అల్లర్లు, దౌర్జన్యాలు, హింస | YSRCP 58 complaints to Election Commission: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

అల్లర్లు, దౌర్జన్యాలు, హింస

Published Tue, May 14 2024 5:02 AM | Last Updated on Wed, May 15 2024 12:39 PM

YSRCP 58 complaints to Election Commission: Andhra Pradesh

రాష్ట్రంలో పలుచోట్ల పేట్రేగిపోయిన టీడీపీ

ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్‌సీపీ 58 ఫిర్యాదులు

జిల్లా పోలీస్‌ అధికారులకు ఏబీవీ, ఆర్పీ ఠాకూర్‌ల బెదిరింపులు  

పలుచోట్ల టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన కలెక్టర్, ఎస్పీలు 

వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నిరాశ, నిస్పృ­హలతో తెలుగుదేశం పార్టీ పలు­చోట్ల అల్లర్లు, దౌర్జన్యాలు, హింసకు పాల్పడిందని వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు మలసాని మనో­హర్‌రెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లా­డారు. ఉదయం నుంచి రాత్రి వరకు టీడీపీ హింసాత్మక సంఘటనలకు పాల్పడుతూనే ఉందని చెప్పారు. ఈ ఘటనలపై ఎన్నికల అధికారులకు సోమవారం ఒక్క రోజే 58 ఫిర్యా­దులు చేశామని, వాటిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. 

రెండుసార్లు సస్పెండ్‌ అయిన అడిషనల్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, రిటైర్డ్‌ డీజీ ఆర్పీ ఠాకూర్‌ మరి కొందరు పోలీస్‌ అధికారులు మంగళగిరి టీడీపీ ఆఫీసులో కూర్చొని జిల్లాల పోలీసు అధికారులకు ఫోన్‌లు చేసి టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాలని బెదిరింపులకు దిగారని చెప్పారు. వీరి ప్రభావంతో పలు చోట్ల పోలీసు అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారన్నారు. బాపట్లలో నందిగం సురేష్‌ ఎన్నికల ఏజెంట్లు ప్రయాణిస్తున్న కారుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని, కారును ధ్వంసం చేసి వారిని భయభ్రాంతులకు గురిచేశారని ఆందోళన వ్యక్తం చేశా­రు.

ఏబీ వెంకటేశ్వరరావు, ఆర్పీ ఠాకూర్‌లు మరి కొందరు రిటైర్డ్‌ పోలీసు అధికారులతో కలసి మంగళగిరి టీడీపీ కార్యాలయంలో కూర్చుని జిల్లాల్లోని పోలీసు అధికారులకు ఫోన్‌లు చేసి రానుంది టీడీపీ ప్రభుత్వమని.. ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలంటూ బెదిరింపులకు దిగి­నట్టు తమ దృష్టికి వచ్చిందని ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు.

మంగళగిరిలో జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ ఓటు వేసేటప్పుడు ఆయన భార్య కూడా పోలింగ్‌ బూత్‌లోకి రావడం నిబంధనలకు విరుద్ధమని, సిబ్బంది ఆమెను ఎలా అనుమతించారని మనోహర్‌రెడ్డి ప్రశ్నించారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో 255, 217, 218 పోలింగ్‌ బూత్‌లలో వృద్ధులను పోలింగ్‌ అధికారి తీసుకువెళ్లి తప్పుగా ఓటు వేయించారన్నారు. ఇదే నియోజకవర్గంలో 194, 195, 233 పోలింగ్‌ బూత్‌లలోకి వృద్ధులతో పాటు వచ్చే అటెండెంట్స్‌ను పోలీసులు అనుమతించక పోవడం నియమావళికి విరుద్ధమని చెప్పారు. 

పల్నాడు జిల్లా రెంటచింతల మండలం జెట్టి పాలెంలో 215 పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంను టీడీపీ కార్యకర్తలు పగులగొట్టారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ విజ్ఞప్తిని పరిగణనలోనికి తీసుకో­కుండా, ఏజెంట్లు లేకుండానే అధికారులు మరో ఈవీఎంతో పోలింగ్‌ నిర్వహించడం దారుణం అన్నారు. కలెక్టర్, ఎస్పీలు సైతం టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా అనేక ఘటనలు
దర్శి నియోజకవర్గంలో పోలింగ్‌ బూత్‌ నెంబర్‌ 145లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతి పరుడ్ని తలపగులగొట్టారు.
రాయచోటి నియోజకవర్గంలో పోలింగ్‌ బూత్‌ 32లో వైఎస్సార్సీపీ ఏజెంట్లపై టీడీపీ నేతలు రాళ్ల దాడికి పాల్పడ్డారు.
పెదకూరపాడులో పోలింగ్‌ బూత్‌ నెంబర్‌ 93, 94లలో కంచేటి సాయి అనే టీడీపీ నేత వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్లపై దాడి చేశారు. 

తాడిపత్రి నియోజకవర్గంలో పోలింగ్‌ బూత్‌ నెంబర్‌ 237 వద్ద పార్టీ ఎంఎల్‌ఏ కేతిరెడ్డి పెద్దారెడ్డి వాహనంపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. 
తెనాలిలో టీడీపీ నేత గొట్టిముక్కల సుధాకర్‌ ఎంఎల్‌ఏ అన్నాబత్తుని శివకుమార్‌ను, ఆయన భార్యను దూషించి ఘర్షణకు కారణమయ్యారు. 
 గంగాధర నెల్లూరులో, విశాఖ వెస్ట్‌ నియోజక­వర్గాలలో బౌన్సర్లతో టీడీపీ నేతలు హల్‌ చల్‌ చేశారు.

తాడిపత్రి, చిత్తూరు, కుప్పం నియోజకవర్గాలలో సైతం టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారు.
కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్‌లో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ అభిమానులపై దాడులకు పాల్పడ్డారు.
  రాష్ట్రంలో పలు పోలింగ్‌ బూత్‌లలో ప్రిసైడింగ్‌ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారు. వృద్ధులతో పాటు అటెండెంట్లను అనుమతించ లేదు. ఓటర్లను టీడీపీకి అనుకూలంగా ప్రభావితం చేశారు. వాటికి సంబంధించి ఆయా పోలింగ్‌ బూత్‌ నంబర్లతో సహా ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది.

జమ్మలమడుగులో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై దాడి చేసి కొట్టారు. తలకు గాయం అయింది.  
టీడీపీ, జనసేన పార్టీల అభ్యర్థులు ఏకంగా పోలింగ్‌ బూత్‌లలో ప్రభావితం చేస్తూ చొచ్చుకు వచ్చారు. ఆయా పార్టీల రంగులున్న టీ షర్టులు, కండువా లతో లోపలికి వచ్చినా, పోలింగ్‌ అధికారులు నిరోధించలేదు.
చాలాచోట్ల ఈవీఎంల దగ్గరకు వెళ్లి రిగ్గింగ్‌ చేయడం, వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను భయపెట్టడం, పోలింగ్‌ కేంద్రాల సమీపంలోనే డబ్బులు పంచడం వంటి చర్యలకు పాల్పడ్డారు.
టీడీపీ దాడులు, రిగ్గింగు వంటి సంఘటనల నేపథ్యంలో పలుచోట్ల రీ పోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల అధికారులను కోరాం. ఈ సంఘటనలన్నింటిపై ఈసీకి ఫిర్యాదు చేశాం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement