
విమ్స్ ఖజానా ఖాళీ..!
మూడు నెలలుగా విమ్స్ సిబ్బందికి జీతాల్లేవ్
బడ్జెట్ రాలేదంటున్న విమ్స్ అధికారులు
కాంట్రాక్ట్ సిబ్బందిపై పాలక మండలి శీతకన్ను
బళ్లారి (తోరణగల్లు): నెలంతా పనిచేస్తే వచ్చే జీతంతోనే ఇంటి అద్దె, ఇంటికి కిరాణా సరుకులు, పిల్లల స్కూల్ ఫీజులు, కరెంటు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. అలాంటిది అసలు జీతమే రాకపోతే పరిస్థితి ఏంటని విమ్స్ ఉద్యోగులు వాపోతున్నారు. మార్చి నెల జీతాలు ఇంకా చెల్లించలేదు. వైద్యులు, అధికారుల పరిస్థితి ఎలా ఉన్నా ఆసుపత్రి, వైద్య కళాశాలల్లో సుమారు 10 ఏళ్లకు పైగా కాంట్రాక్ట్ పద్దతిపై పని చేసే స్టాఫ్ నర్సులు, ల్యాబ్, ఎక్స్‌రే, ఎంఆర్‌డీ, ఆప్తాల్మాలజీ, టెక్నీషియన్లతో పాటు గుమస్తాల పరిస్థితి దయనీయంగా మారింది. శాశ్వత ఉద్యోగులకు మాత్రం నెలనెలా 5వ తేదీ లోపు జీతాలు చెల్లిస్తున్నారు.
కాని కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రం గత నెల జీతం ఈ నెలాఖరున చెల్లిస్తు పాలక మండలి పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తున్నారు. పైగా శాశ్వత ఉద్యోగులు విధులకు హాజరుకాక పోయినా సంతకాలు చేసి వెళ్లిపోయినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. వారి పనులను కాంట్రాక్ట్ ఉద్యోగులపై మోపుతున్నారు. ఇంత చేసినా జీతాలు మాత్రం సకాలంలో చెల్లించకుండాజాప్యం చేస్తున్నారు. గత మూడు నెలలుగా జీతాలు చెల్లించక పోవడంతో పిల్లలను పాఠశాలల్లో చేర్చలేక నానా తంటాలు పడుతున్నామని కాంట్రాక్ట్ ఉద్యోగులు వాపోతున్నారు. ఈ విషయంపై విమ్స్ కార్యాలయ అధికారులను వివరణ కోరగా విమ్స్‌లో ఖజానా ఖాళీ అయింది. విమ్స్ అకౌంట్‌లో కేవలం 200 రూపాయలు మాత్రం ఉంది. ఈ పరిస్థితిలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు, ఏబీసీడీ గ్రూపు ఉద్యోగులకు బడ్జెట్ వస్తేగాని జీతాలు చెల్లించలేమని చేతులెత్తేశారు.