మరణం.. మర్మమేనా?
► అనుమానాస్పద స్థితిలో మంత్రి విజయభాస్కర్ స్నేహితుడి మృతి
► మృతుడు మంత్రితోపాటూ ఐటీ చిట్టాలో నిందితుడు
ఆర్కేనగర్ ఉప ఎన్నికల తరువాత ఐటీ దాడులు, ఎన్నికల రద్దు తదితర వరుస అనూహ్య పరిణామాల జాబితాలో మరో అనుమానాస్పద మృతి చోటు చేసుకుంది. తమిళనాడు ప్రభుత్వంలో ప్రముఖ కాంట్రాక్టర్, వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి విజయభాస్కర్ స్నేహితుడు సుబ్రమణియన్ సోమవారం ఉదయం అకస్మాత్తుగా ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాలను మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. సుబ్రమణియన్ మృతి సహజమా, ఆత్మహత్యా, ఐటీ దాడులు, నేర నేపథ్యమా అనే అనుమానాలకు తావిస్తోంది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నికల సమయంలో ఓటర్లకు నగదు బట్వాడా సాగిందని ఎన్నికల కమిషన్‌కు అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఏప్రిల్ 7వ తేదీన ఆదాయపు పన్ను శాఖాధికారులు వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి విజయభాస్కర్ సహా 35 చోట్ల ఆకస్మికదాడులు జరిపారు. దాదాపుగా అందరూ అధికార పార్టీకి చెందినవారిపైనే గురిపెట్టారు. ఈ దాడుల్లో మంత్రి ఇంటి నుంచి రూ.50 కోట్లు పట్టుబడినట్లు సమాచారం. అంతేగాక ఉప ఎన్నికలకు రూ.89 కోట్లు ఖర్చు చేసినట్లు, ఓటర్లకు నగదు, బహుమతి కూపన్లు పంచినట్లు తేలింది. దీంతో ఉప ఎన్నిక రద్దయింది.
ఐటీ అధికారులు కేసు నమోదు చేసి, మంత్రి విజయభాస్కర్, మాజీ ఎంపీ రాజేంద్రన్, ఎంజీఆర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ గీతాలక్ష్మి, సమక అధ్యక్షుడు, నటుడు శరత్‌కుమార్, ఆయన భార్య నటి రాధికకు చెందిన రాడాన్ కార్యాలయంలో దాడులు నిర్వహించారు. వీరందరికీ ఐటీ అధికారులు సమన్లు జారీ చేసి విచారించారు. ఇటీవల మంత్రి సతీమణి రమ్యకు కూడా సమన్లు అందజేసి, విచారించారు. అదే సమయంలో నామక్కల్ జిల్లా మోగనూరు రోడ్డు ఉపాధ్యాయకాలనీలోని మంత్రి విజయభాస్కర్ స్నేహితుడు సుబ్రమణియన్(52) ఇంటిపై సైతం దాడులు జరిపారు.
అయితే ఐటీ దాడుల సమయంలో ఆయన విదేశాల్లో ఉన్నారు. ప్రముఖ కాంట్రాక్టర్‌గా పేరుగాంచిన సుబ్రమణియన్ ఇంటిలో సుమారు 10 గంటలపాటూ తనిఖీలు నిర్వహించారు. సదరు సుబ్రమణియన్ పుదుక్కోట్టై, కరూరులో ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ కాంట్రాక్టు పొందారు. మంత్రి విజయభాస్కర్ సిఫార్సుతోనే ఆయనకు ఈ కాంట్రాక్టు దక్కింది. భవన నిర్మాణ అంచనాలు, ఎంతకు ఒప్పందం, ఇందులో కమీషన్‌గా ఎవరి వాటా ఎంత అనే ఆధారాలు ఐటీ దాడుల్లో లభించినట్లు సమాచారం. చిన్నచిన్న కాంట్రాక్టు పనులు చేసుకునే సుబ్రమణియన్‌కి మరో మంత్రి ద్వారా మంత్రి విజయభాస్కర్‌తో పరిచయం ఏర్పడగా అనేక నిర్మాణాలతో పెద్ద కాంట్రాక్టరుగా ఎదిగారు.
సుబ్రమణియన్ ఇటీవలే విదేశాల నుంచి తిరిగిరాగా విచారణకు హాజరు కావాలని ఐటీ అధికారులు సమన్లు పంపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సోమవారం తెల్లవారుజామున నామక్కల్ జిల్లా సేవిట్టు రంగ»ట్టి తోటకు వెళ్లి స్నానం చేశారు. తోటలో సేదతీరుతుండగా అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయారు. తోటలో పనిచేసే పనివాళ్లు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆరోగ్యంగా తిరుగుతుండే సుబ్రమణి ఆత్మహత్య చేసుకున్నారా లేక గుండెపోటుకు గురై మరణించారా అనే సందేహాలు నెలకొన్నాయి.