాలన్ విడుదల అవుతారని నమ్మకంతో ఉన్నారన్నారు.
గతంలో వారిని విడుదల చేసేందుకు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో పెండింగ్‌లో పడిందన్నారు. ప్రస్తుతం నరేంద్రమోడి ప్రభుత్వం వారిని విడుదల చేస్తుందని నమ్మకం ఉందన్నారు. కావేరి, ముల్లై పెరియార్ విషయంలో చట్టపరంగా జయలలిత విజయం సాధించారన్నారు. ఆయన వెంట ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివకుమార్, కార్యకర్తలు జై ల్లోకి వెళ్లారు. వేల్‌మురగన్ జైలుకు రాక సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్నారు.