
జగన్ పర్యటిస్తే దడెందుకు?
- ప్రభుత్వానికి, టీడీపీ నేతలకు కొలుసు పార్థసారథి ప్రశ్న
- రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాడతాం
సాక్షి, హైదరాబాద్: బలవంతపు భూసేకరణను ప్రతిఘటిస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని అమరావతి ప్రాంతానికి పర్యటనకు వస్తూంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఉలికి పడుతోంది, వారిలో ఎందుకు దడ పుడుతోంది? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ప్రశ్నించారు. జగన్ వస్తున్నారని తెలిసి రాష్ట్ర మంత్రులు హడావుడిగా ఆ ప్రాంతానికి వెళ్లి రైతులను బెదిరిస్తున్నారని చెప్పారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రతిపక్ష నేత సభలకు ఎవరు వెళుతున్నారో తెలుసుకుని తర్వాత వారిని వేధించడానికి గ్రామాల్లో వందలాది సీసీ కెమెరాలు అమర్చారని సారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ పూలింగ్ సందర్భంగా రైతులకు ప్రభుత్వం అనేక హామీలిచ్చిందని అయితే ఒక్కదానిని కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చినా.. 3, 4 పంటలు పండే సారవంతమైన 33 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద రైతుల నుంచి తీసుకున్నారని, మరో 50 వేల ఎకరాల అటవీ భూమిని కూడా తీసుకోవాలని ప్రతిపాదించారన్నారు. ఇంకా 15 నుంచి 20 వేల ఎకరాల పొరంబోకు, ఇతర ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయన్నారు. ఇంత భారీగా భూములు అందుబాటులో ఉన్నా ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వలేదన్న కక్షతో ఇపుడు మిగిలిన రైతులపై భూసేకరణ అస్త్రాన్ని ప్రభుత్వం ప్రయోగిస్తోందని విమర్శించారు.
ప్రజా రాజధానికి మేం అడ్డుకాదు
అమరావతి నిర్మాణాన్ని వైఎస్సార్ సీపీ ఎంత మాత్రం అడ్డుకోవడం లేదని, రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు సర్కారు సాగిస్తున్న అవినీతిని తాము గట్టిగా నిలదీస్తున్నామని పార్థసారథి చెప్పారు.
చాగంటి వ్యాఖ్యలకు తీవ్ర ఖండన
రాష్ట్రంలో పేదలను, అణగారిన వర్గాలను కించ పరిచే విధానం చంద్రబాబు నుంచే మొదలైందని పార్థసారథి అన్నారు. చాగంటి కోటేశ్వరరావును ఉన్నత వ్యక్తిగా తాము భావిస్తామని అయితే ఆయన యాదవ కులాన్ని కించ పరిచే విధంగా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పార్థసారథి అన్నారు.