
దోచేస్తున్నారు..
♦ వినియోగదారులను అడ్డంగా దోచేస్తున్న నీటి మాఫియా
♦ ఇష్టారాజ్యంగా ట్యాంకర్ల ధరలు
♦ నీటి మాఫియాతో కుమ్మక్కైన బీఎంసీ ప్లంబర్లు
♦ చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం
ముంబై : జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటి పోతుండటంతో ఓ వైపు బీఎంసీ నీటి కోతలు విధిస్తుంటే, మరోవైపు నీటి మాఫియా దొరికిన కాడికి దోచుకుంటోంది. ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుతూ వినియోగదారులను నిలువునా దోపిడీ చేస్తోంది. గృహాలకు 20 శాతం నీటి కోత విధిస్తూ బీఎంసీ ఆదేశాలు జారీ చేసిన వెంటనే నీటి విక్రయ వ్యాపారులు ధరలు అమాంతం పెంచేశారు. దీంతో మురికివాడలు, నగర శివారుప్రాంతాల ప్రజలు పెరిగిన ధరలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
గతంలో 20 నుంచి 50 లీటర్ల క్యాన్లను రూ. 40 నుంచి రూ. 200 కి అమ్మేవారని, ప్రస్తుతం నీటి కొరత ఉండటం, బీఎంసీ నీటి కోత విధించడంతో వాటి ధరలను దాదాపుగా రెట్టింపు చేశారని ఓ స్థానికుడు వాపోయాడు. ట్యాంకర్లకు రూ. 1800-2000 వరకు చెల్లించాల్సి వస్తోందని, అప్పడప్పుడు రూ.5 వేల వరకు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆ భారమూ మాపైనే..
‘అంబుజ్‌వాడి, అజ్మీ నగర్, రాథోడ్ గ్రామం, మాల్వణీ చర్చ్, చికువాడి గ్రామాల్లో వర్షాలు కురిసినా, కురవకపోయినా నీటి కోత మాత్రం తప్పడం లేదు. నీటి మాఫియాకు ప్లంబర్లు అక్రమ కనెక్షన్లు ఇవ్వడంతో నీటి కొరత మరింతగా పెరిగిపోతోంది. మోటార్ పంపులతో నీటిని తోడేస్తున్నారు. దీంతో భారమంతా మాపై పడుతోంది.’ అని మాల్వణీలోని మలాడ్‌కు చెందిన సామాజిక కార్యకర్త నోయెల్ల వారెల చెప్పారు.
అవసరం అలాంటిది..
సమాజ్‌వాది పార్టీ నేత రైస్ షాయిక్ మాట్లాడుతూ.. ‘గోవండీ, మాన్‌కుర్ద్ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ దందాలు ఎక్కువగా జరుగుతుంటాయి. 2005 తర్వాత మురికివాడలకు నీటి కనెక్షన్లు ఇవ్వలేదు. దీంతో ధరలను నీటి మాఫియా ఎంత పెంచినా అవసరం దృష్ట్యా కొనక తప్పడం లేదు’ అని చెప్పారు. సాధారణంగా నీటి కనెక్షన్లకు రూ.8000-9000 వరకు తీసుకుంటారని, ప్లంబర్లు నీటి సరఫరా శాఖకు సంబంధించిన అధికారులతో కుమ్మక్కై రూ. 25000 వేల వరకు ప్రజలనుంచి వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుడు, కొలబా మాజీ కార్పొరేటర్ వినోద్ శేఖర్ మాట్లాడుతూ.. నీటి సమస్యలను బీఎంసీ పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.
నగరంలో నీటి సంరక్షణపై బీఎంసీకి తాను పలుమార్లు సూచించానని, కానీ ఇతర మార్గాలను బీఎంసీ అన్వేషించలేదని విమర్శించారు. గీతా నగర్, అంబేడ్కర్ నగర్ ప్రజలు నీటి కొరత వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. బకెట్ నీటి కోసం అవస్థలు పడాల్సి వస్తోందని వాపోయారు. బీఎంసీ ఆధ్వర్యంలో 500 ట్యాంకర్లు మాత్రమే ఉన్నాయని, నగరంలోని అన్ని ప్రాంతాలకు వీటిని పంపించలేమని, ఈ సమస్యకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నామని నగర పాలక సంస్థ అధికారులు చెప్పారు. నీటి కొరత ఎక్కువగా ఉన్నందున నగరంలో నిర్మాణ పనులు చేపడుతున్న ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపేయాలని స్టాండింగ్ కమిటీ చైర్మన్ యషోదర్ పన్సే డిమాండ్ చేశారు. ఈ విషయమై అడిషనల్ మున్సిపల్ కమిషనర్ సంజయ్ ముఖర్జీకి ఆయన లేఖ రాశారు.
నిర్మాణ రంగాలకు నీటి సరఫరా నిలిపివేత
వర్షాల ప్రభావం ముంబైలోని నిర్మాణ రంగంపైనా పడింది. కొత్తగా నిర్మిస్తున్న భవనాలకు నీటి సరఫరా పూర్తిగా నిలిపివేయాలని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) స్థాయి సమితి అధ్యక్షుడు యశోదర్ ఫన్సే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని బీఎంసీ అదనపు కమిషనర్ సంజయ్ ముఖర్జీని ఆదేశించారు. నగరానికి నీరు సరఫరా చేసే జలాశయాల్లో నిల్వలు కనిష్ట స్థాయికన్నా కిందికి దిగజారి పోవడంతో ముందు జాగ్రత్త చర్యగా నివాస గృహాలకు 20 శాతం, వాణిజ్య, వ్యాపార, హోటల్, మాల్స్‌కు 50 శాతం నీటి కోత విధించిన సంగతి విదితమే.
ముంబైకర్లు నీటి కోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే బిల్డర్లు మాత్రం తాగు నీటిని వినియోగిస్తున్నారు. దీనిపై మండిపడ్డ పన్సే.. భవన నిర్మాణ రంగాలకు సరఫరా నిలిపివేయాలని నిర్ణయించారు. బీఎంసీ పరిధిలో 2,741 చోట్ల భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనులకు నీటి సరఫరా నిలిపివేయాలని, కేవలం అక్కడ పనిచేసే కూలీలు తాగేందుకు మాత్రమే సరఫరా చేయాలని ఫన్సే పేర్కొన్నారు. నిర్మాణ పనులకు ట్యాంకర్లు, ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని బిల్డర్లకు ఆయన సూచించారు.