
ప్రజల్లోకి కెప్టెన్
డీఎండీకే అధినేత, ప్రధాన ప్రతి పక్ష నేత విజయకాంత్ ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఈనెల 20 నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో
డీఎండీకే అధినేత, ప్రధాన ప్రతి పక్ష నేత విజయకాంత్ ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఈనెల 20 నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. కాగా, ఈ పర్యటనల్లో తానే బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రచారం చేసుకోబోతున్నట్టు సమాచారం.
సాక్షి, చెన్నై :రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించిన విజయకాంత్ ప్రజల పక్షాన నిలబడతానంటూ అధికార అన్నాడీఎంకేతో వైర్యాన్ని పెంచుకుని కష్టాలను కొనితెచ్చుకున్న విషయం తెలిసిందే. అధికార పక్షం కేసుల మోత ఓ వైపు, అనారోగ్య సమస్యలు మరో వైపు వెరసి కొన్నాళ్లు ప్రజల్లోకి వెళ్లడం మానుకోవాల్సిన పరిస్థితి. తాజాగా, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయా పార్టీలు కసరత్తులు వేగవంతం చేయడాన్ని విజయకాంత్ పరిగణించారు. తాను బీజేపీ కూటమి నుంచి బయటకు వెళ్తున్నట్టు ఇంతవరకు ఆయన స్పష్టం చేయలేదు. ఆయన తమ కూటమి అంటూ బీజేపీనేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో అపాయింట్‌మెంట్ లభించడం, బీజేపీ పెద్దలతో మంతనాలు ముగించుకున్న విజయకాంత్ ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు కార్యచరణ సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఆగస్టులో తన జన్మదినం రానున్నడాన్ని ఆసరాగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అయ్యారు.
20 నుంచి పర్యటన : తన జన్మదినాన్ని పురస్కరించుకుని పేదరిక నిర్మూల పథకానికి శ్రీకారం చుట్టడంతో పాటుగా పనిలో పనిగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధం అయ్యారు. అధికార పక్షం వైఫల్యాల్ని ఎత్తి చూపుతూ, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని మెప్పించే విధంగా పర్యటన సాగించేందుకు ఆయన నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ, ప్రత్యేకంగా తమ నేత విజయకాంత్‌ను పలకరించడం, ఆయన ఇచ్చిన వినతి పత్రాన్ని స్వీకరించడంతో ఇక, తమ నేతకు బీజేపీ పెద్దల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నట్టేనన్న ఆశాభావంలో పడ్డారు. విజయకాంత్ సాగించనున్న రాష్ట్ర పర్యటనలో బీజేపీ కూటమి సీఎం అభ్యర్థి తమ నేతే అన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డీఎండీకే వర్గాలు సిద్ధమవుతోండడం గమనార్హం. ఇక, విజయకాంత్ పర్యటన ఆగస్టు 20వ తేదీని గుమ్మిడిపూండి నుంచి ఆరంభం కానున్నది. మరుసటి రోజు కాంచీపురంలో సాగనున్నది. అన్ని జిల్లాల్లో బహిరంగ సభల రూపంలో భారీ జన సమీకరణ, తమ బలం, సత్తా చాటే విధంగా విజయకాంత్ పర్యటనకు డీఎండీకే వర్గాలు ఉరకలు పరుగులు తీస్తున్నాయి.