సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేగలిగే నాయకునే ఎన్నుకోవాలని మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాం పిలుపునిచ్చారు. అలాంటి నాయకుని హృదయం మంచితనంతో నిండి ఉండాలని కూడా అన్నారు. ఓటర్ల చైతన్యంపై దక్షిణ కన్నడ జిల్లా యంత్రాంగం మంగళూరులోని టీఎంఏ పాయ్ కన్వెన్షన్ హాలులో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ‘యువతతో ముఖాముఖి’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
చెన్నైలో తాను చదువుతున్నప్పుడు 60 ఏళ్ల కిందట 1954లో తొలిసారిగా తాను మంగళూరుకు వచ్చానని, అప్పట్లో తాను కలసిన మహాబలేశ్వర భట్ మంచి మిత్రుడయ్యారని గుర్తు చేసుకున్నారు. దేశంలోనే మంగళూరు శుభ్రమైన, అందమైన నగరం అని కొనియాడారు. విజయానికి నాలుగు దశలుంటాయని, విజేత వాటికి సంబంధించిన లక్షణాలను కలిగి ఉండాలని ఉద్బోధించారు. ‘20 ఏళ్ల వయసు రావడానికి ముందే ప్రతి ఒక్కరూ ఉన్నతమైన ఆశయం కలిగి ఉండాలి.
ఆశయం ఒక్కటే సరిపోదు. రెండోది.. పుస్తక పఠ నం ద్వారా జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి. మూడోది...బాగా కష్టపడాలి. నాలుగోది..లక్ష్య సాధనకు స్థిరంగా పని చేస్తూ పోవాలి’ అని వివరించారు. ఏ సమస్య గురించైనా భయపడకూడదని, సమస్యే మనల్ని చూసి భయపడాలని అన్నారు. ఏ సమస్యకూ భయపడని లక్షణం నాయకునికి ఉండాలని సూచిం చారు.
ప్రతి సమస్యనూ అతను ఓడిస్తూ పోవాలన్నారు. ఆలాంటి నాయకులే మనకు కావాలి. అలాంటి వారినే ఎన్నుకోవాలి అని పిలుపునిచ్చారు. ‘మీరో నిర్ణయం తీసుకోవాలి. దేశం కోసం మం చి నాయకుని ఎన్నుకుని ఓటు వేయాలి. విద్య అనేది ఎగరడానికి రెక్కలనిస్తుందనేదే మీకు నా సందేశం. జ్ఞానం కూడా మిమ్మల్ని మంచి డాక్టరు లేదా ఆర్కిటెక్ట్ లేదా టీచరును చేస్తుంది.
మంచి రాజకీయ నాయకుడిని కూడా చేయగలదు’ అని వివరించారు. పెద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ఆయ న విద్యార్థులను అభినందించారు. ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని కొత్త ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ గంట పాటు సాగిన తన ప్రసంగాన్ని ఆయన ముగించారు.
సమస్యలు పరిష్కరించే వారికే ఓటు
Published Wed, Apr 2 2014 3:43 AM | Last Updated on Mon, Aug 20 2018 3:02 PM
Advertisement
Advertisement