సాక్షి, ముంబై: రాబోయే ఎన్నికల్లో ప్రత్యేక విదర్భ అంశం పెద్ద ఎత్తున తెరపైకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా విదర్భ ప్రజలు ప్రత్యేక విదర్భను కోరుకుంటున్నారని స్పష్టమవుతోంది. ప్రత్యేక విదర్భ ఏర్పాటుపై విదర్భలోని వివిధ ప్రాంతాల్లో ఓటింగ్ నిర్వహిస్తూ ప్రజల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు నాగపూర్, అమరావతితోపాటు పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఓటింగ్‌లో ప్రత్యేక విదర్బకే అనేకమంది ఓటు వేశారు. తాజాగా చంద్రాపూర్‌లో శుక్రవారం నిర్వహించిన ఓటింగ్‌లో 96..95 శాతం మంది ప్రత్యేక విదర్భ ఏర్పాటుచేయాలని ఓటు వేయడం విశేషం. దీన్నిబట్టి ప్రజల్లో ప్రత్యేక విదర్భ అంశం ఎంత బలంగో ఉందో అర్థమవుతోంది.
అనేక స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సంస్థల మద్దతుతో సీనియర్ సిటిజ్ యూనియన్ అధ్యక్షుడు రామ్‌దాస్‌రాయిపురే నేతృత్వంలో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 2013 అక్టోబరులో అమరావతిలో నిర్వహించిన ఓటింగ్‌లో 85 శాతం మంది,, డిసెంబరులో నాగపూర్‌లో జరిగిన ఓటింగ్‌లో 96.47 శాతం మంది ప్రజలు ప్రత్యేక విదర్భకు ఓట్ వేశారు. ఫిబ్రవరి 15న యావత్మాల్‌లో ఓటింగ్ నిర్వహించనున్నట్టు ఈ సందర్భంగా రామ్‌దాస్ ప్రకటించారు. ఇప్పటివరకు ఓటింగ్ జరిగిన ప్రాంతాల్లో ప్రత్యేక విదర్భనే కోరుకుంటున్నట్టు ప్రజలు ఓటువేస్తున్నారు. చాల తక్కువ మంది సంయుక్త రాష్ట్రాన్ని కోరుకునేవారున్నారని వెళ్లడైంది.
దీన్నిబట్టి రాబోయే ఎన్నికల్లో ‘ప్రత్యేక విదర్భ’ అంశం రాజకీయపార్టీలకు ఆయుధంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రత్యేక విదర్భ కోసం ఉద్యమాలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు యూపీఏ ప్రభుత్వం చూపుతున్న చొరవ చూసి, తమకూ ప్రత్యేక విదర్భ ఇవ్వాలని విదర్భవాదులు డిమాండ్ చేస్తున్నారు.
‘ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో చాలా సమస్యలున్నాయి.. కొత్త రాష్ట్రంలో కొత్తగా రాజధానిని నిర్మించుకోవాలి.. అంతేకాక ఒక రాష్ట్రానికి కావాల్సిన అంశాలన్నింటినీ కొత్తగా సమకూర్చుకోవాలి.. అయితే ప్రత్యేక విదర్భ ఏర్పాటు చేసినట్టయితే అలాంటి సమస్యలు రావడానికి ఆస్కారం లేదు. నాగపూర్‌లో మంత్రాలయంతోపాటు హైకోర్టు తదితర సదుపాయాలున్నాయి. దీంతో ప్రత్యేక విదర్భ ప్రకటించిన రోజునే ముఖ్యమంత్రితోపాటు మంత్రి మండలి ప్రమాణస్వీకారం చేసి పాలన ప్రారంభించేందుకు ఆస్కారం ఉంది..’ అని గతంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విలాస్‌ముత్తేంవార్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
విదర్భకే ‘ఓటు’
Published Sat, Jan 25 2014 11:18 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement