సేలం: సేలం కలెక్టరేట్‌లో ఇద్దరు మహిళలు వేర్వేరు సమయాల్లో ఆత్మాహుతి యత్నాలు చేశారు. తమ శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకునే యత్నం చేశారు. ఆ మహిళల్ని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఓమలూరుకు చెందిన ఇలంగో కూలీ కార్మికుడు. ఆయన భార్య శాంతి(48) సోమవారం ఉదయం సేలం కలెక్టరేట్‌కు వచ్చింది. తన వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను మీద పోసుకుని నిప్పంటించుకునే యత్నం చేసింది. దీన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. విచారనలో 2012లో అనారోగ్యంతో ఓమలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్టు తెలిసింది.
అయితే, వాళ్లు తన గర్భ సంచి తొలగించినట్టు వివరించారు. ఈ విషయంగా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, చివరకు కోర్టును ఆశ్రయించినట్టు పేర్కొన్నారు. కోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా, ఆ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవడంలో ఓమలూరు పోలీసులు వెనుకడుగు వేస్తున్నారని, స్వయంగా సేలం కమిషనర్ అమల్‌రాజ్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. అందుకే సేలం కలెక్టర్‌కు దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించానని, అందుకు అనుమతి లభించని దృష్ట్యా, ఆత్మహుతి యత్నం చేసినట్టు పేర్కొన్నారు.
ఈమెను అదుపులోకి తీసుకుని అలా పోలీసు స్టేషన్‌కు తరలించారో లేదో, మరో మహిళ హఠాత్తుగా లోనికి ప్రవేశించి ఆత్మాహుతి యత్నం చేయడం కలకలం రేపింది. ఆమెను కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. నామక్కల్‌జిల్లా రాశిపురానికి చెందిన గుణశేఖరన్ భార్య రాణిగా ఆమెను గుర్తించారు. ఆమె భర్త సేలం జైలులో హెడ్ వార్డెన్‌గా పనిచేసి పదవీ విరమణ పొందినట్టు తేలింది. ఆయనకు వచ్చిన పెన్షన్ రూ.7 లక్షలను జైలర్ జయరామన్, ఆయన భార్య అరుణ, స్నేహితుడు భూపతిలో మింగేసినట్టు తేలింది. తమకు ఇళ్లు ఇస్తామని నమ్మబలికి ఆ ఏడు లక్షల్ని తీసుకుని మోసం చేశారని, ఈ విషయంగా ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసినా పట్టించుకునే వాళ్లు లేక చివరకు ఆత్మాహుతి చేసుకుందామని ఇక్కడికి వచ్చినట్టు పేర్కొన్నారు.
ఇద్దరు మహిళల ఆత్మహత్యాయత్నం
Published Tue, Jul 14 2015 2:26 AM | Last Updated on Sun, Sep 3 2017 5:26 AM
Advertisement