
అజ్ఞాత యువకుడు ఎవరు?
కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం, ఇస్రో కేంద్రంలో సంచరించిన యువకుడు ఎవరనే విషయం మిస్టరీగా మారింది.
టీనగర్: కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం, ఇస్రో కేంద్రంలో సంచరించిన యువకుడు ఎవరనే విషయం మిస్టరీగా మారింది. దీనిగురించి పోలీసులు పట్టించుకోనట్లు సమాచారం. తిరునల్వేలి జిల్లాలోగల పశ్చిమ కనుమల్లో మహేంద్రగిరి అంతరిక్ష పరిశోధనా కేంద్రం సమీపంలో కొన్ని రోజుల క్రితం గుర్తు తెలియని విమానం సంచరించినట్లు సమాచారం. దీనిగురించి పోలీసులు విచారణ జరపగా అది కేవలం వదంతి అని తేలింది.
దీంతో నెల్లై జిల్లాలోగల ఇస్రో కేంద్రం, ఉత్తర విజయనారాయణం నావికాదళం, కూడంగుళం అణు విద్యుత్ కేంద్రం ప్రాంతాలకు పోలీసు భద్రత కల్పించారు. ఇలావుండగా పణకుడి పశ్చిమ కనుమల్లోగల కన్నిమారన్ తోపు ప్రాంతంలో ఉత్తరాది యువకుడు ఒకరు అనుమానాస్పద స్థితిలో సంచరించాడు. అతని వద్ద క్యూ బ్రాంచి పోలీసులు విచారణ జరిపారు. పట్టుబడిన యువకుడు ఒడిశా రాష్ట్రం లారంబా ప్రాంతానికి చెందిన హరికృష్ణన్ బక్ (35)అని తెలిసింది.
ఇతని బంధువుల్లో కొందరు కూడంగుళం అణు విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్నట్లు తెలిసింది. కొన్ని రోజుల క్రితం కూడంకుళంలో ఒక యువకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతన్ని మతిస్థిమితం లేని వ్యక్తిగా పోలీసులు విడిచిపెట్టారు. కూడంకుళం కేంద్రం, ఇస్రో కేంద్రం ప్రాంతాల్లో యువకులు అనుమానాస్పదంగా సంచరించడం, వీరిని పోలీసులు మతిస్థిమితంలేని యువకులుగా విడిచిపెట్టడం అనుమానాలకు తావిస్తోంది.