ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసుల్లో వివాదాస్పదంగా ఈసీ తీరు
దర్శిలో ఈవీఎం పగలగొట్టిన టీడీపీ నేతపై చర్యలు నామమాత్రం
దర్శి: రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసుల్లో ఈసీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందన్న ఆరోపణలకు దర్శి ఘటన బలం చేకూరుస్తోంది. పల్నాడు జిల్లా మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశారంటూ వచ్చిన ఫిర్యాదుపై 10 రకాల సెక్షన్లు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఓ వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది.
ఈ విషయంపై పచ్చ మీడియా చిలువలుపలువలుగా కథనాలు ప్రచురిస్తోంది. ఇదే తరహాలో ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ నేతలు ఈవీఎంను ధ్వంసం చేశారు. దానిని పగులగొట్టిన టీడీపీ నేత వీసీ రెడ్డిపై తీసుకున్న చర్యలు మాత్రం నామమాత్రం. 13వ తేదీ పోలింగ్ జరుగుతున్న సందర్భంగా దర్శి ఎంఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన బూత్‌లో ఎంపీ అభ్యర్థికి చెందిన ఈవీఎంను టీడీపీ నేత వేమిరెడ్డి చెన్నారెడ్డి(వీసీ రెడ్డి) పగులగొట్టాడు. ఇదే బూత్ సమీపంలో టీడీపీ నేతలు వీరంగం చేయడంతో కొంతసేపు అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది.
నిందితుడికి 41ఏ నోటీసులతో సరి
ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో వీసీ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, 41ఏ నోటీసులు ఇచ్చారు. పోలీస్ స్టేషన్‌లో కళ్లు తిరుగుతున్నాయని చెప్పగా వీసీ రెడ్డిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి నుంచి వీసీ రెడ్డి పరారయ్యాడు. 41ఏ నోటీసులు తీసుకున్న వ్యక్తి పోలీసుల అనుమతి లేకుండా గ్రామం విడిచి వెళ్లకూడదు. పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన నిందితుడు ఒంగోలు రామ్‌నగర్‌లో నివాసముంటున్న టీడీపీ కీలక నేత కుమారుడి వద్ద ఆశ్రయం పొందినట్లు గత పది రోజులుగా ప్రచారం జరిగింది.
సదరు నాయకుడి ఒత్తిడి మేరకే వీసీ రెడ్డిపై పోలీస్ అధికారులు ఉదాశీన వైఖరిని అవలంబిస్తున్నారని, చట్ట ప్రకారం కేసులు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా.. బుధవారం వీసీ రెడ్డి దర్శిలోని ఓ రెస్టారెంట్‌లో ఉన్న సమయంలో అదుపులోకి తీసుకున్నట్టు పోలీసు వర్గాలు చెబుతుండటం గమనార్హం.
ఈవీఎం ధ్వంసం చేసిన విషయం, నరసరావుపేట నుంచి వచ్చిన 150 మంది టీడీపీ గూండాలు దర్శి నియోజకవర్గంలో చేసిన రచ్చను ఉద్దేశపూర్వకంగా దాచేసిన ఎల్లో మీడియా.. వైఎస్సార్‌సీపీ నాయకులపై మాత్రం విషం చిమ్మడాన్ని ఆపడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment