కరుణా.. స్టాలినా?
సాక్షి, చెన్నై : ప్రధాన ప్రతిపక్ష నేత కుర్చీలో కూర్చోనున్నది డీఎంకే అధినేత కరుణానిధా లేదా దళపతి ఎంకే స్టాలినా అన్న ప్రశ్న బయలు దేరింది. మెజారిటీ శాతం మంది స్టాలిన్ అంటున్నా, ఈ సారి కరుణానిధి అసెంబ్లీలో అడుగు పెట్టవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న వాళ్లూ ఉన్నారు. ఈ ప్రశ్నకు సమాధానం మంగళవారం తేలనుంది. ఆ రోజున డీఎంకే ఎమ్మెల్యేలు, పార్టీ వర్గాలతో సమాలోచనా సమావేశానికి కరుణానిధి పిలుపునిచ్చారు. రాష్ట్ర చరిత్రలో ప్రప్రథమంగా బలమైన ప్రతిపక్షం అధికార పక్షానికి ఎదురుగా కూర్చోబోతున్నది.
అధికార అన్నాడీఎంకే పక్షాన్ని ఢీకొట్టేందుకు తగ్గ బలంతో ప్రధాన ప్రతి పక్షంగా డీఎంకే అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నది. ఇది వరకు పరిమిత సంఖ్యలో సభ్యుల్ని కల్గిన డీఎంకే ఈ సారి తమ గళం గంభీరంగా ఉంటుందని, ప్రధాన ప్రతిపక్షం అంటే ఏమిటో చూపిస్తామన్న వ్యాఖ్యలు చేస్తుండడంతో ఇక, అసెంబ్లీలో ప్రతిరోజూ సమరమేనా అన్న ప్రశ్న బయలు దేరింది. ఈ సమరంలో అధికార పక్షానికి నేతృత్వం వహించేందుకు సీఎం జయలలిత సిద్ధమయ్యారు.
ఇక, ప్రధాన ప్రతిపక్షానికి నేతృత్వం వహించే నేత డీఎంకేలో ఎవరన్న ప్రశ్న బయలు దేరింది. 2011లో కరుణానిధి అసెంబ్లీకి ఎన్నికైనా సమావేశ మందిరంలో మాత్రం అడుగు పెట్టలేదు. తాను కూర్చునేందుకు తగ్గ వసతి కల్పిస్తే, సభకు వస్తానని ఆయన వ్యాఖ్యలు చేసినా లేఖలు పంపినా పాలకులు మాత్రం పట్టించుకోలేదు. ఇందుకు కారణం డీఎంకే సభ్యులు సభలో పరిమితంగా ఉండడమే. అయితే, ఈసారి ఎక్కువ సంఖ్యలో సభ్యులతో డీఎంకే ప్రధాన ప్రతి పక్షంగా ఉన్న దృష్ట్యా, కేబినెట్ హోదా కల్గిన ప్రధాన ప్రతిపక్ష నేతకు సౌకర్యాల్ని కల్పించాల్సిన అవసరం తప్పనిసరి.
ఈ దృష్ట్యా, కరుణానిధి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తారా.. అన్న ప్రశ్న బయలుదేరింది. కరుణానిధి ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అడుగు పెట్టిన పక్షంలో ఆయనకు కావాల్సిన వసతులు కల్పించాల్సిందే. ఇందులోనూ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అనుసరించిన పక్షంలో డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ ప్రధాన ప్రతిపక్ష నేతగా తన సేనలతో కలిసి అధికార పక్షాన్ని ఢీకొట్టడం ఖాయం.
ఒక వేళ ప్రధాన ప్రతిపక్ష నేతగా కరుణానిధి ఉంటే, డీఎంకే శాసన సభా పక్ష ఉప నేతగా స్టాలిన్ వ్యవహరించేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందుకు తగ్గ నిర్ణయాలు మంగళవారం అధికార పూర్వకంగా వెలువడనున్నది. పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లాల కార్యదర్శులు, సర్వ సభ్య సభ్యులతో మంగళవారం సమావేశానికి కరుణానిధి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రధాన ప్రతి పక్ష నేతను, శాసన సభా పక్ష ఉప నేత, పార్టీ విప్‌లను ఎంపిక చేయనున్నారు.
శుభాకాంక్షల..ఆశీస్సులు : ప్రధాన ప్రతి పక్ష నేత ఎంపిక కసరత్తులు ఓ వైపు సాగుతుంటే, మరో వైపు రాజ్యసభ అభ్యర్థులుగా పార్టీ తరఫున టీకేఎస్ ఇళంగోవన్, ఆర్‌ఎస్ భారతీల పేర్లను అధికార పూర్వకంగా కరుణానిధి ప్రకటించారు. తమకు అవకాశం కల్పించడంతో ఆ అభ్యర్థులు ఆదివారం గోపాలపురంలో కరుణానిధి ఆశీస్సులు అందుకున్నారు. ఈసందర్భంగా చిరునవ్వులు చిందిస్తూ కరుణానిధి ఫొటోకు ఫోజు ఇవ్వడం విశేషం. తదుపరి మూడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ కరుణానిధి వేర్వేరుగా లేఖలు రాశారు.
ఇందులో పశ్చిమ బెంగాళ్ సీఎం మమత బెనర్జీ, కేరళ సీఎం. పినరాయ్ విజయన్, అసోం సీఎం సర్బంధ సోనోవాల్ ఉన్నారు. వారికి తన శుభాకాం క్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తిరునల్వేలి జిల్లా కడయనల్లూరు నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సభ్యుడు అబూబక్కర్, ఆ పార్టీ నేత ఖాదర్ మొహిద్దీన్ కరుణానిధిని కలుసుకున్నారు.
అనంతరం కరుణానిధి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఎన్నికల యంత్రాంగం తీరుపై అనుమానాల్ని వ్యక్తం చేశారు. తమ బాధ్యత పెరిగిందని, బాధ్యత గల ప్రతిపక్షంగా అసెంబ్లీలో వ్యవహరిస్తామని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, తనకు ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకునేందుకు డీఎంకే దళపతి స్టాలిన్ నిర్ణయించారు.
సోమవారం నుంచి మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించి కృతజ్ఞతలు తెలుపుకోనున్నారు. ఓటమి చవిచూసిన డీఎంకే కార్యదర్శులు, జిల్లాలో ఓటమికి బాధ్యత వహిస్తూ మరికొందరు పార్టీ పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధపడ్డట్టుంది. ఇందుకు అద్దం పట్టే రీతిలో తిరుప్పూర్ ఉత్తరం జిల్లా కార్యదర్శి సెల్వరాజ్ పదవికి రాజీనామా చేశారు.