అధికారంలోకొస్తే బాగోతం బయటపెడతాం : విజయ్ గోయల్
Published Mon, Oct 7 2013 12:06 AM | Last Updated on Fri, Sep 1 2017 11:24 PM
సాక్షి, న్యూఢిల్లీ: జవాబుదారీ కమిటీ (అకౌంటబిలిటీ కమిషన్) వేసి 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతిని వెలికితీస్తామని బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ పేర్కొన్నారు. విధానసభ ఎన్నికల్లో తమ పార్టీ లేవనెత్తే ప్రధాన అంశం కాంగ్రెస్ నాయకుల అవినీతేనని ఆయన వెల్లడించారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ‘అకౌంటబిలిటీ కమిషన్ అనేది ప్రజాధనాన్ని దోచుకున్న కాంగ్రెస్ నాయకుల బండారం బయట పెడుతుంది. ఆ సొమ్ము స్వాధీనం చేసుకునే వరకు పనిచేస్తుంది. అవినీతి కుంభకోణంలో ఉన్నట్టు తేలితే ఎవరినీ ఉపేక్షించేది లేదు’అని గోయల్ హెచ్చరించారు. ఎన్నో పథకాలు పెట్టి కాంగ్రెస్‌పార్టీ నాయకులు జేబు నింపుకోవడం మినహా ఎక్కడా ప్రజలకు మేలు చేయలేదన్నారు. రాజీవ్త్న్ర ఆవాస్ యోజన వంటి పథకాలు ఇదే తరహాకి చెందినవన్నారు. పేదలను మోసగించేందుకు పలు తప్పుడు పథకాలు పెట్టారని గోయల్ ఆరోపించారు. రవాణా ,యమునా నది శుభ్రపరచడం, జేజేకాలనీలు, పునరావాస కాలనీల నిర్మాణం, రేషన్ కార్డుల పంపిణీ తదితరాలకు సంబంధించిన కుంభ కోణాలన్నింటినీ బయటపెడతామన్నారు.
వాస్తవాలను ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ మొదటి నుంచి వక్రీకరిస్తున్నందునే జవాబుదారీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామన్నారు. ముఖ్యమంత్రితో సహా ఆమె కేబినెట్‌లోని ప్రతి మంత్రి కాగ్, పీఏసీ, లోకాయుక్త తదితర సంస్థల నుంచి దర్యాప్తులు ఎదుర్కొంటున్నవారేనన్నారు. ఇప్పటికీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తన ప్రభుత్వ అవినీతికి ఆధారాలు చూపాలని ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. లోకాయుక్త, పీఏసీ, కాగ్ చేసిన అన్ని సూచనలు తమ కమిటీ పరిగణనలోకి తీసుకుం టుందన్నారు. వీటన్నింటితోపాటు ఢిల్లీ ప్రభుత్వ అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ విభాగంలో రికార్డులను కూడా తీసుకుంటామన్నారు. కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందన్నారు.‘కాంగ్రెస్ నాయకుల అవినీతి బయటపెట్టిన తర్వాత పూర్తి మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటాం. ఆ సొమ్మును ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తాం’అని గోయల్ ప్రకటించారు.
బీజేపీ ‘సంవాద్’ వెబ్‌సైట్ ప్రారంభం
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు మరింత దగ్గరయ్యేందుకు తమ పార్టీ నాయకులు, అభ్యర్థుల సమాచారాన్ని భారతీయ జనతా పార్టీకి చెందిన ‘సంవాద్ సెల్’ ఆదివారం వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. నగర బీజేపీ కార్యాలయంలో సంవాద్ సెల్ సమావేశం నిర్వహించారు. పార్టీ జనరల్ సెక్రటరీ (నిర్వహణ) విజయ్ శర్మ ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శర్మ, ఢిల్లీ బీజేపీ జెనరల్ సెక్రటరీ శిఖారాయ్, సెక్రటరీ ఎస్‌కే శర్మ తదితరులు ఓటర్లతో వెబ్‌సైట్‌ద్వారా మమేకమయ్యారు. ఈ వెబ్‌సైట్ పార్టీకి, ఓటర్లకు మధ్య అనుసంధాన కర్తగా ఉపయోగపడుతుందని శర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సంవాద్ సెల్ కన్వీనర్ ఖేమ్‌చంద్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement