ఈ కెప్టెన్ వద్దు బాబోయ్!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘విజయకాంత్ ప్రచారానికి వస్తున్నారా... వద్దు బాబోయ్’ అని వేడుకునేలా డీఎండీకేలో చిత్రమైన పరిస్థితి నెల కొంది. పార్టీ అధినేత విజయకాంత్ ప్రచారానికి రాకుండా చూడాలని పార్టీ నేతలు, కార్యకర్తలే ప్రాధేయపడుతున్నారు. ప్రేమలతతో సరిపెట్టుకుంటామని సర్దుబాటు మంత్రం జపిస్తున్నారు. సహజంగా రాజకీయాల్లో పార్టీ అగ్రనేత వచ్చి ప్రచారం చేయాలని కార్యకర్తలు ఆశిస్తారు. అగ్ర జులు వచ్చి ప్రసంగిస్తే అధికసంఖ్యలో ప్రజలను ఆకట్టుకోవచ్చని ఆశపడతారు. పార్టీ అధ్యక్షుల రాకకోసం పరితపిస్తారు. అయితే దేశంలో మరే పార్టీలో లేని విధంగా డీఎండీకే నేతలు సాక్షాత్తు అధ్యక్షుల రాకనే తిరస్కరిస్తున్నారు.
ఇంకా చెప్పాలంటే విజయకాంత్ వస్తున్నాడంటే భయపడిచస్తున్నారు. అవును, ఇందులో ఆశ్చర్యమేముందని తమిళనాడు రాజకీయాలను గమనిస్తున్న ఎవ్వరిని అడిగినా ఇట్టే చెబుతారు. విగ్రహమేకానీ నిగ్రహం లేని కెప్టెన్: ఒక ప్రధాన రాజకీయ పార్టీ నేతగా చలామణి అయ్యేందుకు అవసరమై నిండైన విగ్రహం కలిగి ఉన్న విజయకాంత్‌కు అందుకు తగిన నిగ్రహం లేదని చెప్పక తప్పదు. ప్రజా బాహుళ్యంలోకి అడుగుపెట్టినపుడు తరచూ ఆవేశానికి లోను కావడం పరిపాటిగా మారింది. గత ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులనే తన్నిన దాఖలు ఉన్నాయి. సుమారు నాలు గు నెలల క్రితం విమానాశ్రయంలో మీడియా ప్రతినిధు లు వేసిన ప్రశ్నకు బదులివ్వకపోగా ఆగ్ర హంతో విలేఖరిపైనే చేయిచేసుకున్నారు.
దీంతో జర్నలిస్టు సంఘాలు ఆందోళనకు దిగాయి. అంతకు ముందు పార్టీ నేతలను, తన సెక్యూరిటీ గార్డును, మరోసారి కార్యకర్తలను కొట్టి ఉన్నారు. అలాగే తన కారు డ్రైవర్‌ను ఏకంగా కాలితో కొట్టి కలకలం రేపారు. ఇదిలా ఉండగా మూడు రోజుల క్రితం ఎన్నికల ప్రచార నిమిత్తం అభ్యర్థులతో సమావేశం నిమిత్తం సేలం చేరుకున్న విజయకాంత్‌కు స్వాగతం చెప్పేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. ఈ సమయంలో మరోసారి సహనాన్ని కోల్పోయిన విజయకాంత్ సెక్యూరిటీపైనా, పక్కనే ఉన్న మీడియా ప్రతినిధులపైనా చేయిచేసుకున్నారు.
విజయకాంత్ వద్దని వేడుకోలు: రానురాను కెప్టెన్ వైఖరి శ్రుతిమించడంతో ‘అయ్యా తమరు రావద్దు’ అని చెప్పేందుకు సైతం వెనుకాడని పరిస్థితి పార్టీలో ఉత్పన్నమైంది. రాష్ట్రంలో రసవత్తరంగా ఎన్నికల పోరుసాగుతున్న దశలో సర్వశక్తులు ఒడ్డి ఓటర్లను ఆకట్టుకోవాల్సి పోయి విమర్శలకు తావిచ్చేలా విజయకాంత్ వ్యవహరించడం పార్టీ నేతలు సహించలేక పోతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో విజయకాంత్ అనాగరికంగా నడుచుకోవడం పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తుందని ఆందోళన చెందుతున్నారు. పార్టీ అభ్యర్థులు సమావేశమై ప్రత్యామ్నాయం ఏమిటని చర్చించుకున్నారు. విజయకాంత్‌కు బదులుగా ఆయన సతీమణి ప్రేమలత ప్రసంగించేలా ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశాన్ని డీఎండీకే కార్యాలయానికి తెలుపగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.