విమానాల్లో వైఫై వాడొచ్చు
- కాల్స్‌కూ అవకాశం
- వచ్చే నెల నుంచి ప్రారంభం
- తుది ఆమోదమే తరువాయి
న్యూ ఢిల్లీ : విమానాల్లో సెల్‌ఫోన్ సేవలకు లైన్ క్లియర్ అవనుంది. రానున్న పది రోజుల్లో ఈ దిశగా సానుకూల నిర్ణయం వెలువడనుందని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్ చౌబే తెలిపారు. విమానాల్లో వైఫై అనుమతించే అంశంపై పౌర విమానయాన, టెలికం, హోం శాఖలు దృష్టి సారించాయని ఆయన చెప్పారు. ఇందుకు కేబినెట్ అనుమతి అవసరం పడకపోవచ్చన్నారు. డేటా వినియోగానికి అనుమతించినప్పుడు కాల్స్ చేసుకునేందుకు కూడా అనుమతి లభించవచ్చన్నారు.
విమానాల్లో వైఫై సేవలు అనుమతించే ప్రతిపాదన కేంద్ర ముందు ఎప్పటి నుంచో ఉంది. భద్రతాపరమైన అంశాల దృష్ట్యా దీనిపై ఇంతవరకు ఓ నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో డేటా, కాల్స్‌ను భద్రతా సంస్థలు పర్యవేక్షించడం వంటి అంశాలపై చర్చ జరిగిందని చౌబే వెల్లడించారు. అవసరమైతే భద్రతా సంస్థలు వివరాలు పొందవచ్చని, ట్రాక్ కూడా చేయవచ్చని చెప్పారు.
ప్రస్తుతం దేశీయంగా అన్ని విమానాల్లోనూ వైఫై సర్వీసులను అనుమతించడం లేదు. కానీ, ప్రపంచ వ్యాప్తంగా చాలా ఎయిర్‌లైన్స్ సంస్థలు తమ ప్రయాణికులకు వైఫై సేవలు అందిస్తున్నాయి.అయితే, భారత గగనతలంలోకి ప్రవేశించగానే ఆ సేవలను నిలిపివేస్తున్నాయి. ఇవి తొలుత కొంత సమయం పాటు ఉచితంగా వైఫై అందిస్తూ... ఆ పై వినియోగానికి చార్జీలు వసూలు చేస్తున్నాయి. అయితే, దేశీయంగానూ వైఫై సేవలకు అనుమతి లభిస్తే... ఎయిర్‌లైన్ సంస్థలకు అదనపు ఆదాయం సమకూరనుంది. అయితే, ఈ సేవలు అందించడం తప్పనిసరి కాబోదు. ఆయా సంస్థల ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది.